శుక్రవారం 05 జూన్ 2020
Devotional - Apr 25, 2020 , 22:49:29

అంతా పరమాత్మే!

అంతా పరమాత్మే!

  • అద్వైత తత్త్వవేత్త శంకరాచార్యులు

ఈనెల 28వ తేది ఆదిశంకర భగవత్పాదులు, రామానుజాచార్యుల జయంతులు. ఈ సందర్భంగా భారతీయ తాత్వికతను సుసంపన్నం చేసిన ఈ ఇద్దరు మహానుభావుల చింతనల సారాన్ని క్లుప్తంగానే పరిచయం చేసే ప్రయత్నంగా ఈ రెండు చిన్న వ్యాసాలు.

మన దేశంలో బహుళ ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలలో ముఖ్యమైంది అద్వైతం. తర్వాత వచ్చిన సిద్ధాంతాలన్నింటి మీదా దీని ప్రభావం ఉన్నది. ఏదో ఒక రూపంలో ఈ సిద్ధాంతాన్ని, ఏదో ఒక సందర్భంలో శంకర భగవత్పాదుల పేరునీ, వినని వారు మన దేశంలో చాలా అరుదుగా వుంటారు. ఇంత ఎక్కువ ప్రచారం రావటం వల్ల ఈ సిద్ధాంతానికి అనేక అపార్థాలు పుట్టుకొచ్చినాయి. అందులో ముఖ్యంగా ఈ సిద్ధాంతం ప్రతిపాదించే ‘మాయావాదం’ ఒకటి. 

శంకర భగవత్పాదులు ‘ఈ ప్రపంచం మాయ’ అని అన్నారని, ‘మాయ’ అంటే ‘లేనిది’ అనే అర్థంలో వాడారని, మామూలు మనుషులే గాక చాలామంది మేధావులు కూడా చెప్పుకోవడం కద్దు. కానీ, శంకర భగవత్పాదుల ఉద్దేశం ఇదైనట్టు కనిపించదు. శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ఉద్దేశాన్ని విపులీకరించి చెప్పారు.  “మనకు కనిపించే ఈ స్థూల ప్రపంచం వాస్తవపు ప్రతిబింబమనో, వాస్తవికతకు చెందిన ఛాయ అనో చెప్పుకోవచ్చు. అంతేకాని, ‘మాయ’ అంటే ‘లేనిది’ అని అర్థం చెప్పుకోవడం తప్పు. ఇది అస్తిత్వానికీ, నాస్తికత్వానికీ మధ్యన వుండే రూపం. దీని ఉనికి సాపేక్షమైందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి,  సాపేక్ష సిద్ధాంతం వీరి మాయావాదానికి దగ్గరలో వుంటుందని మనం భావించవచ్చు. 

కొన్ని హద్దులకు లోబడి వున్న జీవి అనంతమైన దాన్ని ఊహించలేకపోవచ్చు. తన్ను తాను పరిపూర్ణమైన వానినిగా భావించుకోవచ్చు. అంత మాత్రాన అంతా వైరుధ్యం వుందని నిర్ధారణ చేసుకోవడానికి వీల్లేదు. అలా వైరుధ్యం ఉన్నట్లుగా అజ్ఞానం వల్ల కనిపిస్తుంది. ఆ అజ్ఞానం నశిస్తే బ్రహ్మ పదార్థం ఒకటేనని తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తే ఏకత్వమున్న చోట భిన్నత్వాన్ని కల్పించుకోవడాన్ని ‘మాయ’ అన్నారు, శంకర భగవత్పాదులు. అంతేకాని, అసలు ఈ ప్రపంచం లేదని కాదు.

ఈశ్వర రూపంలో బ్రహ్మ

ఈ ప్రపంచాన్ని శంకరులు వ్యవహారిక అస్తిత్వం గల దానినిగా పరిగణించారు. ఒక దృష్టితో చూస్తే ఈ ప్రపంచం, సారం, బ్రహ్మ ఒకటేనని చెప్పారు కనుక ఈ రెండూ వాస్తవికమైనవనే మనం భావించవచ్చు. ‘ఛాందోగ్యోపనిషత్తు’లో ప్రవచితమైన ‘సర్వం ఖల్విదమ్‌ బ్రహ్మ’ అనే సూత్రాన్ని ఆయన నిరంతరం ఉచ్ఛరిస్తూ ఉండేవారు. బ్రహ్మం నుంచి ఈ ప్రపంచాన్ని విడివడిన దానినిగా చూడటం కృత్రిమం. ఈ కృత్రిమ దృష్టికి కారణం అజ్ఞానమనీ, జ్ఞాన సముపార్జనతో ఈ దృష్టి కరిగిపోతుందనీ వారు చెప్పారు.  అయితే, ఈ వ్యావహారిక ప్రపంచానికి అధిపతి ఈశ్వరుని రూపంలో వున్న బ్రహ్మ. ఈయన సృష్టి స్థితి లయకారకుడు. ఈ విధంగా వ్యావహారిక ప్రపంచానికి ఈశ్వరరూపంలో ఉన్న బ్రహ్మ అధిపతి అని చెప్పి ఆద్యంతాలు కలిగిన సృష్టికి ఆయన అస్తిత్వాన్ని కలిగించారు. సృష్టికర్తతోపాటు సృష్టి నిజమైంది. సృష్టిలో ఉన్న పరిమిత వస్తువులు, జీవాత్మలు నిజమైనవి.


logo