గురువారం 04 జూన్ 2020
Devotional - Apr 20, 2020 , 22:59:48

ఆనంద స్వరూపుడు

ఆనంద స్వరూపుడు

‘శివేచ పూజితే దేవాః పూజితా స్సర్వ ఏవహి!/ తస్మాచ్ఛ పూజయేద్దేవం శంకరం లోక శంకరం! !’- సకల లోకాలకూ మంగళకరుడైన శివుడిని పూజిస్తే సకల దేవతలనూ ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఈ చరాచర సృష్టి యావత్తూ ‘పెంజీకటి‘ కావల ఉండే ఆద్యం, అనంతం అయిన ఒక శక్తి నుంచి ఆవిర్భవించిందే. పురాణగాథల ప్రకా రం మహేశ్వరుడు త్రిమూర్తులలో ఒకనిగా గుర్తింపబడినా ఆధ్యాత్మిక సాధనలో అతనిది ప్రత్యేక పాత్ర.

‘శివుడు’ అంటే బ్రహ్మానందం. ‘శంకరుడు’ అంటే మంగళకరుడు. చీకటి అజ్ఞానానికి ప్రతీక కాగా, మంగళత్వం అజ్ఞానంలో ప్రచ్ఛన్నంగా ఉండే జ్ఞానాన్ని గుర్తించి జాగృతం చేసుకోవడమే. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని సమన్వయం చేసుకొని ‘సదానంద’ స్థితిలో ఉండటమే బ్రహ్మానందం. మహేశ్వరుని తత్త్వం జీవకోటి నడతలో నడకలో అణువణువునా, అడుగడుగునా ప్రతిబింబిస్తూ, ‘వికసన నుంచి వికసన’ వరకు తీసుకువెళ్తుంది. ‘వికసన విస్తరణగా, విస్తరణ వ్యాప్తం గా, వ్యాప్తం తిరిగి వికసనగా’ మారడం సృష్టిధర్మం. వికసనయే సృష్టి, విస్తరణయే స్థితి, వ్యాప్తమే లయం. అణువు నుంచి బ్రహ్మాండం వరకు పరివ్యాప్తమవ్వడమే వ్యాప్తం. ఈ మూడు తత్త్వాలూ మూర్తీభవించుకున్నవాడు కాబట్టే, శివుడు మంగళకరుడు!

‘శివపురాణం’ ప్రకారం శివుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు. ‘లీయతే గమ్యతే ఇతి లింగః’ అన్నారు. ‘లీయతే’ అంటే ‘దేనిలో లయమౌతుందో’, ‘గమ్యతే’ అంటే ‘దేనిలో సంచరిస్తుందో’ అదే లింగం. అంటే, సకల చరాచర సృష్టి అంతా దేనిలో సంచరించి దేనిలో లయమౌతుందో అదే లింగం. ఆ లింగమే సృష్టికి ప్రతీక. అనంతశక్తి చైతన్యదీప్తియే లింగంగా చెప్పబడింది. లింగానికి ఒక ముఖ్య లక్షణం లేదా ధర్మం ఉంది. అది దేనినీ తనలో ఉంచుకోదు, దాచుకోదు. నిజానికి దాచుకోవడం, ఉంచుకోవడం రెండూ స్వార్థానికి చిహ్నాలే. దీనివల్ల ఆధ్యాత్మిక ప్రయాణం భారమౌతుంది. ఎప్పుడైతే వీటిని వదిలివేస్తామో అప్పుడు మన యదార్థ స్థితి లేదా సచ్చిదానంద (సత్‌చిత్‌ ఆనంద) స్థితికి దగ్గరవుతాం. అదే మానవజీవితానికి నిజమైన లక్ష్యం. శివుడు లయకారుడు లేదా అన్నింటినీ లయం చేస్తాడనడంలోని అంతరార్థం ఇదే.

శివుడు తమో గుణ ప్రధానుడు. నిజానికి అంతటా నిండి ఉన్నది శూన్యమే. అదే తమస్సు లేదా అంధకారం. వెలుగు కావాలంటే దానికి ఓ మూలం లేదా జన్మస్థానం కావాలి. వెలుగునిచ్చే ఆధారం సృష్టించబడుతుంది. ఏదైతే సృష్టించబడుతుందో అది అంతమవుతుంది. కానీ, చీకటికి సృజన లేదు, అంతమూ లేదు. నిజానికి మనలో నిండి ఉన్నది కూడా శూన్యమే లేదా అంధకారమే. ఆ అంధకారమే హద్దుల్లేనిది, అంతటా చక్కగా వ్యాపించినది. సకల సృష్టికూడా ఆ శూన్యం నుంచే ప్రకటితమైంది. చివరకు లయం కావలసిందీ ఆ శూన్యంలోనే. అదే శివం. అదే సత్యమైన, నిత్యమైన, అనంతమైన ఆనంద చైతన్య విభూతి. అదే సకల చరాచర సృష్టితో ఏకత్వాన్ని పొందడం లేదా అందులో లయం కావడం.

ఈ సాధనలో ఏ విధమైన ఆకర్షణ, వికర్షణలు, ఆశలు, ఆశయాలు, బంధాలు, అనుబంధాలు.. ఇలా ఏవీ లేని ఒక నిశ్చలస్థితిని పొందడం యోగం. శివారాధన ఐహికాన్ని ఆముష్మికాన్ని సమన్వయం చేస్తూ, మానవుల్లో నిక్షిప్తమైన భగవచ్ఛక్తిని ఉత్తేజితం చేస్తూ, ఊర్ధ్వముఖ ప్రయాణానికి సన్నద్ధం చేస్తుందని యోగశాస్త్రజ్ఞులు చెబుతారు. భౌతికమైన నేత్రాలకు కనిపించేది ‘జగత్తు‘ (జాయతే గచ్ఛతే ఇతి జగత్తు). కానీ, దీనికి అతీతమైంది, సత్యమైంది, ఈ జగత్తు కానిది అదే శివం. అదే శూన్యం. ఆ శూన్యాన్ని మనం చూడలేం. ఆ చూడలేకపోవడమే ‘అజ్ఞానం’. సాధకుడు ఎప్పుడైతే అనంత సృష్టిలో అంతర్భాగమవుతాడో, అంతటా నిండిన ఆ శివమే తానవుతాడు. ఆ శూన్యంలో లయమౌతాడు.

ప్రతిదీ శూన్యం నుంచే వస్తుంది, శూన్యంలోకే వెళ్తుంది. ఆ శూన్యమే శివుడు. ఆ శివుడు కాలాతీతుడు. ఎల్లలు లేక అంతటా వ్యాపించినట్టి అనం త శూన్యస్థితినే మనం శివుడు లేదా మహాదేవుడిగా వ్యవహరిస్తున్నాం. ‘మనం ఆనందంగా ఉన్నామా ?’ ఆనందంగా ఉన్నామని అనుకున్నా అసలు ‘ఆనందం’ అంటే ఏమిటి? నిజానికి మనమానందం అనుకునేదంతా నిబంధనలకు, షరతులకు లోబడి ఉంటుంది. కానీ, స్థలానికి, ప్రజలకు, పరిస్థితుల కు, కాలానికతీతంగా ఉండేదే నిజమైన ఆనందం. ఆ కాలాతీత శాశ్వతానందమే శివం. దాన్ని అనుభవించేవాడు, ప్రసాదించేవాడే శివుడు.


logo