గురువారం 28 మే 2020
Devotional - Apr 27, 2020 , 23:16:28

శంకరులకు వందనం

శంకరులకు వందనం

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం! నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం!! భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఉపదేశించినాడు. ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’. ధర్మము క్షీణిస్తున్నపుడు సర్వజనుల శ్రేయస్సుకై భగవంతుడే స్వయంగ అవతారాన్ని స్వీకరించి పునః ధర్మాన్ని స్థాపన చేస్తాడు అని.

త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతరించి  మానవుడు ఎలా నడుచుకోవాలనే ధర్మాన్ని తెలియపరిచారు.

‘రామో విగ్రహవాన్‌ ధర్మః’

ద్వాపరములో శ్రీకృష్ణ అవతారము ద్వారా రాక్షస సంహారము గావించి భగవద్గీత అనే మహత్తర గ్రంథాన్ని అనుగ్రహించినారు. 

ఈ కలియుగములో సుమారు 1200 ఏండ్ల క్రితము అవైదిక మతాల ప్రభావముతో ధర్మము, వేదము, శాస్త్రము, యాగము, పూజా ఆచరిం చడం కాదు.. కనీసము ఆ శబ్దములు వినే పరిస్థితి లేదు.

అలాంటి దుర్భరమైన సమయంలో ఈశ్వరుడు స్వయంగ కేరళ రాష్ట్రంలో కాలటి గ్రామమున పూర్ణానదీ తీర మందు వైశాఖ శుక్ల పంచమీ రోజున శంక రాచార్యుల వారి రూపమున అవతరించినారు.

శంకరులు 8ఏండ్ల వయస్సులోనే నాలుగు వేదములను, 12 ఏండ్లలో సర్వ శాస్త్రములను అధ్యయనం చేశారు. 16 ఏండ్ల వయస్సులో భాష్య గ్రంథములను రచించినారు. 32వ ఏట దేహత్యాగము చేసినారు. స్వల్ప  కాలంలోనే ఇన్ని మహత్తరమైన పనులు మానవమాత్రునితో సాధ్యం కాదు.

‘శంభో ర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా’

ఈ అవతరాములో ఏ రాక్షస సంహారము చేయలేదు. ఆ సేతు శీతాచలము మూడుసార్లు కాలినడకన సంచరిస్తూ అవైదిక మతాలను ఖండిస్తూ, అరిషడ్వర్గములనే కామక్రోధాది అంతః శత్రువులను సంహరిస్తూ జ్ఞానబోధ చేశారు.

ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేగాని అర్థంకాని ప్రౌఢభాషలో, ఎలాంటి శబ్ద జ్ఞానము లేనటువంటి సామాన్యుడికి అర్థమయ్యేట్టుగ సులభశైలిలో భజగోవిందాది స్తోత్రాలలోనూ ప్రబో ధించారు. 

ఉపనిషత్తులలో ప్రతిపాదించబడిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటు వంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు చెప్పారే కాని ఏ కొత్త సిద్ధాంతాన్ని చెప్పలేదు. జగత్తులో చాల రకాల జనులున్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికి ధర్మ బద్ధమైన జీవనం గడపడం ఎలానో సూచించిన మహానుభావుడే శ్రీశంకర భగవత్పాదులవారు.

‘వేదోనిత్యమధీయతాంతదుదితం కర్మస్వనుష్టీయతాం’

వేదాన్ని నిత్యము అధ్యయనం చేయాలి. దాంట్లో చెప్పిన కర్మను ఆచరించాలి. తద్వారా చిత్తశుద్ధి చేసుకోవాలి. అనంతరం బ్రహ్మ చింతనము చేసి మోక్షా న్ని పొందాలని శంకరాచార్యుల వారు ప్రబోధించారు. 

వారు ప్రతిపాదించిన హిందూ ధర్మము అని పిలవబడే సనాతనధర్మము సూర్య చంద్రు లున్నంతవరకు మానవులకు అంది వారు శ్రేయోమార్గంలో పయనించి కృతార్థులు కావాలని దేశములో నాలుగు దిక్కులలో నాలు గు వేదాలకు ప్రతీకలుగ నాలు గు ఆమ్నాయ పీఠములను స్థాపించినారు.

1.తూర్పున పూరీలో గోవర్ధన పీఠము

2. దక్షిణాన శృంగేరీలో శ్రీ శారదాపీఠము

3. పశ్చిమాన ద్వారకలో ద్వారకా పీఠము

4. ఉత్తరాన బదరీలో జ్యోతిష్పీఠము

దక్షిణాన ఉన్నట్టి శృంగేరీ శ్రీశారదాపీఠము మన ప్రాంతానికి ధర్మ ప్రబోధము చేస్తూ జనులందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. శంకరాచార్యులు మొదలు కొని ఇప్పుడున్నటువంటి 36వ పీఠాధిపతులు మద్గురువరేణ్యులు వాత్సల్య మూర్తి శంకరాచార్య స్వరూపులు శ్రీమద్‌ భారతీతీర్థ మహాస్వామివారు తత్కర కముల సంజాతులు శ్రీవిధుశేఖర భారతీమహాస్వామి వారు జనులందరినీ ధర్మ మార్గమున నడుపుతున్నారు.

హిందూ ధర్మానికి అపారమైన అనుగ్రహాన్ని అందించి న శ్రీ శంకరాచార్యుల వారిని ఈ రోజు వారి జన్మదినము రోజున స్మరించడం మనందరి ఆద్యకర్తవ్యము. 


logo