ఆదివారం 31 మే 2020
Devotional - Apr 22, 2020 , 23:32:18

భక్త మానవులకే భాగవతామృతం!

భక్త మానవులకే భాగవతామృతం!

శ్రీమన్నారాయణుని అంశావతారమైన వేదవ్యాసుని కొడుకే శుకుడు. కారణజన్ముడైన శుకుని జన నం పరమ పవిత్రం. ఒకచోట రెండు చిలుకలు అన్యోన్య ప్రేమానురాగాలతో సంసార మధురిమలను ఆస్వాదిస్తూ, తమ జీవిత ప్రతిబింబాలైన పిల్లలకు మేతను అందిస్తున్న ‘అపురూప దృశ్యా న్ని’ వ్యాసుడు చూశాడు. తనకూ సంతానం కలిగితే అంతటి సంతోషంలో తేలిపోవాలనే సంక ల్పం వారికి కలిగింది. అందుకోసమే తపోదీక్ష ప్రారంభించాడు. తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, వ్యాసునికి ‘పంచభూతాలతో సమానుడైన, జ్ఞానవిభా సమానుడైన పుత్రుణ్ణి’ ప్రసాదిం చి, అంతర్ధానమయ్యాడు.

ఫలితంగా ఒకనాడు వ్యాసుడు అగ్నికార్యం కోసం అరణి (హోమాగ్నిని పుట్టించే కొయ్య)ని మథిస్తూ ఉంటాడు. అప్పుడు దానినుండి దివ్యతేజోవంతుడైన శుకుడు ఉద్భవించాడు. శుకశబ్దానికి ‘రామచిలుక’ అని ఒక అర్థం కాగా, ‘చరించేవాడు’ (శుకధాతువు గత్యర్థకం కాబ ట్టి) అని మరొక అర్థం ఉంది. శుకుని అంతరంగం నిరంతరం పరబ్రహ్మంలోనే చరిస్తుంటుంది. విశేషించి, ఆవుపాలు పితికేంత కొద్ది సమయమైనా శుకుడు గృహస్థుల ఇండ్లలో ఉండకుం డా, నిరంతరం సంచరిస్తూంటాడు. ఆ మాత్రం స్వల్పకాలమైనా ఆయా గృహాలలో గడపడానికి కారణం ఆ గృహస్థుల భవనాలను పావనం చేయడానికేనట. అటువంటి శుకుడు పరీక్షిత్‌ మహారాజు పుణ్య విశేషమా అన్నట్లు, పరీక్షిత్తు ‘ఆమరణ నిరాహార దీక్షాబద్ధుడై’ ఉన్నచోట ఏడు రోజులు స్థిరంగా ఉండి, ఆయనకు భాగవత దివ్యప్రవచన ప్రసాదాన్ని పంచి, తరింపజేశాడు. (‘స్వయం తీర్ణః పరాంస్తారయతి’ అన్నట్లుగా).

తాను రచించిన శ్రీమద్భాగవతాన్ని స్వయంగా వ్యాసుడే శుకునికి బోధించాడు. అప్పుడది ‘శుకముఖ స్పర్శ’వల్ల అమృతద్రవ సంయుతమైంది. అంటే, ఆనందరస స్వరూపమైన పరమాత్మకు పర్యాయమైందని అంతరార్థం. మామూలుగా లోకంలో చిలుక కొరికిన పండుకు తీపి ఇనుమడిస్తుంది. అలాగే, భాగవతం శుక(చిలుక) ముఖస్పర్శ వల్ల అమృతం లాగా మధురాతి మధురంగా మారింది. పరీక్షిత్‌ మహారాజుకు శ్రీశుకదేవుడు భాగవత ప్రవచనం వినిపించే వేళ దేవతలు అమృత కలశంతో వచ్చారు. శుకునితో ‘మహానుభావా! ఈ అమృతభాండాన్ని మీరు తీసుకొని ఆ భాగవత కథామృతాన్ని మాకు తాగించండి’ అని వారన్నారట. అప్పుడు శుకుడు వాళ్లతో ‘దేవతలారా! భాగవతామృతంతో మీ స్వర్గంలోని అమృతం సమానం కాదు. సంసారతాప సంతప్తులైన భక్తమానవులకే ఈ అమృతం దక్కుతుంది. మీరు దీనికి యోగ్యులు కారు’ అని తేల్చిచెప్పాడు. దీనివల్ల మానవులెంత భాగ్యవంతులో (భాగవత సుథతో) తేటతెల్లమవుతున్నది.

శుకుడు నిర్వికారుడు. అంతటా పరబ్రహ్మనే దర్శిస్తూంటాడు. కాబట్టి, అతడు నిర్వికల్పుడు. వ్యాసునికంటే కూడా శుకుడు అధిక బ్రహ్మనిష్ఠుడు, విశిష్టుడు అని చాటిచెప్పే సన్నివేశాలు భాగవతంలోనే ఉన్నాయి. శుకుడు పుట్టుకతోనే మహాయోగి, గాఢ వైరాగ్యం కలిగినవాడు. ఇంకా విశేషించి, ‘యా నిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ’ అన్న ‘భగవద్గీతా సూక్తాని’కి నిలువుటద్దంలా సకలజీవులు పరమాత్మ తత్తాన్ని తెలియక అజ్ఞానంతో నిద్రించేవేళ శుకయోగి మెలకువగా ఉండి పరతత్తాన్ని దర్శిస్తూ ఉంటాడట. సమస్తాన్ని సన్యసించి ఒంటరిగా వెళుతుంటాడు శుకుడు. అప్పుడు వ్యాసముని ‘పుత్ర వియోగం’ భరించలేకపోతాడు. ‘పుత్రా! పుత్రా!’ అని బిగ్గరగా పిలుస్తూ తన కొడుకు వెనుక పరుగెత్తాడట. అయినా శుకుడు వెనుతిరగక, మారు పలుకలేదు. కానీ, వ్యాసుని పిలుపు అక్కడి ప్రకృతిలోని చెట్లలో ప్రతిధ్వనిస్తుంది. ఆ చెట్లన్నీ శుకరూపంతో వ్యాసునికి జవాబు చెప్పాయట.

శుకుడు సర్వభూత హృదయుడు. అంటే, యోగబలంతో అందరి మనస్సులలోకి ప్రవేశించే మహిమ (శక్తి) గలవాడు కాబట్టే, అలా జరిగింది. ఈ అద్భుత దృశ్యం వ్యాసునిలోని ‘పితాపుత్ర బంధ’ వ్యామోహానికి, దానికి అతీతమైన శుకుని నిస్సంగ దృష్టికి సంకేతం. ఇంతటి మహాయోగి అయిన శుకబ్రహ్మ గూఢంగా కురుజాంగల దేశాలను దాటి హస్తినాపురాన్ని చేరి, పరీక్షిత్‌ మహారాజును భాగవతసుథతో తరింపజేశాడు. సామాన్యంగా చిలుక (శుకం) మనం నేర్పిన పలుకులను ఉన్నదున్నట్లుగానే పలుకుతుంది. తనవైపు నుంచి ఏదీ జోడించడం కానీ, తగ్గించడం కానీ చేయదు. అదేవిధంగా, శుకుడు కూడా వ్యాసుని నుంచి తాను విన్న భాగవతాన్ని ఉన్నదున్నట్లుగా ప్రవచించడం ఆయనలోని పరమ ప్రామాణికతకు నిదర్శనం.


logo