గురువారం 04 జూన్ 2020
Devotional - Apr 18, 2020 , 23:11:34

కరోనా నుంచి రక్షణకు..శివ రక్షా కవచం!

కరోనా నుంచి రక్షణకు..శివ రక్షా కవచం!

మృత్యువుకే మృత్యువైన ఆ మహా రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఈ భీతావహమైన దుఃఖం నుండి బయటపడవేయమని అర్థిద్దాం. శివనామస్మరణతో మన హృదయాలయంలో భక్తిగంటను మోగిద్దాం. అచంచలమైన విశ్వాసంతోనే ఈ విపత్తు నుంచి బయటపడుదాం.

త్రికాల సత్యాన్ని తెలుసుకొని చెప్పగలిగిన వారే దార్శనికులు. వారు ఈశ్వర తత్తాన్ని, ప్రపంచ తత్తాన్ని ఆవిష్కరించడానికి వేద వేదాంగాలను పఠించేవారు. వారికి కలిగిన అనుభవాలను కథలరూపంలో వ్యక్తం చేసేవారు. కేవలం జరిగిన సంఘటనలనేకాక జరుగబోయే వాటినికూడా వివరించేవారు. అట్లా వివరించడానికి చేసిన ప్రయత్న ఫలితమే పురాణాల అవతరణ. వేదాంగాలలో ఒకటైన జ్యోతిశ్శాస్త్రం ఖగోళ విజ్ఙానానికి దిక్సూచిగా పనిచేస్తుంది. శాస్ర్తాలు విజ్ఞానానికి సంబంధించినవి కాగా, పురాణాలు మన భారతదేశ పండితులు సంపాదించిన అపారమైన అనుభవానికి కేంద్ర బిందువులు. అష్టాదశ పురాణాల్లో శివపురాణం ఒకటి. అందులో భవిష్యవాణి తెలుసుకోదగింది. 

ఆశ్చర్యం ఏమిటంటే, అందులో ‘కోరోనా రక్షా కవచం’ ఒకటి కనిపిస్తుంది. ఆపదలో వున్నవారిని, దుఃఖితులను రక్షించమని పరమేశ్వరుణ్ణి స్తుతించడం దానికి గల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. ‘త్వం కరుణావతా రోసి/ కోరోనాఖ్య విషాణుధృక్‌/ రుద్ర రూపశ్చ సంహర్తా/ భక్తానామ భయంకరః॥’. ‘ఓ పరమేశ్వరా! నువు కరుణావతారుడవు. భక్తుల పాలిట అభయంకరుడవు. రుద్రరూపుడవు. ‘కొరోనా’ అనే పేరుగల సూక్ష్మమైన క్రిమిని నశింపజేయువాడవు’ అని ప్రార్థించడం భవిష్యవాణికి సంకేతమనక తప్పదు. ‘మహేశ్వరుడు, మృత్యుంజయుడు అయిన మహాదేవుడు (శివుడు) శరణాగతులమైన మమ్మల్ని, మృత్యువుగా, మహామృత్యువుగా లోకానికి హాని చేస్తున్న కరోనాను ధ్వంసం చేసి, రక్షింపగోరుతున్నానని’ ప్రార్థించడం ఈరోజు అందరికీ అత్యవసరం.

‘మృత్యుంజయ మహాదేవ/ కోరోనాఖ్యా ద్విషాణుతః/ మృత్యోరపి మహామృత్యో/ పాహిమాం శరణాగతమ్‌’. ఈ ‘కరోనా’ మహమ్మారి చీనా దేశంలో పుట్టి విశ్వానికే మహావిపత్తు కలిగిస్తుందనే విషయం ఈ ‘శివపురాణం’లో స్పష్టంగా ఉంది. ‘చీన దేశే జనిం లబ్ధా/ భూమౌ విష్వ క్ప్ర సర్పతః/ జనాతం కాద్విషోణోర్మా/ సర్వతః పాహి శంకర॥’. ఈ భయంకరమైన క్రిమితో బాధితులైన వారికి చికిత్స అనేది ఇతర దేశాలనుంచే లభించగలదన్న విషయం ఇందులో సూచింపబడింది. దేవదేవుడు, జగత్పతి అయిన పరమేశ్వరుడే ఈ ఆపదనుంచి మనల్ని గట్టెక్కిస్తాడు. 

దానికి ముఖ్య కారణం ఏమిటంటే, సముద్రంలో కాలకూట విషం పుట్టి లోకాన్ని అతలాకుతలం చేసినప్పుడు ఆ శంకరుడే దానిని తన కంఠంలోకి మ్రింగి లోకాలను రక్షించాడు. అందుకే, మృత్యువుకే మృత్యువైన ఆ మహారుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఈ భీతావహమైన దుఃఖం నుండి బయటపడవేయమని అర్థిద్దాం. శివనామస్మరణతో మన హృదయాలయంలో భక్తిగంటను మోగిద్దాం. అచంచలమైన విశ్వాసంతోనే ఈ విపత్తునుంచి బయటపడుదాం. శ్వాస పీల్చినా, వదిలినా ఓం కారమే ధ్వనించాలి. సర్వకాల సర్వావస్థలలో మన మనస్సు ఈశ్వర భక్తితో నిండిపోవాలి. ‘పరమేశ్వరుడు ఒక్కడే అభయ ప్రదాత, దేవదేవుడు, సర్వరక్షకుడు. పాహిమాం, పాహిమాం’ అంటూ ఆయనను శరణు వేడుదాం.

క్రిమి కీటకాదులవల్ల భయాందోళనకు గురైన ప్రజలకు వైద్యులు ఏ విధంగా అభయం ఇవ్వాలో ‘అధర్వవేదం’ వివరిస్తున్నది. ‘ఓం ఇంద్రస్య యామహీ దృషత్‌ క్రిమేర్విశ్వస్య తర్హణీ/ తయా పినష్మి సంక్రిమీన్‌ దృషదాఖల్వా ఇవ॥’ (2-31-1). ‘ఓ మానవులారా! మీరు రోగకారక క్రిములకు భయపడవద్దు. వైద్యులమైన మేము పరమాత్మ ఇచ్చిన వేదజ్ఞానపు వెలుగులో సమస్త రోగకారక సూక్ష్మక్రిములను చంపగలం. తగిన మూలికలతో ఔషధాలు తయారుచేసి, లేదా ఆ మూలికలను అగ్నిహోత్రంలో ఆహుతులుగా ఇచ్చి క్రిములను నిర్మూలించగలం. శనగలను తిరుగలి రాతిలో వేసి పిండి చేసే విధంగా సమస్త క్రిములను నాశనం చేయగలను’. భగవంతుని ద్వారా వైద్యులు ప్రేరణ పొంది, మనకు ప్రాణాలపై భరోసా ఇస్తూ చికిత్సకు పూనుకొంటే, ఎలాంటి క్రిమివల్లా మనకు హాని కలగదని దీనినిబట్టి తెలుస్తున్నది. 

వేద విద్వాంసుల వచనాలతోనే సమస్త క్రిములు నశించే విషయం వేదమంత్రాల్లో ఉంది. ఇలాగే, క్రిమి కీటకాదులను నశింపజేయడంలో సూర్యరశ్మికి వున్న రోగనిరోధక శక్తి అపూర్వమైందిగా వేదమంత్రాల్లో ఉటంకింపబడింది. ‘ఉద్యన్నా దిత్యః క్రిమీన్‌ హంతు/ నిమ్రోచన్‌ హన్తు రశ్మి భిః/ యె అన్తః క్రిమ యోగవి’ (అధర్వ: 2-32-1). ఈశ్వర సృష్టిలో సాక్షాత్తు సూర్యుడే ఉదయాస్తమయాలలో తన కిరణాలతో పృథ్వి (గవి)లోని అన్ని రకాల క్రిములను నశింపజేస్తున్నాడు. మానవులు భయపడకుండా తమ జీవితకాలంలో అన్ని రకాల సూక్ష్మక్రిములను నశింపజేసే సామర్థ్యం కలిగి ఉంటారు. అంతేకాదు, సర్వశుభాలు పొందగలుగుతారని వేదవాణి ఇచ్చే భరోసా మనకు శ్రీరామరక్ష కాగలదు.

  • అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివపురాణంలోని భవిష్యవాణిలో ‘కోరోనా రక్షా కవచం’ ఒకటి కనిపిస్తుంది. 
  • ‘కరోనా’ మహమ్మారి చీనా దేశంలో పుట్టి విశ్వానికే మహావిపత్తు కలిగిస్తుందనే విషయమూ అందులో స్పష్టంగా ఉంది.
  • క్రిమి కీటకాదులవల్ల భయాందోళనకు గురైన ప్రజలకు వైద్యులు ఎలా అభయమివ్వాలో ‘అధర్వవేదం’ వివరిస్తున్నది. 

క్రిమి సంహారక సూక్తం

అధర్వవేదంలో ‘క్రిమి సంహారక సూక్తం’ ఒకటి ఉన్నది. దానిని ఈ సందర్భంగా పఠించి సమధిక ప్రయోజనాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని పొందవచ్చు. ‘ఓం దృష్టమదృష్ట మతృహమథో కురూరుమ తృహమ్‌/ అల్గండూన్థ్యర్వాన్‌ ఛలునాన్‌ క్రిమీన్‌ వచసా జంభయామసి॥’ (2-31-2). ఇది వేదంలో కనిపించే క్రిమినాశక ఉపదేశం. పరమాత్మ స్వయంగా చేస్తున్న ప్రకటన ఇది. ‘వైద్యుడనైన నేను లోకంలో కనిపించేవి, కనిపించకుండా ఉండేవి అయిన రకరకాల అనేక రోగకారక క్రిములను నాశనం చేయగలను. భూమిమీద పాకేవి, దుఃఖానికి కారణభూతమైన విషపూరితమైన అన్ని క్రిములను నశింపజేయగలను. ఔషధాలతో నిర్మూలించగలను.  తలగడ దిండ్లలో దూరే సూక్ష్మజీవులను నశింపజేసే శక్తి వేదవచనాలకున్నది. కనుక, వేదపాఠాలను శ్రద్ధగా వినండి’ అన్నది అందులోని భగవంతుని ఆదేశం.

-ఆచార్య మసన చెన్నప్ప

-సెల్‌: 98856 54381


logo