బుధవారం 03 జూన్ 2020
Devotional - Apr 04, 2020 , 23:08:14

అమరత్వ చిహ్నం ఉషస్సు

అమరత్వ చిహ్నం ఉషస్సు

విశ్వశాంతి, విశ్వబంధుత్వం, సౌహార్ద భావాలను పెంపొందించే ప్రకృతి శక్తులను ఆరాధించమని వేదం ప్రేరేపిస్తుంది. యావత్‌ ప్రపంచాన్నీ మేల్కొలిపి ఉషోదేవతను ఇరవై సూక్తాలలో ప్రస్తుతిస్తూ, దాదాపు 300 సార్లు వ్యక్తీకరిస్తూ, ఉషాదేవి కిరణామృత ఆశీస్సులు పుడమిని తాకగా భూమిపై బతికే జీవకోటిని పండించమని దివ్యమంత్రాలలో ప్రార్థించింది వేదం. ఉషస్సు అనే శబ్దం ‘వశ్‌' ధాతువు నుంచి ఉత్పన్నమైంది. ‘వశ్‌' అంటే ప్రకాశం, దీప్తి అని అర్థం. ఉషోదేవత మానవీయ రూపాన్ని వేదం చక్కగా వర్ణించింది. ఆమె రూపాన్ని వర్ణించినంత అందంగా మరే రూపాన్నీ వర్ణించలేదు. హిరణ్యవర్ణం గల ఉషస్సు ప్రాచీనమైందీ, నిత్య నూతనమైంది. పూర్వదిశలో యజ్ఞస్తంభంలా స్థాపితమై లోకాలకు వెలుగును పంచే ప్రకాశ దేవత ఉషస్సు. ప్రతి ఉషాకిరణం మానవ జీవిత సమీరం. 

‘ప్రతి షిమగ్నిర్జరతే సమిద్ధ: ప్రతి విప్రాసో మతిభి: గృణంత: / ఉషాయాతి జ్యోతిషా బాధమానా విశ్వతమాంసి దురితాపదేవీ॥’- యావత్‌ జగతిలో పక్షిగణాల కిలకిల రావాలతో, మధురగాయకుల సుప్రభాత గీతాలలో జీవకోటిని నిత్యం తట్టి లేపే ఉషాదేవి తన స్వీయప్రకాశంతో అంధకారాన్ని పారద్రోలి పాపాలను దూరం చేస్తూ కర్తవ్యసాధన చేయమని చెబుతుంది. ఉషోదేవత తన కిరణాలనే గుర్రాలుగా చేసుకొని బంగారు రథంలో హృదయమంతా నిండిన సంపదలను మనకై తీసుకువస్తుంది. తూర్పున అంకురించే ఉష:కిరణాలు సూర్యుని తట్టి లేపి గాడాంధకారాన్ని పటాపంచలు చేసి లోకాన్ని కార్మోన్ముఖం చేయమని నిత్యం ఆదేశిస్తుంది. జగత్తులో అందరినీ నిద్ర లేపే క్రియాశీలత ఉషోదేవత రూపంలో భాసిల్లుతుంది. కిరణకాంతితో ప్రభాత సందేశం అందించే ఉషస్సు ప్రశస్తమైన దివి తనయగా మానవ మస్తిష్కాన్ని ఉత్తేజపరుస్తుంది. ఉషోదయంలో అందమైన అంతరార్థం దాగుంది. అది జీవన ఒరవడికే పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. అమరత్వానికి చిహ్నమే ఉషస్సు. అందుకే, ‘అమృతస్య కేతు:’ అని వర్ణించబడింది. ఉషోదేవత ‘మఘోని’ దానశీలురాలు, ‘విశ్వవారా’ సమస్త ప్రాణులతో వరించబడే దేవత. ప్రచేతా ప్రకృతి జనిత ప్రకృష్ణ జ్ఞాన సంపన్నురాలు, సుభగా ధన సంపన్నురాలుగా వేదాలలో కీర్తించబడింది. ఉషస్సు తన ఆరాధకులకు ధనాన్నీ, మంచి సంతానాన్నీ ఇస్తుంది. వారిని రక్షిస్తుంటుంది, దీర్ఘాయుష్షును కలిగిస్తుంది. ఉషోదేవతే వేదకాలంలో సంపదలకు దేవతగా ప్రస్తుతింపబడింది. ఉషోదేవతను సుప్రభాతరాగంతో ఆరాధిస్తే మంచుబిందువులనే ముక్తామణులను ఆశీస్సులను వర్షింపజేస్తూ నిత్యం జీవజాతిని పరిపుష్టం చేస్తుంది.

‘యేతా ఉత్యా: ప్రత్యదృశన్‌ పురస్తా జ్జ్యోతిర్యచ్ఛన్తి రూషసో విభాతీ:/ అజీజనన్‌ సూర్యం యజ్ఞమగ్నిమపాచీనం తమో అగాదజుష్ఠమ్‌’- లోకంలోని గాడాంధకారాన్ని పటాపంచలు చేస్తూ సూర్యుని, యాగాలనూ, అగ్నినీ పటిష్ఠ పరుస్తూ తూర్పున ఉదయిస్తున్న ఉషాకిరణాలు నిర్దిష్ట క్రమంలో, తాము ఎంచుకొన్న దారిలో వెలుగులు పంచుతూనే ఉంటాయి.  సూర్యునికన్నా ముందే ఉదయించే ఉషోదేవత ఉష:కాలంలో మేల్కొనే వారిని తరింపజేసే ‘ప్రథమ స్తుతా’, ‘సుజన్మ ఉషా!’ అని కొనియాడబడింది. మహిమలుగల ఉషోదేవి అంధకార నాశినియై ఉదయిస్తుంది. ప్రపంచంలోని జీవకోటిని ‘లెండి, మేల్కొనండి’ అని నిత్యం ప్రేరేపిస్తుంది.


logo