శుక్రవారం 05 జూన్ 2020
Devotional - Apr 07, 2020 , 23:15:55

అంతఃకరణ చతుష్టయం

అంతఃకరణ చతుష్టయం

అంతటా ఉన్న పరమాత్ముణ్ణి అన్నివేళల్లో   ఆస్వాదించడమే అందరం చేస్తున్న పని. అంతటా ఉన్నవాడంటే ఎవరు? పురుషుడా? స్త్రీయా?  పదార్థమా? జడమా? ప్రకృతేనా?.. ఇలా    ప్రశ్నించుకుంటూ వెళితే చివరకు ప్రశ్నకు అందని స్థాయిలో  నిలిచే తత్త్వమే అసలైన తత్త్వం. ఒక పదార్థంగానో, ఒక స్థితిగానో, ఒక వ్యక్తిగానో లేదా ఏదో ఒక  అంశంగానో భాసించేది మాత్రమే కాదు. ఇలాంటి పరిణామ పదార్థాలన్నింటికీ  ఆధారభూతమై, తానే అన్నింటిగా మారి         వెలిగించి, తానుగానే ఉండేది పరమాత్మ తత్త్వం. మనఃపూర్వకంగా భక్తితో  శ్రవణ, కీర్తన, స్మరణ, ధ్యాన, అర్చన, వందన, దాస్య, సర్వ సమర్పణాదులు వంటి అనేక  మార్గాల ద్వారా సాధన చేస్తేనే ‘తత్వావగాహన’ కలుగుతుంది.

ఇలా సాధనతో ‘తత్త్వావగాహన’ పొందాలంటే ముందుగా సంస్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక వస్తువును చూడాలంటే ముందుగా కళ్ళు బాగుండాలి. ఆ మేరకు వెలుతురు ఉండాలి. అప్పు డే ‘వస్తువు’ చక్కగా కనబడుతుంది. కనపడినంత మాత్రాన సరిపోదు కదా! ఆ వస్తువు ఏమిటి? అనే పరిశోధన మొదలవుతుంది. అప్పుడు దృష్టికి వచ్చి న వస్తువు బాహ్యరూపం బుద్ధిని చేరుతుంది. బుద్ధిలోనూ తర్కవితర్కాలు జరుగుతాయి. తన పరిధిలో అది తేలితే ఇది ‘ఫలానా వస్తువు’ అని బుద్ధి చెప్పగలుగుతుంది. అప్పుడు అంతఃశోధనతో దాని మూలతత్త్వం తెలుస్తుంది. ‘కళ్ళు బాగుండ టం’ అంటే శుభ్రంగా ఉండటంతోపాటు వాటికి చూసే శక్తి కూడా ఉండాలని అర్థం. అలాగే చైతన్యానుభవానికి దోహదమయ్యే సూక్ష్మమైన అంతఃకరణాదులు, అంతకన్నా స్థూలమైన దేహాదులు, వాటికన్నా బాహ్యంగా కనపడే ప్రవర్తనాదులు.. ఇవన్నీ పరిశుభ్రంగా ఉండితీరాలి కదా!

బాహ్య కారకాలైన ప్రవర్తనాదులు మంచిగా ఉండాలంటే సూక్ష్మాంశాలైన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాదులు తమ తమ స్థితుల్లో ఔన్నత్యాన్ని చూపాలి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం-ఈ నాలుగు అంశాలనే ‘అంతఃకరణ చతుష్టయం’ అంటాం. ఇవి విడివిడి గా చెప్పబడినా ‘మనసు’ అనే ఒకే పదం గా, ఒకే రూపంగా పనిచేస్తాయి. అంటే, మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ చేసిన పనినే మనసు సమర్థించి, సమర్పిస్తుందన్న మాట. ఒక ఇంటిపెద్దలాగా వ్యవహరించే ఈ మనసుకే మనస్సుగా ఒక వ్యవస్థ, ఒక విధానం ప్రత్యేకంగా ఉంటాయి కదా! దానినీ కొంచెం పరిశీలిద్దాం. మనసు కనపడదు. అది ఇంద్రియాలన్నింటి ద్వారా పనిచేస్తుంది. అది ఏ విషయాన్ని తీసుకొని తాకితే ఆ ఇంద్రియం స్ఫూర్తిపొంది ఆ మేరకు పనిచేస్తుంది. మనసు చంచల స్వభావం కలది.

సంకల్ప వికల్పాల స్థితి నుంచి మనసును నిశ్చలస్థితికి తేగలగాలి. మనసు తనంత తానుగా పని చేయలేదు. ఇది మనసుకున్న బలహీనత. అంటే, అది ఒక వస్తువునో, ఇంద్రియాన్నో ఆసరా తీసుకోవాలి. ఈ బలహీనతను మనం ఆధారంగా చేసుకొ ని దానిని సరియైన విధంగా కట్టడి చేయవచ్చు. మనసుకు ఒక ఆధారం చూపించాలి కదా! దానితో కలిసిపోయే ఆధారం కన్నా, దానిని నిలువరించే ఆధారం కావాలి. ఆ ఆధారం దేనిమీదా ఆధారపడనిదై ఉండాలి. ఆ ఆధారం శాశ్వతమైన ‘భగవన్నామ స్మరణమే’ కానీ, మరొకటి కాదు. నామస్మరణ మొదలుపెట్టినప్పుడు మనసు పారిపోతుంది. లేపాలని, ఆపాలని చూస్తుంది. గోల చేస్తుంది.

నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది. ఎలా అంటే, ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది, దానితోనే కాకికూడా! కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా! కాకి లేచింది. కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు. కనుక, తిరిగి అదే జెండామీద కూర్చున్నది. మరొకసారి తిరిగి చూసింది, ఏ ఆధారం లేక జెండామీదే వాలింది. ఇలా మరలా చేసి, చేసి చివరకు ‘ఏ ఆధారం లేదు, కాబట్టి జెం డా మాత్రమే ఆధారం’ అని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది. దీనినే ‘నౌకాగ్రకాక న్యాయం’ అంటారు. అలానే మనసుకు కూడా భగవన్నామ స్మరణనే ఆధారంగా చేసి వేరే పదా ర్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయవస్తువైనపుడు.. పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది. సాధనాత్‌ సాధ్యతే సర్వమ్‌


logo