శనివారం 06 జూన్ 2020
Devotional - Apr 09, 2020 , 22:31:11

మన మనస్సే హనుమ

మన మనస్సే హనుమ

భారతీయ పురాణాల్లోని పాత్రలన్నీ ప్రతీకలే. ఒక్కొక్క పాత్ర ఒక్కో తత్త్వానికి ప్రతీకగా ఉంటుం ది. రామాయణంలో అతిముఖ్యమైన పాత్రగా, భక్త సామ్రాజ్యానికి అధినేతగా కనిపించే హనుమంతుడు మానవ మనస్తత్వానికి సంకేతంగా కనిపిస్తుంటాడు. రాముడు ఆత్మకు ప్రతీకగా భావిస్తే ఆత్మారాముడవుతాడు. ఆత్మశక్తి, చైతన్యం వద్ద మనస్సు తలొంచి కనిపిస్తుంది. రామాయణంలో హనుమంతుని పాత్ర ఒక సంజీవని వంటిది.

అన్నింటికీ ప్రాణం పోసేది హనుమనే. లంకలో సీతమ్మకు రాముని రాకను చెప్పి ప్రాణం పోశాడు. ప్రత్యక్షంగా లక్ష్మణునికి యుద్ధరంగంలో సంజీవని పర్వతం తీసుకువచ్చి ప్రాణం పోసినవాడు. రాము ని రాకను ముందుగా చెప్పి భరతునికి ప్రాణం పోసినవాడు. తన శక్తి తనకు తెలియనివాడు. మరొకరి ప్రేరణ వల్ల ఉత్తేజం పొంది తన విశ్వరూపాన్ని ప్రకటించగలిగినవాడు. 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటగలిగినవాడు. రామ నామస్మరణతో ఎదురైన అడ్డంకులను అధిగమించగలిగినవాడు. కాలానుగుణంగా, ప్రదేశానుగుణంగా, అవసరమైనవిధంగా మాట్లాడటం, ప్రవర్తించడం తెలిసినవాడు అయిన హనుమంతుడు భారతీయులందరికీ ప్రాణం వం టివాడు. హనుమంతుడు లేని ఊరు, ఆయన స్మర ణ లేని నోరు ఉండవని లోక భావన.

నిజానికి మనస్సు తత్త్వం కూడా అదే. తనకు ఎంత శక్తి ఉందో దానికి తెలియదు. ఎవరి వద్ద కూర్చుంటే శక్తి వస్తుందో తెలియజెప్పినవాడు హనుమంతుడు. శరీరం, మనస్సు, ఆత్మ అనే మూడు అంశాలు మనకు త్రిపురాల వంటివి. శరీరం లోహపురం అయితే మనస్సు రజతపురం, ఆత్మ స్వర్ణపు రం అవుతాయి. శరీరానికి సహజంగా శక్తి ఉండదు. మనస్సు ప్రేరణపై మాత్రమే శరీరం స్పష్టంగా పనిచేస్తుంటుంది. మనస్సు ఆత్మవద్ద ఉన్నప్పుడు దానికి అపరిమితమైన శక్తి లభిస్తుంది. శరీరశక్తికే పరిమితమైన మనస్సు ఉంటే అది కేవలం శరీరం బతుకడానికి మాత్ర మే పనిచేస్తుంది. అందుకే మనస్సుకు శక్తి కావాలి. అది ఆత్మశక్తి నుంచి మాత్రమే లభ్యం.

ఈ అంశాలన్నీ హనుమంతుని చరిత్ర లో మనకు అర్థమవుతాయి. మన మన స్సు కోతి వంటిది. ఇంద్రియాల చుట్టూనే తిరుగుతూ ఏదో ఆగని పనులు చేద్దామ ని అనుకుంటూనే ఉంటుంది. ఈ శరీరం ఈ జ్ఞాన-కర్మేంద్రియాలను వ్యర్థంగా ఉపయోగిస్తూంటుంది. దానివల్ల శరీరం తొందర గా పాడై రోగాలకు గురవుతుంది. కానీ, హనుమంతుని వంటి ధీశాలి మార్గం ఆత్మారామ నామస్మర ణ మాత్రమే. ఆయనతో నిరంతరానుబంధం మాత్రమే. అదే అతని శక్తికి మూలం. ఆత్మ స్వతంత్రంగా పనిచేయదు. శరీరానికి స్వతంత్రంగా పనిచేసే శక్తి లేదు. కాబట్టి, ఈ ప్రచోదనం కలిగించి రెండింటి మధ్య సమన్వయం సాధించే శక్తి మరొక టి ఉండాలి. దానికే మనవాళ్లు ‘మనస్సు’ అని పేరు పెట్టారు. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:’ మనస్సే బంధనానికీ, మోక్షానికీ కారణమవుతుంది. శరీరంతో సంబంధం పెట్టుకు న్న మనస్సు శక్తిని కోల్పోతూ బంధనానికి కారణమైతే, ఆత్మతో సంబంధం వల్ల మోక్షానికి కారణమౌతుంది.

‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వా మరోగతా/ అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్‌ స్మరణాత్‌ భవేత్‌'. హనుమంతుని స్మరణ వల్ల మనకు లభించే అంశాలన్నీ మనోధైర్యానికి సంబంధించినవే. మనం హనుమంతుని ఉపాసన చేస్తే సద్బుద్ధి, మానసికమైన బలం, కీర్తి ప్రతిష్ఠలు, ధైర్యం, భయరహిత స్థితి, మానసిక భౌతికరోగాలకు దూరం కావడం, జడత్వం లేకపోవడం, సమయానుకూలంగా, సరైనవిధంగా మాట్లాడగలిగే శక్తి అలవడుతాయి. ఇటువంటి గుణాలన్నీ మనసు పొందదగినవే. మూలశక్తితో కలయిక వల్ల మాత్రమే సాధ్యమయ్యేవి ఇవి. హనుమంతుడు భక్త సామ్రాజ్యానికి కూడా అధిపతిగానే భారతీయ భక్తలోకం గమనిస్తుంది. హనుమంతుడు ఎవరో అర్థమైతేనే, మనకు ఆ మానసిక శక్తి లభ్యమవుతుంది. హనుమంతుని ప్రతీ కథను మనస్తత్వానికి సంబంధించిన కథగా అధ్యయనం చేస్తే, అనువర్తింపజేసుకుంటే రామాయణం, హనుమంతుని గాథలు మనకు కొత్తగా కనిపిస్తాయి. నిరంతర రామ నామస్మరణలో మునిగిపోయే హనుమను మనం స్మరించి ధైర్య, స్థైర్యాలను పొందే ప్రయత్నం చేద్దాం.

-సాగి కమలాకరశర్మ, 97042 27744


logo