శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Apr 25, 2020 , 22:46:31

యోగులే స్వేచ్ఛాజీవులు!

యోగులే స్వేచ్ఛాజీవులు!

ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతులను యోగ పరిభాషలో ‘చిత్తవృత్తుల’ని పిలుస్తారు. ఈ ఐదింటిలో ‘స్మృతి’ అనేది ఎంతో బలం కలిగింది. అందరికీ ప్రమాణపూర్వకమైన జ్ఞానం ఉండకపోవచ్చు. ఒకదాన్ని మరొకదానిగా భావించే వికల్ప జ్ఞానమూ ఉండకపోవచ్చు. ‘లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు’ ఊహించే మనస్తత్వమూ లేకపోవచ్చు. కానీ, నిద్ర మాత్రం అవసరమే. నిద్ర కూడా ఒక చిత్తవృత్తిగా చెప్పారు. మనసును తామస గుణం ఆవేశిస్తే నిద్ర వస్తుంది. నిద్రలో ఇంద్రియాలు, మనస్సూ పని చేయవు. చేతనుడైన జీవుడు ఒక విధంగా ‘అచేతనుడా’ అన్నట్లు ఉంటాడు. కానీ, యోగంలో మాత్రం జీవుడు ఎరుక కలిగి ఉండాలి.

స్మృతి విషయానికి వస్తే ‘ఉత్తరోత్తరం ప్రధానం’ అన్నట్లు చిత్తవృత్తులలో దానిదే ‘పై చెయ్యి’ అనిపిస్తుంది. స్మృతి లేని మనిషి సామాన్యంగా ఉండడు. స్మృతులు భూతకాలానికి సంబంధించినవి. అంటే, గడిచినకాలానికి సంబంధించినవి. మనం జీవిస్తున్న కాలానికి సంబంధించిన స్మృతులు కూడా ఉంటాయి. కానీ, అవి పూర్వస్మృతుల వలె అంత బలమైనవి కాకపోవచ్చు. బలమైన స్మృతులు మనల్ని ఎల్లవేళలా వెన్నంటి ఉంటాయి. మనల్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే ఈ బలమైన స్మృతులే మన సుఖజీవనానికి అడ్డంకిగా నిలుస్తాయని యోగానుభవం కలిగినవారు చెప్తారు.

స్మృతులనే ‘జ్ఞాపకాలు’ అంటాం. ఈ జ్ఞాపకాలు రెండువిధాలు. గత జన్మకు సంబంధించినవి, ఈ జన్మకు సంబంధించినవి. గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలే మనలోని సంస్కారాలకు హేతువులవుతాయి. ఒకరొక విధంగా, మరొకరు మరొకవిధంగా వ్యవహరిస్తున్నారంటే వారి మీద మానసికంగా జ్ఞాపకాల ప్రభావం ఉందన్న మాట. ‘సన్మార్గుడు’, ‘దుర్మార్గుడు’ అనే మాటలు అందుకే పుట్టాయి. మనిషిగా పుట్టినప్పుడే అతడు గత జన్మకు సంబంధించిన స్మృతిని కోల్పోతాడు. కానీ, ఆ స్మృతులే ఈ జన్మలో ఒకవిధమైన మనిషి తయారు కావడానికి సహకరిస్తాయి. మనం నిజానికి గతమనే సాలెగూడులో ఉన్నాం. బహుశా అందులో మనకు రక్షణ ఉంది కనుక అలా ఉన్నామేమో. కానీ, గతమనేది స్మృతికి సంబంధించింది, అదే బంధనం. మనం ఎక్కువగా గతమనే బంధనంలో కట్టి వేయబడినాం. బంధనం బంధనమే, చిన్నదైనా పెద్దదైనా. బంధనాల్లోంచి బయటపడటమే యోగం.

‘బంధనం’ అనగానే ‘కర్మ’ గుర్తుకువస్తుంది. జీవున్ని బంధించేది కర్మ. బంధ విముక్తుణ్ణి చేసేది యోగం. మనం చేసిన కర్మలు జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. అవి ఆయా ఫలాలను మనతో అనుభవింపజేస్తాయి. నిజమే, మనం ఏ జన్మలో చేసిన కర్మ కూడా ఈ జన్మలో వదిలిపెట్టదు. సుఖమో, దుఃఖమో కల్గించకమానదు. కర్మను యోగంగా తెలుసుకొన్న వారు ‘కర్మ బంధనాల’ నుంచి విడివడుతారు. ‘కర్మయోగం’ అంటే ఏమీ లేదు, సత్కర్మలు చేస్తూ, వాటి ఫలాలను కోరకపోవడమే. కర్మఫలాలను త్యాగం చేయడమే కర్మయోగం. ఇంకా చెప్పాలంటే, కర్మఫలాలను భగవంతునికి అర్పించడమే మనం చేయాల్సిన పని. దీన్నే యోగదర్శనకారుడైన పతంజలి ‘ఈశ్వర ప్రణిధ్యాం’ అన్నాడు.

కర్మఫలాల నుంచి మనం బయటపడితే కర్మలకు సంబంధించిన జ్ఞాపకాలు (స్మృతులు) మనల్ని వెన్నంటి ఉండవు. అవి క్రమంగా తొలిగిపోతాయి. అందుకే, యోగులు ఎప్పటికప్పుడు కర్మ పట్ల జాగ్రత్త వహిస్తారు. కర్మ ఫలాలు అంటుకోకుండా చూసుకుంటారు. కర్మ అనేది ముట్టుకొంటే అంటుకొంటుంది. దాని సంస్కారం మనస్సు మీద బలంగా ఉండి, మనతో జన్మలెత్తేలాగా చేస్తుంది. ఎవరైతే కర్మయోగాన్ని అవలంబిస్తారో వారికి స్మృతులు హాని చేయవు. వారు వాటిని అధిగమిస్తారు. యోగాభ్యాసానికి ఈ స్మృతులు అవరోధంగా ఉంటాయి. కనుక, యోగులు సన్యాసాశ్రమంలో ఉండటానికే ఇష్టపడుతారు. ఒకవిధంగా కర్మ బంధనాల నుంచి జీవించి ఉండగానే విముక్తి కలిగించేది సన్యాసాశ్రమం. జ్ఞాపకాలను తీయని కలలుగా భావిస్తారు సంసారులు. కానీ, యోగులు జ్ఞాపకాలకు అతీతమైన స్థితిలో ఉంటారు. వారికి మాత్రమే స్వేచ్ఛగా జీవించే అవకాశం లభిస్తుంది. కనుక, యోగులే స్వేచ్ఛాజీవులు.


logo