బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 13, 2020 , 22:54:18

తమసోమా జ్యోతిర్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

సూర్యుడు అస్తమించగానే వెలుగులు వెళ్లిపోయి, లోకాలను చీకట్లు అలుముకొంటాయి. వాటిని తొలిగించి, మళ్లీ వెలుగులను తెచ్చుకోవడం కోసం దీపాలను వెలిగించుకుంటాం. విద్యుద్దీపాలు కనుక మీట నొక్కితే సరిపోతుంది. కానీ, వెనుకటివారు ప్రమిదలో స్నేహమనే చమురును నింపి వత్తి వేసి అగ్గిపెట్టె (మ్యాచ్‌బాక్స్‌)లోని పుల్ల సాయంతో వెలిగించేవారు. స్నేహమంటే నూనె. స్నేహితుని వలె మానవునికి సహాయపడుతుంది కనుక చమురుకు స్నేహమని పేరు. చీకట్లను తొలిగిస్తున్న దీపానికి సర్వజనావళి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం మన భారతీయ సంప్రదాయం. ఇంకా కొందరు అదనంగా ‘దీపం జ్యోతి పరబ్రహ్మం/ దీపం సర్వ తమోపహం/ దీపేన సాధ్యతే సర్వం/ సంధ్యాదీపం నమోస్తుతే’ అని కూడా కీర్తిస్తారు.

‘ఈ దీపకాంతి పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. విశ్వరచనకు మూలకారణమైన చైతన్యానికి పేరే ‘పరబ్రహ్మం’. అగ్నిదేవుణ్ణి విశ్వచైతన్య స్వరూపమైన బ్రహ్మగానూ ఋషులు దర్శించారు. ‘జ్యోతి’ అన్న పదానికి ‘సూర్యుడు’ అని అర్థమున్నది. ఈ దీపం తన స్థాయిమేరకు సూర్యునికి ప్రతినిధిగా మాత్రమే కాక ప్రతిగా అంటే ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తున్నది. దీపం చీకట్లను అన్నింటినీ పోగొడ్తున్నందువల్ల మన పనులన్నీ చక్కగా నెరవేరుతున్నాయి. సంధ్యా సమయంలో వెలిగించే గొప్పనైన ఈ దీపానికి నమస్కారాలు’ అన్నది పై శ్లోకంలోని భావం.

చీకట్లను తొలిగించుకోవడానికి మానవుడు చేసిన వైయుక్తిక యత్నమే దీపారాధన. సమస్త భూమండలాన్ని నిరంతరాయంగా ఆక్రమించుకొని పాలిస్తున్న గాఢతమమైన తిమిరాన్ని పారద్రోలి, ఈ భూమిని ప్రాణశక్తితో నింపడానికి పరమాత్మ స్వయంగా ప్రతిరోజూ పొద్దున్నే తూర్పుకొండపై దీపమై నిలుస్తాడు. ఆ మహోన్నత దీపం పేరే ‘సూర్యభగవానుడు’. సమస్త లోకాలకు వెలుగులనిచ్చే ఆ దీపాన్ని అగస్త్య మహర్షి మార్గదర్శనంతో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇలా ప్రార్థించాడు. ‘రశ్మిమంతం సముద్యంతం/ దేవాసుర నమస్కృతం/ పూజమస్వ వివస్వంతం/ భాస్కరం భువనేశ్వరమ్‌’. ‘భాసం కరోతీతి భాస్కరః’. అంటే, కాంతిని కలుగజేసేవాడు భాస్కరుడు. కాంతి సూర్యుడున్నంత సేపే ఉంటుంది. మరి, రాత్రి మాటేమిటి? రాత్రివేళ నక్షత్రాల వెలుగు ఉంటుంది. సూర్యుడికి ‘వ్యోమనాథుడు’ అనీ పేరుంది. ‘వ్యోమము’ అంటే ‘అంతరిక్షమనీ’ అర్థం. నిండుసభలో రాజు ఉండగా, మిగతావారు ప్రకాశించడానికి వీలుండదు. అలాగే, సూర్యుడు కొలువుదీరి ఉన్నప్పుడు మనకు నక్షత్రాలు కనబడవు.

రాత్రి నక్షత్రాల వెలుగులో భూమి తన పనిని తాను చేసికొంటూ వెళుతుంది. మినుకు మినుకుమంటూ మెరిసే నక్షత్రకాంతి అంతలా వస్తుందా! విద్యుద్దీప కాంతులు లేనిచోట నక్షత్రకాంతి మన అనుభవంలోకి వస్తుంది. యాభై, అరువై ఏండ్ల కిందివరకు బాటసారులు రాత్రిపూట నక్షత్రాల వెలుగును ఆధారంగా చేసుకొనే తమ ప్రయాణాలను కొనసాగించేవారు. మనం పెద్దగా లెక్కచేయని నక్షత్రకాంతులు మానవ జీవనగమనాన్ని శాసిస్తవని భారతీయ జ్యోతిశ్శాస్త్రం చెపుతున్నది. రాత్రిళ్లు భూమిని నక్షత్రాలకు వదిలేసిన సూర్యుడు తన మానాన తాను తిరుగుతున్నాడా? అంటే ‘లేదనే’ అనాలి. జాంబవతీ- శ్రీకృష్ణుల సంతానమైన సాంబునికి అప్పట్లో వైద్యానికి లొంగని కుష్టువ్యాధి సంక్రమించింది. సాంబుడు ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడిని ఆరాధించి స్వస్థతను పొందాడు. సాంబుడు చేసిన సూర్యస్తోత్రంలోని ఒకానొక శ్లోకార్థమిలా ఉన్నది. ‘నీ వేల వేల కిరణాలతో పగలంతా ప్రకాశాన్నిస్తూ, నీ కిరణాల శక్తివల్ల ఏర్పడిన చంద్రకాంతితో రాత్రిని ప్రకాశింపజేస్తావు. ఓ అరుణదేవా! ఆపదలను పరిహరించుము’. ‘యస్యచ సహస్రాం శోరభీషులేశో/ హిమాంశు బింబగతః భా సయతి/ నక్త మఖిలం కీలయతు విపద్గణా నరుణః॥’. ‘సూర్యరశ్మి ప్రతిఫలనమే వెన్నెల’ అని స్పష్టం చేసి ఋషులకు మనమూ మన ప్రస్తుత అనారోగ్య (కరోనా: కొవిడ్‌-19) సమస్య నుంచి గట్టెక్కించమని మనసారా నమస్కరిద్దాం.


logo