గురువారం 28 మే 2020
Devotional - Apr 23, 2020 , 22:21:14

ప్రకృతి రక్షణే లక్ష్మీ ఆరాధన!

ప్రకృతి రక్షణే లక్ష్మీ ఆరాధన!

లక్ష్మీ అష్టోత్తర నామాలలో మొదటినామం పేరే ‘ప్రకృతి’. ప్రకృష్టమైన కృతి. స్పష్టంగా, సమగ్రంగా తయారు చేయబడిందని అర్థం. మనచుట్టూ ఉన్న పాంచభౌతిక శక్తికే మనం ‘ప్రకృతి’ అని పేరు పెట్టుకున్నాం. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాదులు పంచభూతాలు. ఓజోన్‌ పొర బయటి సూర్యరశ్మికి, లోపలి సూర్యరశ్మికి చాలా మార్పు ఉంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం ఓజోన్‌ పొర బయట చాలా ఉంటుంది. అక్కడ జీవికి మనుగడ ఉండదు. ఓజోన్‌ పొర లోపలి వాతావరణం జీవనానికి వినియోగమవుతుంది. ఈ శక్తికే మనవారు శ్రీ లేదా శ్రీమాత లేదా లక్ష్మీ అని పేరు పెట్టుకున్నారు. ‘శ్రీసూక్తం’ పూర్తిగా ఈ అంశాన్నే మనకు తెలియజేస్తున్నది. ఓజోన్‌ పొరను ‘హిరణ్యప్రాకార’గా సూచించింది శ్రీసూక్తం. అంతేకాదు, ఓజోన్‌ పొరను, ప్రకృతిని కాపాడుకునేందుకు భూమిమీద బిల్వవృక్షాలను పెంచాలని కూడా శ్రీసూక్తం నిర్దేశిస్తుంది.

లక్ష్మీ స్వరూపాన్ని గమనిస్తే పద్మంలో కూర్చున్నట్లుగానూ, పద్మాలను చేతిలో ధరించినట్లుగా కనిపిస్తుంది. ‘పద్మం’ వికాసానికి, చైతన్యానికి సంకేతం. సూర్యుడు రాగానే పద్మాలు వికసించడం మనం చూస్తూనే ఉంటాం. పద్మం వికసించడం అంటే పద్మంలోని లక్ష్మీదేవి ఈ భూమిపైన వేర్వేరు రూపాలతో వ్యాపించడమనే అర్థం. సూర్యరశ్మి సౌర మండలమంతా ఉన్నా, భూ వాతావరణ పరిమితుల్లోని సూర్మరశ్మి పూర్తిగా వడగట్టబడి మానవ జీవనానికి ఉపకరించి, వికాసానికి హేతువైంది. అందుకే, పాంచ భౌతికశక్తిగా మారిన సూర్మరశ్మి (లక్ష్మీదేవి) పద్మస్థితగా, పద్మప్రియగా, పద్మినిగా, పద్మహస్తగా, పద్మాలయగా, పద్మాక్షిగా గుర్తింపు పొంది, ఆరాధనలు అందుకుంటున్నది.

లక్ష్మీదేవి రూపాల్లో ఎక్కువమంది ఉపాసించేది ధనలక్ష్మిని మాత్రమే. రూపంతో కూడుకున్నది ధనం. కనపడేదేదైనా తొందరగా నాశనమవుతుంది. అయినా, అవసరం కొద్దీ మనిషి కేవలం ధనలక్ష్మి రూపాన్ని మాత్రమే ఎక్కువగా స్తుతిస్తూ, నమస్కరిస్తాడు. కానీ, మనలో ఉండే ధైర్యం, ఆరోగ్యం, సంతానశక్తి, విద్య, అందం, సంతోషం, శక్తి, సామర్థ్యం అన్నీ లక్ష్మీరూపాలే. ఇవే లేకపోతే ధనం ఉన్నా ప్రయోజనం లేదు. వీనిలో ఏవైనా లేకపోతే అప్పుడు వాటి విలువ మనకు అర్థమవుతుంది. అయినా, రూపమున్న ధనం కన్నా రూపరహిత శక్తులైన తుష్టి, పుష్టి, ధృతి, ద్యుతి, జ్ఞానం, తృప్తి, తేజస్సు మొదలైనవి మాత్రమే అసలైన లక్ష్మీరూపాలు. ‘ఐశ్వర్యం’ అనేది వేర్వేరు రూపాల్లో అనుభవించదగిందే. అది కేవలం ధనం కాదు.. సంపద. అంతేకాదు, భూమ్యాకర్షణ వల్ల మేఘవలయం ఏర్పడి, వర్షం కురుస్తున్న విషయాన్ని మనకు గజలక్ష్మీ రూపం వ్యక్తీకరిస్తుంది. ఆ రూపంలో అమ్మవారికి హేమకుంభాలతో స్నానం చేయించే విధానమంతా ఈ ప్రకృతిలోని వర్షవిధాన చక్రాన్ని స్పష్టంగా సూచిస్తుంది. పరిశీలించే నయనాలుంటే భారతీయ దేవతా ప్రతిమలన్నీ ఇలా విజ్ఞానాత్మకాలే.

శ్రేయస్సును కలిగించేది శ్రీ. శ్రేయస్సు మనకు సమగ్రంగా ఉండాలి. శరీరంలో కాని, జీవితంలో కాని ఒక భాగంలో మాత్రమే ఉండకూడదు. భారతీయులు ఎదుటివారిని సంబోధించే సందర్భంలో పేర్లకు ముందుగా శ్రీ/శ్రీమతి, బ్రహ్మశ్రీ, రాజశ్రీ వంటి శబ్దాలను వినియోగించడం వెనుక వారివారి శ్రేయస్సును కోరుకోవడం, వారికి లక్ష్మీ అనుగ్రహం నిరంతరం చేకూరాలని కాంక్షించడం ఉంటుంది. ఉత్తరాలు రాసినప్పుడు కూడా ‘శ్రీయుత...’తో మొదలుపెట్టడం సంప్రదాయం. దీన్నిబట్టి, ఈ శ్రీ శబ్దం, లక్ష్మీ భావన, శ్రీమాత విధానం మన జీవితాలపై ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతున్నది. ఇలా ప్రకృతి శక్తుల ప్రభావాలను అధ్యయనం చేసి నిత్యజీవనంలో భాగం చేసిన విజ్ఞానం, ధర్మం కేవలం భారతీయులదే.

ఈ పాంచభౌతిక శక్తికి ఏ రూపంలో ఇబ్బంది ఏర్పడినా మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అవన్నీ ఒక క్రమపద్ధతిలో, సమపాళ్ళలో ఉన్నంతవరకు మాత్రమే మనిషి జీవనం సమగ్రం. లేకుంటే ఏ తుపానులో, సునామీలో, భూకంపాలో, అగ్ని ప్రమాదాలో, క్రిమికీటకాదుల వల్ల కలిగే రోగాలో మనల్ని శాసిస్తుంటాయి. కాబట్టి, లక్ష్మీదేవి అర్చన అంటే ప్రకృతిని కాపాడటమే. బిల్వవృక్షాలతో సహా అనేక వృక్షాలను పెంచడమంటే కాలుష్యాలను తగ్గించడమే. ‘ఆరాధన’ అంటే కేవలం రూప ఆరాధన, పూజ, స్తుతి మాత్రమే కాకూడదు. మూలాన్ని విశ్లేషించి, తెలుసుకొని మనతో సహా ఈ ప్రపంచంలోని జీవులన్నీ ప్రశాంతంగా జీవించగలిగేట్లుగా చేయడమే నిజమైన ఆరాధన. ‘శ్రీర్లక్ష్మీ: వరలక్ష్మీశ్చ ప్రసన్నా జన సర్వదా’.


logo