శనివారం 30 మే 2020
Devotional - Apr 28, 2020 , 23:27:32

రామాయణం-రాజ లక్షణం

రామాయణం-రాజ లక్షణం

ఒక రాజ్యానికి సమర్థవంతమైన రాజు అవసరం, ఆ రాజుకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు, ఆ రాజు తెలుసుకోవాల్సిన బాధ్యతలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒక విజ్ఞానవంతుడైన రాజు లేకపోవడం వల్ల ఆ రాజ్యంలో జరిగే అనర్థాలు, అటువంటి రాజ్యంలో ప్రజల మానసికస్థితి ఎప్పుడూ ఎలా ఉంటుందన్నది, యుగాలు మారినా, తరాలు మారినా ఒక్కలాగే ఉంటుందన్నది మనకు శ్రీ మద్రామాయణ కావ్యంలో మహాకవి వాల్మీకి వేర్వేరు పాత్రల ద్వారా ఈ విషయాన్ని చెప్పించిన తీరు చూస్తే సుస్పష్టమవుతుంది.

రాజు లేని రాజ్యంలో వెల్లువెత్తే అరాచక పరిస్థితులను అయోధ్యకాండ 67వ సర్గలో, రాముని వనవాసానికి వెళ్లి, దశరథుడి మరణానంతరం, పరిస్థితులను మార్కండేయాది ఋషుల ద్వారా అనిపిస్తారు మహాకవి. రాజ్యంలో ధర్మం తప్పటం, సత్యం లేకుండుట, నేరాలు, మోస ప్రవృత్తి పెరుగడం, సజ్జనుల నిరాదరణ, దొంగతనాలు, అపరిశుభ్రత మొదలైనవి పెరిగి దేశం చిన్నాభిన్నమయ్యే స్థితి వస్తుందని దీని సారాంశం.

అలాగే, ఒక రాజనీతిజ్ఞత గల రాజు లక్షణాలు, అవలంబింపవలసిన వ్యూహాలను, వనవాసంలో ఉన్న తనను మళ్లీ అయోధ్యకు రాజుగా ఉండమని వేడుకొంటున్న భరుతుడికి రాముడు కుశల ప్రశ్నలు వేసే ప్రక్రియలో చేసిన సూచనల ద్వారా చెప్పిస్తారు వాల్మీకి. ఒక రాజు, విశ్వాసపాత్రులైన అధికారగణాన్ని ఎలా ఎన్నుకోవాలి, అంతర్గత, బాహ్య శత్రువులపైన, గూఢచార వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉండాలి, నేరాలకు తగిన శిక్షలు వేయకుండా లంచాలకు లోబడే చట్ట, న్యాయవ్యవస్థను ఎలా క్రమబద్ధీకరించాలి, దేశంలో ఉన్న మేధావులను, విజ్ఞానవంతులను ఎలా గౌరవించాలి, యుద్ధ, దండనీతి, దేశం నైసర్గిక పరిస్థితులను బట్టి వాటిని సమర్థవంతంగా ఎలా వాడుకోవాలన్న విషయాల విచారణ చేస్తారు శ్రీ రామచంద్రమూర్తి. ఇదంతా అయోధ్యకాండ నూరవ సర్గలో మనకు అగుపిస్తుంది.

రాముడు అడిగిన కుశల ప్రశ్నలకు భరతుడికి సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే, దశరథుడి మరణవార్త చెప్పకుండానే, రాముడి పాత్ర ద్వారా, అది కూడా ఏ మాత్రం పరిపాలనానుభవం లేని శ్రీరాముడు, అసలు అధికార బాధ్యతలు భరతుడు చేపట్టాడా లేదా అన్న మీమాంస లేకుండా చెప్పించడం వెనుక కొంత ఆశ్చర్యంగా అనిపించినా, బహుశా ఆ శోకవార్త విన్న తర్వాత రాముడి మానసిక స్థితిని బట్టి అక్కడ రాజనీతితో మాట్లాడటం, పాత్రౌచిత్యం కాబోదని మహాకవి భావించి ఉండవచ్చనిపిస్తుంది.

అట్లాగే రావణుడు మరణించే ముందు శ్రీరాముడు లక్ష్మణుడితో, ‘రావణుడు శత్రువైనా చక్కని రాజనీతిజ్ఞుడు. సకల శాస్త్రకోవిదుడు. కాబట్టి, నువు వెళ్లి రావణుడి దగ్గర ఆ రహస్యాలని అభ్యసించమని’ పంపిస్తాడు. అక్కడ కూడా మనకు రాజు, ‘రాజ్య లక్షణాలు’ పాఠకులకు రావణుడి పాత్ర ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. మరోచోట, శూర్పణఖ తనకు రామలక్ష్మణుల ద్వారా జరిగిన అవమాన భారాన్ని చెప్పుకున్నప్పుడు, రావణుడి ఉదాసీనమైన స్పందనకు, ఉక్రోషంతో పలికిన పలుకుల్లో కూడా వాల్మీకి ఒక ప్రజాభీష్టమైన పరిపాలన చేయాల్సిన రాజు లక్షణాలను చెప్పిస్తారు. ఈ సంఘటనలన్నీ గమనిస్తే ఒక మహాకవి, ఎన్ని యుగాలకైనా ఆపాదించబడే, తనకు తెలిసిన రాజ లక్షణాలను ఆయా పాత్రల ద్వారా ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

వాల్మీకి రామాయణం ద్వారా చెప్పిన రాజ లక్షణాలు అక్షరసత్యాలు. దేశ, కాలమాన, యుగాతీతాలు. అటువంటి పరిస్థితులను వాటిని సమర్థంగా ఎదుర్కొని తమ రాజనీతిజ్ఞతను ప్రదర్శించిన రాజులే చరిత్రలో గొప్పగా కీర్తించబడినారు. ఇప్పటికీ అటువంటి గొప్ప నాయకులు అప్పుడప్పుడు వస్తూంటారు, మనం చూస్తుంటాం. ‘అనన్యాశ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే/తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌'. ఈ శ్లోకం ప్రకారం దైవధర్మమూ, రాజధర్మమూ ఒక్కటేనన్న భావన మనకు కలుగుతుంది


logo