బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 12, 2020 , 00:30:59

అంతర్గత శత్రువులు

అంతర్గత శత్రువులు

‘నువ్వు మనిషివి కావాలి’ అని వేదం చెప్తున్నది. ‘మనమంతా మనుషులమే కదా. ఇంక మనుషులుగా ఉండాలనే మాటేమిటి?’ అన్న సందేహం కలుగవచ్చు. కానీ, మనిషిగా ఉండాలనే మాట ప్రతి మనిషీ గుర్తుపెట్టుకోవలసింది. సృష్టిలో ఏది ఎట్లుండాలో అది అట్లే ఉంటుంది. నిప్పు స్వభావం మారదు, అది దేన్నైనా కాలుస్తుంది. మట్టి స్వభావం మారదు, అది ఎక్కడున్నా వాసన కొడుతుంది. గాలి స్వభావం మారదు, అది స్పృశిస్తుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి, ఓషధులున్నాయి. వాటి గుణం మారదు. ఇంతెందుకు, పశుపక్ష్యాదుల స్వభావం సృష్ట్యాదినుంచి ఒకేవిధంగా ఉంటున్నది.

గుడ్లగూబ స్వభావం మోహం. అది చీకటిని ఇష్టపడుతుంది. తోడేలు స్వభావం క్రోధం. అది ఏ జంతువు కనిపించినా ఎగిసిపడుతుంది. కుక్క స్వభావం కలహం. పోట్లాడకుండా కుక్కలుండవు. పిచ్చుక స్వభావం కామం. కోరిక తీరేదాకా పరిగెత్తుతుంది అది. గరుత్మంతుని స్వభావం మదం (అహంకారం). తనకే ‘బంగారు రెక్కలున్నాయని’ దాని గర్వం. గ్రద్ద స్వభావం లోభం. నేల మీద చనిపోయిన ఎలుక పిల్ల కనిపించినా అది అల్లంత ఆకాశం నుంచి కిందికి దిగుతుంది. గుడ్లగూబ, తోడేలు, కుక్క, పిచ్చుక, గరుడుడు, గ్రద్ద ఈ ఆరూ తమ స్వభావాలకు అనుగుణంగానే నడుచుకుంటాయి. వాటిని మనం తప్పుపట్టలేం కూడా. కానీ, ఒకవేళ ఈ జంతు పక్షి స్వభావాలను మనం అలవర్చుకొంటే, మనిషి మనిషిగా ఉండగలడా? మరి, మనిషి స్వభావం ఏమిటి? దానికి సమాధానం ‘మానవత్వమే’.

మనిషి ఆలోచనాపరుడు, బుద్ధి జీవి. వెనుకా ముందు ఆలోచించి పనిచేయడం అతని స్వభావం. దీన్నే ‘వివేకం’ అంటారు. ఏది మంచో, ఏది చెడో తెలిసికొని నడచుకోవాలి. సమాజంలో చెడు కనిపిస్తే శివుడి వలె గరళంలా దాన్ని తాగేయాలి. మంచి ఉంటే దాన్ని జగన్మోహిని వలె అందరికీ పంచాలి. మానవత్వమే మనిషికి శ్రీరామరక్ష! మానవత్వాన్ని ప్రేమించే వ్యక్తి మోహాది షడ్గుణాలకు దూరంగా ఉంటాడు. ఒకవేళ మోహం (అజ్ఞానం) ఆవరిస్తే గుడ్లగూబ అవుతాడు. క్రోధం ఆవహిస్తే తోడేలవుతాడు. మాత్సర్యం (కలహం) ఎక్కువైతే కుక్కగా మారుతాడు. కామం ప్రకోపిస్తే పిచ్చుకలా పిచ్చివాడవుతాడు. అహంకారం (మదం) ఆవేశిస్తే గరుడునిలా కన్నుమిన్ను గానడు. ఇక, లోభం ప్రవేశిస్తే గ్రద్ద కంటే హీనంగా తయారవుతాడు. మనిషి ఒక్కడే తన స్వభావానికి భిన్నంగా నడచుకొంటాడు. అందుకే, మోహాది షడ్గుణాలను మనిషిలోని ‘అంతర్గత శత్రువులు’గా మన పెద్దలు పేర్కొన్నారు.

భగవంతుడు మన వ్యవహారాలకుగాను మూడు సదుపాయాలను కల్పించాడు. వాటినే ‘త్రికరణాలు’ అంటాం. వీటిని సాధనాలని కూడా వారు పేర్కొంటారు. అవి: మనస్సు, వాక్కు, కాయం. మనస్సుతో ఆలోచిస్తాం, వాక్కుతో మాట్లాడుతాం, కాయంతో పనులు చేస్తాం. త్రికరణాలు మానవ జీవన సౌధానికి ఆద్యంతం ఉపయోగకరమైనవి. ఇవి లేకపోతే మనిషి అనేవాడే లేడు. ఇతర పశుపక్ష్యాదులకు కాయం (శరీరం) తప్ప మనస్సు, వాక్కు అనేవి లేవు. భగవంతుని అనుగ్రహం వల్ల లభించినవే ఈ త్రికరణాలు. ఈ మూడింటినీ వశంలో ఉంచుకొంటే, మనిషి మనిషిగా మెలగగలుగుతాడు, వెలుగగలుగుతాడు, మాధవుడూ (దేవుడు) కాగలుగుతాడు.

‘యదన్నం తన్మనః’ అనడం వల్ల మనం తినే అన్నాన్ని బట్టి మనస్సు ఏర్పడుతుందని తెలుస్తుంది. కనుక, మనిషి స్వభావాన్ని ‘అన్నం’ ఒకవిధంగా నిర్దేశిస్తుందన్న మాట. సాత్తికాహారం మనిషిని దేవతగా నిలుపుతుంది. రాజసాహారం మనిషిని విలాస పురుషున్ని చేస్తుంది. తామసాహారం రాక్షసుణ్ణి తయారుచేస్తుంది. మనిషి స్వభావం మారడానికి ఒకవిధంగా ఆహారం కారణమవుతుంది. అలాంటిదే వాక్‌ వ్యవహారం. సత్సంగం, సద్గ్రంథ పఠనం, వేద శ్రవణం వాక్కు పరంగా మనిషిని మంచివక్తగా మారుస్తాయి. ‘మాటకు సత్యం ప్రాణమనే’ విషయాన్ని మరిచిపోరాదు. సత్య సంభాషణ మనిషిని మనిషిగా నిలబెట్టడమే కాక కీర్తిమంతుణ్ణి చేస్తుంది. సత్యస్వరూపుడైన పరమాత్మ సన్నిధికి అతనిని చేరుస్తుంది.


logo