శుక్రవారం 05 జూన్ 2020
Devotional - Apr 26, 2020 , 22:49:53

ధ్యానం సహజసిద్ధం కావాలి!

ధ్యానం సహజసిద్ధం కావాలి!

‘ధ్యానం’ గురించి లోకంలో రకరకాల తప్పుడు అభిప్రాయాలున్నాయి. ‘మెడిటేషన్‌' అనే ఇంగ్లీషు మాటకు పెద్ద విశేషమైన అర్థమేమీ లేదు. మీరు కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు, అది ‘మెడిటేషన్‌' అయిపోతుంది. కానీ, ధ్యానం అలాంటిది కాదు. అది మీరు అనుభూతి చెందే ఒక పరిమళం. నిజానికి ఇదొక చర్యా కాదు. ఓ గుణం. మీరు మీ శరీరాన్ని, మనసును, భావోద్వేగాలను, శక్తులను ఒక పరిపక్వ స్థితికి తీసుకొని వెళ్లగలిగితే అప్పుడు ‘ధ్యాననిష్ఠ’ సాధ్యమైనట్టే. ఇంకా వివరంగా చెప్పాలంటే, అది నేలను సారవంతం చేయడం వంటిది. అవసరమైన ఎరువులు, నీళ్లు ఇస్తూ.. ‘మంచి విత్తనం’ నాటడం వంటిది. అప్పుడు అది చెట్టు అవుతుంది. పూలూ, పండ్లూ ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, మీరు కోరుకుంటున్నారు కాబట్టి పూలూ, పళ్లూ రాలేదు. అవి రావడానికి కారణం మీరు అవసరమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగారు.

ఇది పూర్తి సహజసిద్ధంగా సంభవించిన పరిణామం. ఇదేవిధంగా ధ్యానానికి ముందు, మీలో మీరు అనువైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ‘అసలు మీరెవరు?’ ఇదీ తేల్చుకోవాల్సింది. మీలోని నాలుగు (శరీరం, మనస్సు, భావోద్వేగం, శక్తి) కోణాల్లోనూ ఒక స్పష్టతకు రండి. అప్పుడు మీలో ధ్యానం సహజంగా వికసిస్తుంది. తన లోపల తాను ఆస్వాదించి ఆనందించే ఒక పరిమళం వలె ధ్యానం భాసిస్తుంది. మీ కోసం ఒక ఉదాహరణ చెప్తాను.

కొన్నేండ్ల కిందట నేను ఒకచోట కేవలం ‘కూర్చుని’ ఉన్నానంతే. ఏమీ చేయకుండానే ఓ ‘ఆనంద తన్మయత్వం’లో మునిగిపోయాను. కానీ, కేవలం నేను మాత్రమే ఇక్కడ కూర్చొని ఆనంద పారవశ్యంలో మునిగిపోతే, అందులో అంతగా చెప్పాల్సిన విశేషమేముంటుందని అనిపించింది. నేనీ ‘మొత్తం ప్రపంచాన్ని ఆనంద పారవశ్యంలో ముంచేయగలగాలని’ అనుకున్నాను. మీకందరికీ తెలుసు, ఇది జరిగి కొన్ని దశాబ్దాలవుతున్నది. ‘ఇప్పుడు నేనిలా అయ్యాను’ (తన తెల్లటి గడ్డాన్ని చూపిస్తూ). కానీ, జనం తమ దుస్థితిని వదులుకోలేదు.

ఆధ్యాత్మిక సాధనలో భారతీయులుగా మనం ఇప్పటికే కొన్ని లక్షలమందిని చేరుకోగలిగాం. కానీ, అదే మొత్తం ప్రపంచం కాదు కదా. ప్రపంచమంటే ‘7 బిలియన్ల’ ( మొత్తం జనాభా: సుమారు 700 కోట్లు) ప్రజలని నా భావన. ఇవాళ సమాజాలు రోజురోజుకూ విచిత్రంగా తయారవుతున్నాయి. ఎందుకంటే, భౌతికంగా మనం సాధించగలిగినవన్నీ సాధించాం. ఇప్పుడిక ఏం చేయాలో వాళ్లకు తెలియడం లేదు. మీరు చేయగలిగిందల్లా మీ జుట్టు కత్తిరించుకోవడమో, ఆపాద మస్తకం టాటూ చేయించుకోవడమో మాత్రమేనా! మరో కొత్త పని మీరేం చేయగలరు? ఏదో ఒకటి కొత్తది చేయాలి కాబట్టి, జీవితానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అందువల్లే, ఇప్పుడు సమాజం ఆధ్యాత్మిక ప్రక్రియకు సన్నద్ధంగా ఉంది. కానీ, సరైన మార్గదర్శనం లేకపోతే అది వీగిపోతుంది. ఒక నిర్దిష్ట దర్శనానికి గాని, సిద్ధాంతానికి గాని కట్టుబడని మతాతీత ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రస్తుతం చాలా అవసరం. అది ఎంతో సాదాసీదాగా, వారిని అంతరంగం వైపు మరల్చేదిగా ఉండాలి.

ఇప్పటిదాకా అక్కడా, ఇక్కడా కొంతమందిని మనం (భారతీయులం) చేరుకోగలిగాం. కానీ, అది భారీ ఎత్తున జరుగలేదు. ఇవ్వాళ మనకు లభిస్తున్న సాంకేతికతతో మనం దీన్ని పెద్ద ఎత్తున సాధించగలం. ఒక తరం ప్రజలుగా మనం చేయగలిగిన అతిముఖ్యమైన కార్యం ఇది. మానవ చైతన్యం కోసం మనం పెద్ద స్థాయిలో చేయగలిగే అవకాశం మనకు కలగడం మన భాగ్యం. మీరు బాహ్యపరమైన ఇంజినీరింగ్‌ అతిగా చేసినట్లయితే మనకీ భూగ్రహం మిగలదు. మానవుని శక్తులు అంతరంగంలోకి తిరిగి తమను తాము సరిచేసుకోవాలి. బాహ్యానికి నష్టం కలిగించకూడదు. లోపల చేయవలసిన పని చాలా ఉంది. ఈ భూ మండలం మీద, అత్యుత్సాహంతో చాలా శ్రమించే స్వభావం కలిగిన సమాజాలకు మనం పెద్ద ఎత్తున ఈ విధమైన ఆధ్యాత్మిక కోణాన్ని అందించకపోతే వాళ్ల శ్రమ ఈ భూమండలాన్ని నాశనం చేస్తుంది. అందరికీ ప్రేమాశీస్సులతో..


logo