శనివారం 06 జూన్ 2020
Devotional - Apr 25, 2020 , 22:48:21

భక్తితోనే ముక్తి!

భక్తితోనే ముక్తి!

  • విశిష్టాద్వైత తత్త్వవేత్త రామానుజాచార్యులు

భగవంతునికీ, ప్రపంచానికీ వున్న సంబంధాన్ని నిర్వచించటానికి రామానుజాచార్యులు తమ శక్తిని కేంద్రీకరించారు. ‘జీవాత్మలు తమ ఉనికికి భగవంతునిమీద ఆధారపడినా, అవికూడా వాస్తవికమైనవే. ఈ ప్రపంచం ఒక ఆధ్యాత్మిక సూత్రం మీద ఆధారపడి వుంది. అది మాయ కాదు, సత్యమే’ అని భావించారు. అందువల్ల జీవాత్మలకు, అవి సిద్ధిని పొందిన తర్వాత కూడా వ్యక్తిత్వం ఉంటుంది. పరమాత్మలో ఏకం అయిపోవు. 

పదార్థ ప్రపంచం, జీవాత్మలూ వ్యక్తిత్వం ఉన్నవి అయినంత మాత్రాన పరమాత్మా ఇవీ ఒక్కటి కాదు. పరమాత్మ ఎప్పుడూ అసమగ్రం కాదు. పదార్థం జడం, అంటే చైతన్య రహితం అయింది. జీవాత్మలు అవిద్యకూ, బాధలకూ గురై ఉంటవి. కాని, ఇవన్నీ కలిసే వుంటవి. పరమాత్మకు చెందిన శరీరంగా మిగిలినవి ఉంటవి. పరమాత్మకు విడిగా అవి వుండవు. అంటే, అద్వైతాన్ని వొప్పుకొంటూ, దానికొక విశేషం చేర్చారన్న మాట రామానుజాచార్యులు. ‘వాస్తవికత అద్వైతమే. కాని, అందులో అనేకత్వం ఉండటానికి వీలున్నది’ అన్నారు. అందువల్ల ఆయన తత్వశాస్ర్తాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు.

భారత తత్వశాస్త్రంలో రాధాకృష్ణ పండితులు చెప్పినట్లు జ్ఞానం అంటే, ‘సిద్ధాంత విద్య’ అని శంకరాచార్యులు ఎక్కడా చెప్పలేదు.  పైగా ఆయన జీవితంలో హృదయం అగ్రస్థానం వహించిన అనేక ఘట్టాలు వున్నాయి. కాని, వారి శిష్యులు అద్వైత దృష్టిలో హృదయానికి స్థానం లేకుండా చేశారు. అన్నిటికీ మేధస్సే కేంద్రం అయి కూర్చుంది. ఇంకేముంది, భక్తి మూలపడింది. ‘అహం బ్రహ్మాస్మి’ అనే దృష్టిలో భక్తికి చోటు ఎక్కడ? భక్తి ఎవరిపట్ల చూపించేటట్లు? ఎవ్వరిని ప్రార్థించేటట్లు? తప్పు చేసిన వారు గాని, దుర్మార్గులు కాని ఎలా ఉద్ధరించబడేటట్లు?’.

మానవుని అనుభూతులను అజలోకి తీసుకొని, వాటికి ఉచిత స్థానం ఇవ్వని ఈ దృష్టిని వ్యతిరేకించారు రామానుజాచార్యులు. వారు ఈ ప్రపంచం మాయ అనే వాదాన్ని అంగీకరించలేదు. భగవంతుని ఈశ్వరరూపంలో దర్శించి, ప్రతిష్ఠించారు. జీవాత్మకు వ్యక్తిత్వం ఉన్నదన్నారు. ‘పరమాత్మతో అది ఎన్నడూ ఏకం అవదు. దాని దరికి చేరి సహచరత్వాన్ని పొందుతుంది’ అన్నారు. 

భగవంతుని అధీనంలోనే అంతా!

‘విశిష్టాద్వైతం’ అంటే ఏమిటి? అనే ప్రశ్నకు శ్రీ టి.రాజగోపాలాచారియార్‌ ‘ఆచార్యత్రయం’ అనే గ్రంథంలో ఇలా జవాబు చెప్పారు. “విశిష్టాద్వైతం విశేషత్వాన్ని కలిగివున్న అద్వైతం. ఉన్నది భగవంతుడే. వున్నట్లు మనకు కనిపించేవన్నీ ఆయన విభూతులే, విశేషాలే. వాటిని ‘శక్తి’ అనవచ్చు. ఈ విశేషాలను ‘చిత్తు’, ‘అచిత్తు’ కింద విభజించవచ్చు. అంటే, ‘జీవాత్మ’, ‘పదార్థం’ అన్నమాట. అద్వైతులు వీటిని ‘అనిత్యం’ అంటారు. ‘అవిద్య ఫలతం’ అంటారు.” కాబట్టి, నిజంగా బ్రహ్మ పదార్థానికి విశేషాలు అంటూ వుండవు. రామానుజులకు ఈ విశేషాలు నిత్యమైనవీ, శాశ్వతమైనవీ. కాని, బ్రహ్మం అధీనంలో ఉండేవి. బ్రహ్మ పదార్థం లేకుండా ఇవి ఉండవు కనుక, బ్రహ్మ పదార్థానికీ వీటికీ వైరుధ్యం లేదు. విశిష్టాద్వైతం ‘ఈ విశేషాలు సంపూర్ణ స్వతంత్రత గలవని గాని, బ్రహ్మ పదార్థానికి విడిగా వుండగలవని గానీ’ అంగీకరించదు. విశిష్టాద్వైతులకు ఏకత్వం అవిభాజ్యమైంది కాదు. అనేకత్వంలో కూడుకున్నది. ‘అఖండ భావం’ ఉన్నదని రామానుజులు స్పష్టంగా చెప్పారు.


logo