గురువారం 04 జూన్ 2020
Devotional - Apr 21, 2020 , 22:44:07

సద్బుద్ధి రహస్యం!

సద్బుద్ధి రహస్యం!

సంకల్ప వికల్ప స్వభావంతో ఉన్న మనస్సు తయారుచేసిన ఆలోచనలకు విధివిధానాలను నిర్ణయించి ఆ మేరకు పనితీరును సూచించే భాగాన్నే ‘బుద్ధి’ అంటారు. నిశ్చయాత్మక, క్రియాత్మకమైం ది బుద్ధి. అంటే, మెదడులోని ఆలోచన కాదు, శరీరం చేసే పనీ కాదు. వీటిని పురికొల్పే భాగం బుద్ధి. ‘మనస్సు బాగా లేదు’ అని అనడం మనకు నచ్చంది చేసినప్పుడు అనేమాట. ‘ఇది బాగా లేదు’ అని అనిపించే దానిపేరే బుద్ధి. ఇదొక ‘వడపోత’ పరికరమన్నమాట.

బుద్ధి చాలా ప్రాధాన్యమున్న భాగం. ఎవరినైనా గట్టిగా మందలించాల్సి వస్తే ‘బుద్ధి లేదా’ అంటాం. కానీ, ‘మనస్సు లేదా?’ అని అనం కదా! అదే ధ్యాస మారినప్పుడు మాత్రం ‘మనసు ఇక్కడ లేదా?’ అంటాం. ధ్యాసను చూపేది బుద్ధి, బుద్ధిలో గోచరించే తత్త్వమే (అసలు, నకిలీని విడదీసే) అసలైంది. బుద్ధికి మరో కోణం కూడా ఉంది. అది నిశ్చయాత్మకమైనా దానికీ ఇష్టం కానిది, చూడబుద్ధి కానిది, వినబుద్ధి కానిది, అనబుద్ధి కానిది. ఇలా ఇష్ట ప్రక్రియ ఉంటుంది. అంటే, బుద్ధి కూడా మనసు ప్రభావానికి అప్పుడప్పుడు లోనవుతుందన్న మాట. ఇలా, ప్రభావితం కావడం తాత్కాలికమే. బుద్ధికి తనకుతానుగా సవరించుకునే శక్తి ఉంటుంది. అదే దీనికిగల ప్రత్యేక లక్షణం.

ఏదైనా బుద్ధిపూర్వకంగా ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యొద్దు అనే విభాగాన్ని పోషిస్తుంది. మనసులోని ఆలోచన బుద్ధి ద్వారా వెళ్తే, బుద్ధి చెప్పింది చెప్పినట్లుగా మనసు విని అలానే వ్యవహరిస్తే ఫలితాంశాన్ని మంచిగా అందుకుంటాం. లేదంటే, ఫలితాలు తలకిందులవుతాయి. ‘బుద్ధిః కర్మాను సారిణీ’ అనే మాట వింటుంటాం. ఈ ‘కర్మానుసారిణీ’ అంటే మనసు ప్రతిపాదించిన అంశమనే అర్థమే కానీ, ఏ జన్మలోనిదో అని దూరం ఊహించుకోవద్దు. ఒక విషయాన్ని లేదా భగవంతున్ని ధ్యానిస్తున్నామని అనుకుందాం. అలాంటప్పుడు ‘ధ్యాయామి’ అనే పదం వస్తుంది. అంటే, ఊహించుకుంటున్న ధ్యేయ (లక్ష్య) వస్తువు ఇలా ఉంటుందని అర్థం. ఈ విధంగా లక్ష్య వస్తువును జ్ఞప్తికి ఉంచుకునే తత్త్వమే బుద్ధి.

బుద్ధి అలసత్వం చూపితే అన్నీ సున్నా. ‘బుద్ధిజాడ్యం’ పనికిరాదు. ఆధ్యాత్మ సాధనలో మెట్టుమెట్టుగా పైకి వెళ్లడానికి నిరంతర ప్రయత్నం అవసరం. అలసత్వం రాకుం డా బుద్ధి మేల్కొల్పుతుంది. ఈ బుద్ధి ద్వారానే భావం బయటపడుతుంది. ‘వికారో మనసో భావః’ అంటే, మనసు సంకల్ప వికల్పాల ద్వారా మార్పును పొందే స్థితిలో కలిగేది భావం. ఇది అభావము, భావము, సద్భావము, అసద్భావ ము, సదసద్భావము.. ఇలా బుద్ధిగా తన స్వరూపాన్ని అనేక రూపాలుగా తనకు తాను వెల్లడిస్తుంది.

సంకల్పం లేకుండా తనకుతానుగా ఉండే స్థితి-నిశ్చలం-అభావం. ఏదో తెలియని (మార్పు) ఊహ రావడం భావం. తనను తాను ఉద్ధరించుకుంటూ సరైన పథానికై ఆలోచించడం సద్భావం. ఇతరుల, ఇతరేతర అంశాలను గురించి ఆలోచించడం అసద్భావం. మంచి-చెడుల మిశ్రమంతో కూడిన అంశాల ఆలోచన సదసద్భావం. బుద్ధిలో ఇవన్నీ జరుగుతాయి. పదార్థ విశ్లేషణ చేసినప్పుడు శుద్ధిచేసే ప్రక్రియలో ముడిపదార్థాన్ని పాత్రలో వేసి ఉడికించినప్పుడు వేడి కావడం, ఉడకడం, పొంగడం, ఎర్రగా మారడం, పొగగా మారడం, ద్రవంగా మారడం.. ఇలా అనేక విధాలుగా మార్పు జరిగిన పిదప ‘ముడి పదార్థమే’ చక్కగా వినియోగించుకొనే పదార్థంగా మారుతుంది కదా! పాత్ర అలానే ఉంటుంది కదా! ముడి పదార్థం వినియోగ పదార్థంగా మారాలంటే చేయాల్సిన పని పాత్రలో వేసి వేయించడమే.

అలానే, అనేకానేక ఆలోచనల పుట్ట అయిన మనసును బుద్ధి అనే నిశ్చయాత్మక పాత్రలో వేస్తే మనకు మంచి అందుతుంది. పాత్రలోని పదార్థం త్వరగా పరిణామం చెందాలంటే అప్పుడప్పుడు గరిటెతో తిప్పడం, ఊదడం ఇతరత్రా చర్యల్లో పాల్గొని ఉత్ప్రేరకాలను వాడటం లౌకికంగా చేస్తుంటాం. చర్యలో పాల్గొనకుండానే క్రియాశీలతను పెంచే ఉత్ప్రేరకాలే మన బాహ్య, అంతర శుచిత్వ పటుత్వాలు. పదార్థం వినియోగంలోకి రావాలంటే పాత్ర, ఉత్ప్రేరకాలు ‘శుభ్రం’గా ఉండితీరాలి. లేకుంటే, రోగకారకాలుగా పరిణమిస్తాయి. దీనికే ‘పవిత్రంగా ఉండటం’ అని పేరు. స్నానాదులతో దేహాదులు, పుండరీకాక్ష స్మరణతో మనస్సు శుచి అవుతాయి. అందుకే, మంచిబుద్ధి కలుగాలంటే మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి. ఇవన్నీ పొందడానికి, మనోధైర్యానికి పరమాత్మ స్మరణ చేద్దాం. పరమాత్మ ధ్యానగోచరుడు, బుద్ధి భాస్కరుడు. సాధనాత్‌ సాధ్యతే సర్వమ్‌


logo