శనివారం 30 మే 2020
Devotional - Apr 30, 2020 , 23:41:39

హరినామ స్మరణే ముక్తి మార్గం!

హరినామ స్మరణే ముక్తి మార్గం!

‘తత్తం’ అంటే యథార్థమని, స్వభావమని, ధర్మమని పలు అర్థాలున్నాయి. ‘ఒక విషయానికి సరైన కారణం తెలిపినప్పుడు దానిని యథార్థమని, సత్యమే అయినా కారణం తెలియనప్పుడు అది కల్పితమని లేదా అసత్యమని’ భావిస్తాం. ఒక యథార్థ విషయానికి కారణం తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు. కానీ, యథార్థం ఎప్పుడూ యథార్థమే. కల్పితం ఎప్పుడూ కల్పితమే. కల్పిత విషయానికి, యథార్థ విషయానికి మధ్య గల భేదాన్ని గ్రహించడం అంత సులభం కాదు. కొన్ని విషయాలు యథార్థంగా అనిపించినా, అవి యథార్థం కాకపోవచ్చు. అందువల్ల యథార్థ విషయాన్ని గ్రహించడానికి ప్రామాణిక శాస్త్రజ్ఞానంతో పాటు విచక్షణా జ్ఞానం కూడా అవసరం.

‘తత్‌', ‘త్వం’ అనే రెండుపదాల కలయిక వల్ల ‘తత్తం’ ఏర్పడింది. ‘తత్‌' అంటే ‘పరమాత్మ’. ‘త్వం’ అంటే ‘నువ్వు’ (జీవుడు). ‘తత్తమ్‌' అంటే, ‘అది నువ్వు’. అంటే, ‘పరమాత్మయే నువ్వు’ అని. దీనినే ‘తత్వమసి’ అంటున్నాం. జీవుడు అజ్ఞానం ఉపాధిగా కలవాడని, దానికారణంగా జనన, మరణచక్రంలో పరిభ్రమిస్తున్నాడని, ఈ అజ్ఞానాన్ని తొలిగించుకొని జ్ఞానాన్ని పొందటమే ‘మోక్షం’ అని, దీన్నే ‘తత్‌'ను పొందడంగా పెద్దలు చెప్తారు. ప్రపంచానికి, జీవునికి దానితోగల సంబంధం, ఆకలి, నిద్ర, సుఖ దుఃఖాలు మొదలైన ఘటనల వల్ల ప్రపంచం ‘వాస్తవం’ వలె కనిపిస్తుంది. వ్యవహారంలో ప్రపంచం ‘వాస్తవమే’ అయినా ఉపనిషత్తులు ‘ఈ ప్రపంచం మిథ్య’ అన్నాయి. అంటే, ‘లేకుండానే కలవలె కనపడుతున్నదని’ అర్థం. ‘పరబ్రహ్మం ఒక్కటే ఉన్నదని, అదే సత్యమని, ఎల్లప్పుడూ ఉండేది మాత్రమే సత్యమని, ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని జగత్తు లేనే లేదని, కనుక జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం’ అని అద్వైతులు చెబుతున్నారు. ఈ పరమసత్యాన్ని గ్రహించే శక్తి మానవమేధకు మాత్రమే సాధ్యమని, అందువల్ల అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైందని ఆధ్యాత్మికవేత్తలు అంటారు.

అందుకే, ఈ జన్మలోనే మోక్షం సాధించడానికి, పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన ‘తత్త చింతన’. ‘పుట్టుక, ఉనికి, లయం మొదలైన అంశాలతో కనిపిస్తున్న ప్రపంచమంతా పరమాత్మ మాయ. ప్రకృతి సంభవమే కాక గుణమయం కూడా. సమస్త కార్యాలన్నీ గుణాల వల్లనే జరుగుతుంటాయి. గుణభూయిష్టమైన ప్రకృతికి పరమాత్మ అతీతుడు, నిర్గుణుడు, శాశ్వతుడు’ అని తాత్తికులు బోధిస్తారు. ఈ పరబ్రహ్మం గురించి తెలుసుకోవాలనుకోవడమే జ్ఞానం. ‘అధాతో బ్రహ్మ జిజ్ఞాసా’ అని బ్రహ్మ సూత్రారంభంలో ఉన్నది. ఈ ప్రపంచానికి పరమాత్మే ‘అభిన్న నిమిత్తో పాదాన’ కారణం. అంటే కర్త, కర్మా అన్నీ తానే. పరమాత్మతోనే ఈ విశ్వం పుట్టి, పోషితమై, మరలా ఆయనలోనే లీనమవుతున్నది. ‘యతోవా ఇమాని భూతాని జాయంతే/ యేన జాతాని జీవంతి, యత్ప్రయ త్యభి సంవిశంతి’ అన్నది ఉపనిషత్‌ వాక్యం.

పరమాత్మ నిర్గుణుడే అయినా ప్రపంచంలో ధర్మం ప్రమాదంలో పడినప్పుడు దాని రక్షణ కోసం సగుణరూపంలో అవతరిస్తాడు. వివిధ కళ్యాణగుణాలలో అనేక రూపాల్లో అవతరించి, మరలా ధర్మాన్ని యథావిధిగా నెలకొల్పుతాడు. లోకకళ్యాణం కోసం అలా ‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ’ గావిస్తాడు. ‘శ్రీహరియే ఆ పరమాత్మ. వివిధ అవతారాల్లో ఆయన చేసిన కర్మలు అన్నీ లీలలు. వాటి గురించిన చర్చ, ఆయన నామగుణాల శ్రవణం, కీర్తనం వంటివన్నీ హరి చింతన కిందికే వస్తాయి’ అని శ్రీమద్భాగవతం స్పష్టం చేస్తున్నది. ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలమ్‌/ కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా’. ఈ కలియుగంలో హరినామ స్మరణే పరమగతి. అదే ముక్తికి మార్గం.


logo