శనివారం 30 మే 2020
Devotional - Apr 17, 2020 , 23:23:02

అమ్మలోనే జగజ్జనని!

అమ్మలోనే జగజ్జనని!

‘మాతృదేవోభవ’ అన్నది మన వేదవాక్కు. అండం తల్లి గర్భకోశంలో చేరి అక్కడ స్థిరపడుతుంది. తల్లి రక్తంతో పోషణ పొందుతూ వివిధ అవయవాలుగా ఏర్పడినాక శిశువుగా మారుతుం ది. ఈ బిడ్డ ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత ఇక్కడి ఆహార పదార్థాలను జీర్ణం చేసుకునేవరకు తల్లి పాలే ఆహారం. బిడ్డ శరీరంలోని ఎముకలు తల్లి ఎముకలలోని క్యాల్షియం నుంచి కండరాలు, కండరాల నుంచి హృదయం తయారవుతుంది. అందుకే మన ఋషులు ‘అంగాదంగాత్‌ సంభవసి’ అని, ‘మాతా నిర్మాతా భవతి’ అని అభివర్ణించారు.

గర్భిణీ స్త్రీని 5వ మాసం నుంచి ‘దౌహృద’ అని సంభోదిస్తారు. అంటే, ‘రెండు హృదయాలు కల ది’ అని అర్థం. అమ్మ మన శరీర మనస్సులను నిర్మించేదే కాక మన కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంది. అంతేకాక తన బిడ్డ కు తాగుట, తినుట, కూర్చుండుట, మాట్లాడుట, స్నానాదులు వంటి సమస్తాలే కాక అక్షరాలనూ నేర్పి చదివింపజేస్తుంది. చిన్న కథలతో నీతిని నేర్పుతుంది. ‘అందుకే, పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యుల కంటే ఓ తండ్రి, వెయ్యిమంది తండ్రులకంటే ఒక తల్లి గొప్పవారని, ప్రతీ ఒక్కరికీ ఆమెనే మొదటి గురువు, గొప్ప గురువు’ అని మనువు పేర్కొన్నాడు. వ్యాసమహర్షి ‘తల్లితో సమానమైన గురువు లేడు’ అంటే, మన ఋషులు తల్లిని ‘ప్రథమ దేవత’గా కీర్తించారు.

బిడ్డను అమ్మ తన గర్భంలో ధరించి, తను తినే ఆహారంతోనే పెంచుతుంది. అలా, బిడ్డకు జన్మనివ్వడం ద్వారా ఆమె ‘సృష్టికర్త’ అయ్యింది. పిల్లవాడు ఏడిస్తే తన రక్తాన్ని పాలుగా మార్చి పట్టి శక్తినిస్తుంది. సమయానికి ఆహారం తినిపిస్తూ, ఏ ప్రమాదం రాకుండా ప్రతి నిమిషం కాపాడుతూ, పెంచి పెద్ద చేస్తుంది. ఈ పాత్రలో తల్లిని ‘స్థితికర్త’గా చెప్పారు. వేళకు తినకున్నా, చేయరాని పనులు చేసినా, వీపున రెండు దెబ్బలు వేసి పడుకోబెట్టి, తాను తీర్చిదిద్దిన తన బిడ్డ శరీరంలో ఏ అస్వస్థతా రాకుండా విశ్రాంతిని ప్రసాదించినప్పుడు ‘ప్రళయకర్త’ (లయ)గానూ వ్యవహరిస్తుంది. అందుకే, ఈ సమస్త సృష్టికి మూలమైన జగన్మాతను తల్లిరూపంలో ఇప్పుడు దర్శించుకుంటాం.

శ్రీ అంటే పరబ్రహ్మ స్వరూపం. సర్వజగతిని పాలించే అధికారం గల శ్రీదేవి అనే పిలుపులో ‘శ్రీ’ అనే శబ్దాన్ని మనం సామాన్యంగా లక్ష్మీదేవి రూపంగానే అనునయించుకుంటాం. కానీ, ‘సౌందర్యలహరి’లో ఆదిశంకరులు ఆమెను జగదంబగానే చెప్పారు. సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగానూ ఆమెను వారు స్తుతించారు. దీన్నిబట్టి, శ్రీదేవి అంటే లలితయా, దుర్గయా, పార్వతియా, లక్ష్మీ, సరస్వతులా అనే సందేహం మనకు అక్కర్లేదన్న మాట. ఇదే మన హైందవధర్మంలోని మూల రహస్యం. ‘పరబ్రహ్మ తత్త్వం’ అన్నప్పుడు ఏకత్వం వస్తుంది. ఆ ‘ఏకత్వాన్ని’ వివిధ రూపాలుగా ఆరాదించినప్పుడు ‘బహుళత్వం’ వస్తుంది. ఎలాగంటే జ్ఞానంలో ఒక శక్తి ఉంది. ఆమెయే సరస్వతి. సంపదలోనూ ఒక శక్తి ఉంది. ఆమె లక్ష్మీదేవి. ధైర్యానికి పార్వతి, ఆపదలో ఉన్నప్పుడు కాళీ, స్త్రీలకు ఐదవతనాలను కాపాడేందుకు గౌరీ దేవి. ఇలా అందరిలోనూ మనకు ఆ జగదంబ, ఆమెలోనే అందరూ దర్శనమిస్తారు. ఆ శక్తులన్నీ ఒకటైనదే అమ్మ, జగన్మాత. బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలిచినప్పుడు ఆరోగ్యవంతుడౌతాడు. ఎందుకంటే, నోరారా ‘అమ్మా’ అని ఒక పలుకు పలికినప్పుడు అది మన నాడీమండలంపై ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా.. దానిపైనే సనాతన మంత్రశాస్త్రమంతా రూపొందింది. ‘ఓం’అనే మంత్రం చదివినప్పుడూ మనలో ఎంతటి చైతన్యం కలుగుతుందో విజ్ఞానశాస్త్ర పరంగానూ రుజువైంది. సంస్కృతంలో ‘అంబా’ అన్న పిలుపును, తెలుగులో ‘అమ్మా’ అంటాం.

అమ్మ అన్నమాట ఎంత శక్తివంతమైందంటే ‘అ’ అన్నప్పుడు మన నోరు తెరుచుకొంటుంది. ‘మ్‌' అన్నప్పుడు మూసుకొని, మళ్ళీ ‘మ’ అన్న ఒత్తు పలుకగానే తెరచుకొంటుంది. ఇలా మన నోరు మూసి- తెరవటంలోనే ‘సృష్టి రహస్యమంతా’ ఉంది. ఇంతటి సృష్టికారణియే అమ్మ. ఎవరికి అమ్మ? సమస్త లోకాలకూ! అందుకే, కాలమేదైనా అమ్మ అమ్మే. ఏ అపేక్ష లేని అనంతమైన ప్రేమ తల్లినుంచే మనకు లభిస్తుంది. లోకంలో ఎవరిని ప్రేమించినా కారణం ఉంటుంది. కానీ, ‘నీ బిడ్డను ఎందుకు ప్రేమిస్తున్నావు?’ అని అడిగితే తల్లి సమాధానం చెప్పలేదు. కారణం, అది అవ్యాజమైన ప్రేమ. అందుకే, ఆ దేవి సృష్టి అంతటికీ ప్రేమ రూపిణి, కరుణామూర్తి.

- వేముగంటి శుక్తిమతి, 99081 10937


logo