శనివారం 30 మే 2020
Devotional - Apr 19, 2020 , 22:42:13

మానవత్వమే ఆత్మతత్తం!

మానవత్వమే ఆత్మతత్తం!

మానవునికెప్పుడూ ఏదో తపన. ఆదిమ మానవునిగా ఉన్న అతణ్ని నేటి ఆధునిక మానవుడిగా తీర్చిదిద్దిందీ ఆ తపనే. ఆకలి తీరింది. నివాసం కుదిరింది. అన్నీ సమకూరాయి. అప్పుడు తన దృష్టి ప్రకృతిపైకి వెళ్లింది. పంచభూతాలు కనిపించాయి. వాటిపట్ల భక్తితో వేదసంహితలను రచించాడు. అతని తపన ప్రకృతిని దాటింది. ఆకాశం లో గ్రహాలు, నక్షత్రాలను చుట్టుముట్టాడు. వాటిని వివరిస్తూ వేదాంగాలను రచించాడు. ఐనా, తృష్ణ తీరలేదు. ‘యదృశ్యతి తన్నశ్యతి..’ అంటూ కనిపించేవన్నీ నశిస్తాయనే నిర్ధారణకు వచ్చాడు. అప్పుడు ‘నాకు, ప్రకృతికి, గ్రహాలకు, నక్షత్రాలకు మాతృక ఎవరు? ఎక్కడినుండి ఎక్కడికి ఈ ప్రయాణం..?’ అనే ప్రశ్న ఉదయించింది.

తనకు రూపమిచ్చిన తల్లిదండ్రులను, వారికి రూపమిచ్చిన పంచభూతాలను, వాటికి రూపమిచ్చిన సూర్యుడికి, ఆ సూర్యునివంటి కోటానుకోట్ల సూర్యులకు జన్మనిచ్చిన బృహద్‌ వస్తువును గురించి శోధించాడు. అదే జ్ఞానమైంది. ఆ కనుగొన్న తనదైన వస్తువుకు ‘ఆత్మ’ అని పేరు పెట్టుకున్నాడు. అది మాత్రమే శాశ్వతమైందంటూ ‘సతత యతీతి సత్యం’ అన్నాడు. తరగని జ్ఞానతృష్ణతో ‘ఆత్మ ఏది? ఎలా ఉంటుంది?’ అని శోధిస్తూ అనేక కొంగ్రొత్త విషయాలను కనుగొన్నాడు. ఆత్మను చర్చించడం క్రమంలోనే ఉపనిషత్తులు ఉద్భవించాయి.

‘ఆత్మకు ఏ లక్షణమూ లేదని’ అంటూనే సవాలక్ష లక్షణాలను ప్రతిపాదించాడు. ఆత్మ నిరాకారమన్నాడు. కానీ, ‘ఆకృతులు వున్న దృగ్గోచర విభూతులన్నీ ఆత్మరూపాలే’ అన్నాడు. ‘రంగే లేదంటూ, కంటికి కనిపించే వర్ణాలన్నీ అందులోనే పుట్టాయని’ చెప్పాడు. అది చలించలేదన్నాడు. కానీ, చలించే గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు సర్వం అందులో భాగమేననీ అన్నాడు. ‘దూరంగా ఉన్నదదే, దగ్గరగా ఉండేదదే, లోపలా, బయటా ఉండేదదేనని’ తీర్మానించాడు. ‘దాన్ని విడిచి వెళ్లలేమని’ అంటూ పుంఖానుపుంఖాలు గా శ్లోకాల రూపంలో సిద్ధాంతాలు చెప్పేశాడు. ‘అది సృష్టించబడేదీ కాదు, నాశనమయ్యేదీ కాదని’ అంటూనే ‘అదే పూర్ణమనీ’ అన్నాడు. ‘ఆ పూర్ణం నుండి అదే పూర్ణాన్ని తీసివేసినా పూర్ణమే మిగులుతుందని’ తేల్చి చెప్పాడు.

పంచేంద్రియాలకు చిక్కేదీ కాదంటూ నే.. పంచేంద్రియాలూ అదేనని అన్నా డు. ‘మేథ తోనే కనుగొనాలంటూ, దాన్ని కనుగొనే మేథా అదే’ అన్నాడు. ‘అనంతం అదే, సూక్ష్మాతి సూక్ష్మమైందీ అదే’ అన్నాడు. అందుకే, శ్రీకృష్ణుడు ‘సాంఖ్యయోగం’లో ‘ఆశ్చర్య వత్పశ్యతి కశ్చిదేనమ్‌/ ఆశ్చర్య వద్వదతి తథైవ చాన్యః/ ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి/ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్‌..’ అన్నాడు. కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైందిగా చూస్తారు. ఇంకొందరు ఆశ్చర్యమైందిగా వర్ణిస్తారు. 

మరికొందరు ఆత్మ ఆశ్చర్యమైనట్లు వింటారు. ఇంకా కొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏ మాత్రం అర్థం చేసుకోలే రు. తనను తాను, తనలో ఆత్మను కనుగొన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ‘తానే భూత, వర్తమాన, భవిష్యత్తు’ అని అన్నాడు. ‘తానే అందరు, అంద రూ తానేననీ’ ప్రకటించగలిగాడు. లోపలి సూక్ష్మం ద్వారా అనంతాన్ని దర్శించుకోమన్నాడు.

అర్థమైనా అర్థం కానట్టుగా ఉండే అత్మతత్త్వం పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఎంతటి తపన ఉండాలో దీనినిబట్టి మనం ఊహించుకోవచ్చు. తపనతో ఎంతటి జ్ఞానాన్ని తాగినా, చెలిమెలో ఊటలాగా తేటగా, చల్లగా జ్ఞానం ఊరుతూనే ఉంటుంది. ఇదే తపనతో, ఆర్తితో నాటి ఋషులు చూసిన ఆత్మను మనమూ చూద్దాం. 

మన లోపలినుండి అనంతం లోపలికి తొంగి చూద్దాం. జీవ నిర్జీవాలలో, అణువణువునా ఆత్మను పరికించి చూద్దాం. మేథతో, తపనతో, ఆ అనంతంతో మమేకం అవుదాం. దైవత్వాన్ని ఒడిసి పట్టి, ఆత్మతత్త్వానికి నిజమైన అర్థం మానవత్వమేనని అర్థం చేసుకుందాం. ఆ అద్భుతమైన మానవీయతను భువిపైన స్థాపిద్దాం. మానవ రూపంలోనే అనంతమైన ఆత్మయిక, ఆనందకరమైన జీవితాన్ని సాగిద్దాం.


logo