శుక్రవారం 05 జూన్ 2020
Devotional - Apr 17, 2020 , 09:01:13

మహాసాధ్వి ద్రౌపది

మహాసాధ్వి ద్రౌపది

మహాభారతంలో ద్రౌపది పాత్ర అద్భుతమైంది. ద్రుపద మహారాజుకు యాజ్ఞసేనిగా జన్మించి, అల్లారుముద్దుగా పెరిగి, మత్స్య యంత్రాన్ని ఛేదించిన మహావీరుడు అర్జునుణ్ణి పెండ్లాడింది. కుంతీదేవి అనుమతితో పంచపాండవులకు భార్య అయ్యింది. కానీ, జీవితాంతం అడుగడుగునా దుర్యోధన, దుశ్శాసనాదులతో అవమానాలు, భర్తలతో కలిసి పన్నెండేండ్లు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన మహా ఇల్లాలు ఆమె. తన కష్టాలను విని, ఓదార్చేవాడు భగవంతుడొక్కడేనని (కృష్ణపరమాత్మ) తలచి విన్నవించుకున్నది. రాయబారానికి వెళ్తున్న కృష్ణునితో పాండవులు ఒక్కొక్కరు తమతమ మనోభావాలను తెలుపగా, ద్రౌపది తన భంగపాట్లను కృష్ణునికి వివరిస్తుంది.

‘వరమున బుట్టితిన్‌ భరతవంశము జొచ్చితి నందు పాండు భూ/ వరునకు కోడలైతి, జన వంద్యుల బొందితి నీతి విక్రమ/ స్థిరులగు పుత్రులం బడసితిన్‌ సహజన్ముల ప్రాపు గాంచితిన్‌/ సరసిజనాభ యిన్నిట బ్రశస్తికి నెక్కిన దాననెంతయున్‌'. ‘ఇన్ని గొప్ప గుణాలున్న తనకు ఎందుకీ వ్యథ’ లని తన అన్న (కృష్ణుడు)తో వాపోతుంది. ఆత్మీయులు ఎదురైనప్పుడు ఆవేదనను వారికి తెలిపి హృదయభారాన్ని తగ్గించుకోవడం మానవ లక్షణం. మానినియైన ద్రౌపది అవకాశం చిక్కిందని, తన భర్తలకు చెప్పినా పెద్దగా ప్రయోజనం లేదని భావించింది. పుట్టింటివాళ్లు కనిపించినప్పుడు హృదయాంతరాళాల్లో ఉన్న బాధను వెళ్లగక్కడమే స్త్రీ నైజం.

ఒక్క భర్త అభిరుచులకు అనుకూలంగా మెలగటమే కష్టమనుకునే స్త్రీలకు ద్రౌపది అయిదుగురు భర్తలతో మెలగిన తీరు అభినందనీయం. అందుకే, ఆమె గొప్ప ఆదర్శ మహిళ అయ్యింది. ఐదుగురు భర్తలు చేతి వేళ్ల వలె వివిధ రకాల మనస్తత్వాలుగల వారితో ఒక్కొక్క సంవత్సరం ఉండాలి. అదీ పెళ్లయిన కొత్తలో ఆ కొత్త పెండ్లికూతురుకు ఎదురైన పరీక్ష ఇది. జీవితాంతం భర్తలందరికీ అనుకూలంగా ఉంటూ వారి ప్రేమానురాగాలను పొందిన మహాసాధ్వి ద్రౌపది. ధర్మరాజు దగ్గరకు ధేమ్యుడు, దుర్వాసుడు లాంటివాళ్లు వచ్చి గంటల తరబడి ధర్మోపన్యాసాలు ఇచ్చేవారు. శుచి, శుభ్రంగా వారికి ఇష్టమైన పదార్థాలను అందించేది. ఇంట్లో ఏమున్నదో లేదో చూడకుండా వచ్చిన అతిథులను ‘భోజనానికి లేవండనే’ భర్తలనే ఎక్కువగా చూస్తుంటాం లోకంలో. అప్పుడా గృహిణికి అదొక గడ్డు సమస్య. కానీ, ద్రౌపది చిరునవ్వుతో వారికి ఆతిథ్యమిచ్చేది.

భీముడు దుడుకు (రఫ్‌ అండ్‌ టఫ్‌) స్వభావి. అతని ఆవేశానికి అనుగుణంగా ఒక సంవత్సరం కాలం గడిచేసరికి, అర్జునుని వంతు వచ్చేది. ఇతనికి అందంగా తయారై సుకుమారంగా భార్య ఎదుట ఉండాలి. తన మనసులో ద్రౌపదికి ఎంత వేదన ఉన్నా అర్జునుని దగ్గర ఉన్న సంవత్సరకాలం ముఖాన బాధ కనిపించకుండా నవ్వుతూ కాపురం చేసింది. సవ్యసాచికి అనుకూలంగా కనుసన్నల్లో మెదిలింది. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలికి, అరణ్యవాసం వెళుతున్న వేళ కుంతీదేవి, ‘మాద్రి తనయిలను తానెంత గారాభంగా పెంచి పెద్ద చేసిందో నువ్వూ అలానే జీవితాంతం చూసుకోవాలని’ ద్రౌపదికి అప్పగించింది. ‘ఆకలైనా నువ్వు పెట్టేవరకు వారు (నకుల, సహదేవులు) అడుగరని, వారి ఆకలిని కనిపెట్టి, చిన్నపిల్లలకు తల్లి వలె గ్రహించి వారి ఆకలితీర్చాలని, కంటికి రెప్పలా చూసుకోవాలని’.. ఇలా అనేక అప్పగింతలు చెప్పింది కోడలికి.

ఇంతమందిని అనుక్షణం ఏ లోటు రాకుండా కాపాడిన ద్రౌపది తన ఆగ్రహాన్ని అజ్ఞాతవాసంలోనే వెల్లడిస్తుంది. ముఖ్యంగా ‘నర్తనశాల’ (విశ్వనాథ సత్యనారాయణ వారి నాటకం)లో ఆమె మాటలు చురకత్తులే. ‘సీత ఎంత ఆవేదనతో ఉన్నా అమాయకంగా మాట్లాడింది రామాయణంలో. కానీ, ద్రౌపది అలా కాదు’ అని విశ్వనాథ అనేవారు. భర్తలను అపురూపంగా చూసుకున్న సహధర్మచారిణి ద్రౌపది. ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ/ భోజ్యేషు మాతా, శయనేషు రంభా/ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ/ షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ’ అనే భారతీయ గృహస్థాశ్రమ ధర్మానికి ప్రతీక, ఉత్తమ ఇల్లాలు ద్రౌపది.


logo