మంగళవారం 26 మే 2020
Devotional - Apr 15, 2020 , 23:47:43

పూతవ్రత సీత

పూతవ్రత సీత

పతివ్రతా శిరోమణి సీతాదేవి సాధ్వీమణిగా, పూతవ్రతగా భారతీయ సంస్కృతిలో గుర్తింపు పొందింది. రామాయణంలో ప్రముఖ పాత్ర ఆమెదే. ఆమె లేకుంటే అసలు రామాయణమే లేదు. అందుకే, వాల్మీకి ‘కావ్యం రామాయణం కృత్స్నం సీతా యాశ్చరితం మహత్‌' అన్నారు. రావణ వధానంతరం అగ్నిప్రవేశంతో పునీత అయింది సీతాదేవి. అందుకే సతీసావిత్రి, అనసూయ, అహల్య, తార, మండోదరిల సరసన ఆమె పతివ్రతగా విశేష ఆదరణ పొందుతున్నది. రావణాసురుడు ఎన్నివిధాలా బెదిరించినా అతనిని గడ్డిపోచలా తీసివేసింది. రామునిపై అపారమైన విశ్వాసాన్నే ప్రకటించింది.

సీతాదేవి తన జ్ఞానం, మనోనిబ్బరంతో పతివ్రతా లక్షణాలను లోకానికి చాటి చెప్పింది. ఆమె పాతివ్రత్యం గురించి వాల్మీకి ‘ప్రియతు సీతారామస్య దారా పితృకృతా ఇతి గుణాద్రూపం గుణాచ్ఛాపి ప్రీతిర్భూయో భ్యభివర్ధతే’ అన్నారు. భార్యాభర్తలు దాంపత్యంలో గుణరూప నిరూపణలో పరస్పరం ఎంతో ప్రీతిగా ఉండాలన్నది వారి భావన. స్వయంవరంలో శివధనుస్సును ద్రుంచి రాముడు ఆమెను వివాహమాడాడు. ఇక్కడ వీరత్వం, రూపమే తప్ప గుణాల ప్రసక్తి లేదు. కొన్నాళ్ల తర్వాతే వారి గుణాలు ప్రాధాన్యం వహిస్తాయి. అయితే, సీతాదేవి వ్యక్తిత్వం అయోధ్యకాండ నుంచి ప్రస్ఫుటమవుతుంది.

కైకేయి వరాలు కోరటం, దశరథుడు అంగీకరించటం రాముడు తెలుసుకొని వాటిని చెప్పాలని సీతమ్మ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆమె స్పందన, స్వతంత్ర ఆలోచన, దృఢసంకల్పం, స్థిరచిత్తం, భారతీయ సమాజంలో సగటు మహిళకు ఉండాల్సిన ధైర్యం, తెగింపును చాటాయి. పతివ్రతా లక్షణాలను ఈ సందర్భంగా చక్కగా నొక్కిచెబుతుంది. రాముడు తాను ‘అరణ్యవాసం పోతా’నంటాడు. ‘అత్తామామలకు సేవ చేస్తూ అయోధ్యలో ఉండమని’ ధరణిజను కోరుతాడు. అడవిలో ఎదురయ్యే కష్టాలు ‘సీతాదుఃఖతరం వనం’ అని రాముడు ఏకరువు పెడతాడు. దానికి ఆమె ధైర్యంగా ఇలా ప్రశ్నిస్తుంది. ‘కితామన్యత వైదేహి పితామే మిథిలాధిపః రాజమాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం’. ‘నేనేమో తండ్రిచాటు బిడ్డను. మా తండ్రి జనకుడు పురుష రూపంలోఉన్న స్త్రీని అల్లుడిగా చేసుకున్నాడు’ అని వ్యంగ్యపు మాట అది. ‘ఇప్పుడు నేనేం చేయాలి. భార్యను రక్షించుకోలేడా?’ అనికూడా ప్రశ్నిస్తుంది.

పెల్లుబుకిన ఆవేశంతో ‘స్వయంతు భార్యకౌమారీ చిరమధ్యుషితాం సతీ శైలూషి ఇవ మాం రామ వరేభ్యోధాతు మిచ్ఛసి’ అని కూడా సీత ప్రశ్నిస్తుంది. ‘రామా! చాలాకాలం నీతో కాపురం చేశాను. శీలవతినీ, యౌవనవతినైన భార్యను. ఇప్పుడు నాటకంలో వేషధారి వలె నన్నెవరికిచ్చి వేయదలిచావు’ అని నిలదీస్తుంది. ‘భార్యకు భర్తే సర్వస్వం. అడవైనా, ఇైల్లెన నీవున్న చోటే నాకు స్వర్గం, లేకుంటే నరకం’ అని చెప్పడం ద్వారా మహిళలకు పతివ్రతా ధర్మాన్ని బోధించింది సీతామతల్లి. ‘నీ వెంటే నేనూ వస్తానని’ భీష్మించుకుకూర్చుంటుంది. నగలన్నీ తీసి మూటగట్టి, నార చీర ధరిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించి, అంతిమంగా విజయమే సాధిస్తుంది. ఈ సందర్భాన్ని బట్టే ‘రాముడెక్కడ ఉంటే అయోధ్య అక్కడే’ అన్న నానుడి వాడుకలోకి వచ్చింది.

అశోకవనంలో హనుమంతుడు తన భుజాలపై ఎక్కించుకొని సీతమ్మను రాముని దగ్గరకు చేర్చడానికి ఆసక్తిని కనబరుస్తాడు. కపివరుని ఆకారం చూసిన, ఆమె వ్యక్తంచేసిన అన్ని సందేహాలూ విశ్వరూప దర్శనంతో పటాపంచలవుతై. కేసరి శక్తిసామర్థ్యాలను ఒకవైపు పొగుడుతూనే మరోవైపు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది. ‘తన దేహాన్ని రాముడు తప్ప పరపురుషుడెవరూ తాకడం సహించ’నంటుంది. ‘భర్తుర్భక్తి పురస్కృత్యా రామా దన్యస్య వానరా నాహం స్వష్ట్రు స్వతో గాత్ర విలచ్ఛేయం వానరోత్తమా! (వాల్మీకి రామాయణం, సుందరకాండ-37వ సర్గ, 62వ శ్లోకం). ‘నా బొందిలో ప్రాణం ఉండగా పరపురుష కాయం స్పర్శ తగులకూడ’దంటుంది. తనను అపహరించిన వేళ రావణుని స్పర్శ కారణంగానే ఎంతో తల్లడిల్లి పోయినట్లు కూడా చెప్తుంది. రామునిపై ప్రేమను ప్రకటిస్తూనే, ఆ ధీరోదాత్తుని శక్తి సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తుంది సీతమ్మ. ‘నీతో నేను వస్తే రావణాసురుడు చేసిన పనికి, నువ్వుచేసిన పనికి మధ్య తేడా ఉండదని’ ధర్మసూక్ష్మం చెప్పి, చివరకు ఒప్పిస్తుంది.


logo