బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 24, 2020 , 23:51:54

ప్రకృతి రక్షణే లక్ష్మీ ఆరాధన!

ప్రకృతి రక్షణే లక్ష్మీ ఆరాధన!

‘దంభో దర్పో భిమానశ్చ క్రోధః పారుష్యమేవచ/ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపద మాసురీమ్‌’ (భగవద్గీత). ‘ఓ అర్జునా! గర్వం, దురభిమానం, కోపం, వాక్పరుషత్వం, అజ్ఞానం మొదలైనవి ఆసురీ సంపద కలవాని లక్షణాలు’ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని ‘దైవాసుర సంపద్విభాగ యోగం’లో అర్జునుని ఉద్దేశించి బోధిస్తాడు. కొందరు మానవులలో లోకానికి అపకారం చేసే లక్షణాలతో కూడిన దుర్గుణాలుంటాయి. వాటినే ‘ఆసురీ లక్షణాలు’ (ఆసురీ సంపద) అంటాం. అంటే, రాక్షస లక్షణాలు. ఇవి కలవారు తాము జీవిస్తున్న సమాజానికే అపకారం తలపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడరు. భగవానుడు వీటిని వివరిస్తూ దుర్గర్వం, దురభిమానం, కోపం, మాటల్లో కాఠిన్యం, అజ్ఞానం వంటి లక్షణాలను స్పష్టంగా చెప్పాడు.

గర్వం మనిషిని అంధకారంలోకి నెట్టేస్తుంది. కన్ను మిన్ను కానని తనాన్ని పెంచుతుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కాని, సమాజంలోని తన తోటివారితో స్నేహాన్ని కానీ చేయనియ్యదు. ‘అన్నీ తనకే తెలుసునని, తానే అందరికన్నా అధికుడినని’ భావించి తన ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తించి లోకానికి ఎంతో నష్టం కలిగిస్తుంటాడు. అది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాక ప్రపంచానికి కూడా ప్రమాదకారిగా మారుతుంది. గర్వం కారణంగా ఆ వ్యక్తి దీన్ని గుర్తించే స్థితిలో ఉండడు. ఎవరు చెప్పినా విని ఆచరించే తత్తమూ ఉండదు. రెండో అసుర లక్షణం దురభిమానం. ఏ వ్యక్తికైనా అభిమానం ఉండటం మంచిదే. కానీ, గర్వం వల్ల దురభిమానం ఎక్కువైతే తాను లోకకంటకుడై ప్రపంచాన్ని హింసిస్తూ, నశింపజేస్తుంటాడు. పౌరాణిక గాథల్లో తారసపడే రాక్షసులంతా ఇటువంటి లక్షణం వల్లే నశించిపోయారు.

మూడవదైన కోపాన్నే ‘క్రోధమని’ అంటారు. దీన్ని ‘ఆసురీ సంపద’లో ఒకటిగా చెప్పడానికి కారణం, ‘భగవంతుని దృష్టిలో ఇది సత్పురుషులకు, దైవీ సంపదలున్న వారికి తగింది కాదని’ వ్యక్తపరచడానికే. ‘తన కోపమే తనకు శత్రువన్న’ నీతి మనకు తెలియంది కాదు. ‘ఈ కోపం ఎందుకు వస్తుంది?’ అన్న దానినీ భగవద్గీత చెప్పింది. ‘కామాత్క్రోధో భిజాయతే’ అన్నాడు శ్రీక్షష్ణ పరమాత్మ. తీరని కోరికలు కోపంగా మారి మనిషిని పతనం దిశగా నడిపిస్తాయి. అనవసర విషయాలపై ఆసక్తి పెంచుకొన్న మానవునికి ఆ విషయాలపై కోరికలు కలుగుతాయి. అవి తీరకపోవడంతో అతనిలో క్రోధం జనిస్తుంది. ఇంతేకాదు, ఆ కోరికలు ఆ వ్యక్తిని సన్మార్గం నుంచి తప్పించే అవకాశమూ ఉంటుంది. పర్యవసానంగా, పుట్టిన కోపం అంతటితో ఆగదు. అతనిని దారి తప్పేలా చేస్తుంది. ఫలితం సమాజంలో వినాశనం. ఈ క్రోధం మనిషిని మూర్ఖునిగా కూడా మారుస్తుంది. ఫలితం అతనికే గాక అతను జీవించే సమాజానికీ చేటు తెస్తుంది. దీన్ని చాటిచెప్పే ఉదంతాలు చరిత్రలో ఎన్నెన్నో. మనిషి కోపం సృష్టించే విధ్వంసం ఎంత అసాధారణమో భారతీయ పౌరాణిక గాథలూ వెల్లడించాయి.

మరొక అసుర లక్షణం ‘వాక్పారుష్యం’. అంటే, పరుషత్వం (కాఠిన్యం)తో కూడిన మాటలు. ఎవరైనా తన ఎదుటివారి విషయంలోకాని, ఇతరుల పట్ల ప్రవర్తించే తీరులోకాని తెలిసేది వారి మాట తీరువల్లనే. అందుకే, మాటల్లో మెత్తదనం, ప్రేమ, ఆప్యాయత, వినయం వంటివి ఉంటేనే అన్ని పనులూ సవ్యంగా ఫలితాన్నిస్తాయి. ఎదుటివారు బాధపడేలా మాట్లాడటం కుసంస్కారం. ఇతరుల మనసును నొప్పించేరీతిలో మాట్లాడటమే ‘వాక్పారుష్యం’. సకల ప్రమాదాలకు, జరుగరాని పనులకు ప్రోత్సహించేది ఈ వాక్పారుష్యమే. దీనిని రాక్షస లక్షణంగా చెప్పడానికి కారణం ఇదే. మాట మీద మనిషికి నియంత్రణ అవసరమన్నది దీనివల్ల తెలుస్తున్నది. అజ్ఞాన ఆభిజాత్యాలన్నవి కూడా ‘ఆసురీ సంపద’కు సంబంధించినవే. మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం దిశగా ప్రయాణించాలనే ‘అసతోమా సద్గమయ’ అన్నాయి మన శాస్ర్తాలు. అన్ని అనర్థాలకూ అజ్ఞానమే మూలం. మనిషిలో పెరిగే అహంకారానికీ, దుష్ట భావాలకూ పునాది ఇదే. ‘అజ్ఞానంతో తానే గొప్పవాణ్ణి’ అనే ఆభిజాత్యం పుడుతుంది. ఈ తీరు లోకానికీ ప్రమాదకరం. కనుకనే, ప్రతి వ్యక్తీ అజ్ఞానాన్ని పోగొట్టుకొని, తద్వారా ఆభిజాత్యాన్ని అదుపులో పెట్టుకోవాలి.

శ్రీకృష్ణ పరమాత్మ ‘భగవద్గీత’ను బోధించింది కేవలం అర్జునునికే కావచ్చు. కానీ, ఈ కారణంగానే కదా యావత్‌ ప్రపంచానికి ఇది అద్భుత విజ్ఞానాన్ని అందించింది.logo