గురువారం 28 మే 2020
Devotional - Apr 10, 2020 , 23:13:24

స్వధర్మమే సర్వోన్నతం!

స్వధర్మమే సర్వోన్నతం!

‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః/మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతి సంజయ॥’. సంస్కృత మహాభారతంలో భీష్మపర్వంలో చోటుచేసుకొన్న శ్రీమద్భగవద్గీతలోని తొట్టతొలి శ్లోకంలోని తొలిపదమే ‘ధర్మం’. దాని విస్తృతి ఈ గ్రంథమంతా మనకు కనిపిస్తుంది. ధృతరాష్ట్ర మహారా జు తన ఆత్మీయుడు, మహానుభావుడు అయిన సంజయునితో ‘సంజయా! ధర్మభూమియైన కురుక్షేత్రంలో యుద్ధం చేయవలెనన్న ఆకాంక్షతో అక్కడికి చేరిన నా వారలు, పాండురాజు కుమారులు ఏం చేశారు’ అన్న మాటల సారాంశంగా భగవద్గీత ప్రారంభమైంది.

సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణావతారమైన శ్రీకృష్ణ భగవానుడు, స్వధర్మ నిర్వహణ నుంచి దూరమైన అర్జునునిలోని కర్తవ్య పరాజ్ఞుఖత్వాన్ని పోగొట్టి, నిస్పృహను తొలిగించే నిమిత్తం బోధించిన భగవద్గీతలోని, మొట్టమొదటి శ్లోకంలోని, మొదటి పదమైన ‘ధర్మ’మనే విష యం. ఇందులోని 18 అధ్యాయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తావితమైంది. ఈ మొదటి శ్లోకాన్నే పండితులు విశ్లేషిస్తూ దీనికి సామాన్యార్థమేగాక, ఒక విశేషార్థాన్ని సైతం చెప్పారు. ఇందులోని శబ్దాలతోనే ఆ సందేశమేమిటో చెప్పారు. ‘క్షేత్రే క్షేత్రే’, ‘ధర్మ కురు’ అన్న ధ్వని ఇందులో ఉందన్నారు. మనిషి తాను పనిచేసే ప్రతీ క్షేత్రంలోనూ ధర్మమే చెయ్యాలని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని బోధగా గుర్తించారు. ఇదే లోకానికి శ్రేయోదాయకమైన కార్యంగా కూడా తెలిపారు. అంటే, గీత ప్రారంభమే ధర్మప్రసక్తితో ఉందన్నమాట!

సర్వమానవాళి చేసే అన్ని పనులూ ధర్మబద్ధంగానే చెయ్యాలని సనాతన ధర్మం చెబుతున్నది. అందుకే, మన పూర్వులు చతుర్విధ పురుషార్థాలలో ధర్మానికి పెద్దపీట వేశారు. అర్థ కామాలు రెండూ ధర్మబద్ధమైన రీతిలోనే సాధించుకోవాలన్న మార్గదర్శనం ఇందులో ఉంది. అప్పుడే ఆ వ్యక్తి మోక్షార్హుడవుతాడన్నది ఆంత ర్యం. అందుకే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ‘ధర్మా విరుద్ధో భూతేషు కామో స్మి భరతర్ష భ’ అన్నాడు. సకల ప్రాణులలో తాను ధర్మ వ్యతిరేకం కాని కామమన్న విషయాన్ని చెప్పడం ధర్మ విశిష్టతను వ్యక్తీకరిస్తున్నది. అంతేకాదు, ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు నేను విధిగా అవతరిస్తానని చెప్పడం ధర్మం అవసరాన్ని తెలుపుతున్నది.

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత/అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌- అంటూ ధర్మానికి ప్రమాదం జరిగిన సందర్భంలో తనను తానే సృజించుకొంటానంటూనే ధర్మవినాశన కాలంలో సాధుజనులకు విపరీతమైన కష్టకాలం ఎదురవుతుంది. అందుకే, ‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అని కూడా ప్రవచించి, సాధుజనులకు, సత్పురుషులకు సాక్షాత్తు ఆ భగవంతుడు అభయమిచ్చాడు. అయితే, మానవుడు అన్నీ ఆ భగవంతుడే చూసుకొంటాడని నిష్క్రియుడు కారాదంటూ కర్మ చేయడాన్నికూడా అర్జునునికి చెప్పినట్లుగా లోకానికి బోధించాడు. పైగా ప్రతివ్యక్తి కూడా తన స్వధర్మాన్ని తాను అనుష్ఠించాలని ఘంటాపథంగా చెప్పాడు. ఆ స్వధర్మాన్ని చెప్పిన సందర్భంలోనే మరోమాట కూడా స్వామి సెలవిచ్చాడు, ‘స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః’ అని స్వధర్మం ఔన్నత్యాన్ని సూచించాడు.

ఏ వ్యక్తి అయినా తన ధర్మప్రవర్తన తన స్వధర్మ నిర్వహణకు కారణం కావాలి. అయితే, స్వధర్మ నిర్వహణ సందర్భంలో ప్రాణం పోయినా ఫరవా లేదన్నాడు. అంతేకానీ, ఇది ఎంత కష్టమైనదైనా సరే పరధర్మం వైపు మాత్రం మొగ్గుచూపరాదన్న సత్యాన్ని స్పష్టంగా చెప్పాడు. పైగా, పరధర్మాచరణ భయావహమైందని కూడా బోధించాడు. దీనికి పలువురు మహనీయులు, భాష్యకారులు స్వధర్మ వివేచనను విస్తృతంగా చేసి తమ జ్ఞాన కిరణాలను మనకు పంచారు. సామాన్యంగా అర్థం చేసుకొన్నా మనిషి ‘మానవధర్మాన్ని’ మరిచి పరధర్మమైన పశుధర్మాన్ని, క్రూరమైన రాక్షస ధర్మాన్ని పాటించరాదని అర్థమవుతున్నది. మానవ ధర్మమైన మానవత్వాన్ని వదలి హింసాయుతమైన రాక్షసధర్మం కారణంగా లోకం ప్రమాదానికి గురవుతుంది. అం దుకే, ప్రతి వ్యక్తికీ స్వధర్మ నిష్ఠ సర్వ శ్రేష్ఠమైన ధర్మమనే విశిష్ట విషయాన్ని భగవద్గీత బోధిస్తున్నది.

 -గన్నమరాజు గిరిజామనోహరబాబు


logo