శుక్రవారం 05 జూన్ 2020
Devotional - Apr 03, 2020 , 22:58:27

త్రిశక్తి స్వరూపిణి!

త్రిశక్తి స్వరూపిణి!

‘నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం/ దేవి సరస్వతీ వ్యాసం తతో జయ ముదేరయేత్‌/ సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం/ నమామి హ్రీమ్మయీం దేవీంధియోనః ప్రచోదయాత్‌'- శ్రీమద్దేవీ భాగవతం పరమపావన గ్రంథం. మహాపురాణం. వ్యాసుడి కంఠం నుండి, ఘంటం నుండీ జాలువా రిన దేవీభక్తి రసామృతం. అష్టాదశ పురాణాల్లో దేవీభాగవతం ఉత్తమోత్తమం. భక్తి ముక్తిప్రదం. దీనిని స్వయంగా వ్యాసుడే జనమేజయునికి వినిపించాడు.

ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థా లను సులభంగా ప్రసాదించేదే దేవీభాగవతం. ‘దేవీ’ అంటే ‘క్రీడించేది’, ‘ప్రకాశించేది’ అని రెండ ర్థాలు. ఈ చరాచర జగత్తంతా ఆ దేవికి ఒక క్రీడావిలాసం. జగత్తును సృష్టించే వేళ ఆమె సృజన స్వరూప. రక్షణ వేళ పాల న స్వరూప. సంహార వేళ రౌద్ర స్వరూ ప. ఆ జగన్మాత గాథను భక్తితో ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా.. అలాంటి వారికి ఏ దుర్గతీ దరిదాపుల్లోకైనా రాదు. కలియుగంలో పురాణశ్రవణ మొక్కటే ధర్మం, మోక్షం. చెవులు లేని పాములు శబ్దాల్ని గ్రహిస్తాయి. కానీ, మానవులలో కొందరు చెవులుండి కూడా పురాణాలను వినడం లేదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతోనే పొందుతాం.

‘దేవీభాగవతం’లో 18,000 శ్లోకాలు, 12 స్కంధాలు, 318 అధ్యాయాలున్నాయి. ఇందులో సర్గ, ప్రతి సర్గ, వంశం, మన్వంతర, వంశాను చరిత్రలు ఉన్నాయి. పరదేవత నిత్య, నిర్గుణ శివస్వరూపిణీ, విశ్వాధార, యోగ గమ్య. ఆమెయే పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె రూపాంతరాలే మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి. ఆ రూపాలను దాల్చే లక్షణాన్నే ’సర్గ’ అంటారు. ఈ మూడు శక్తులవల్లనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. వీరు సృష్టి, స్థితి, లయ కారులు. మూడు మూర్తుల వృత్తాంతాన్ని ‘ప్రతి సర్గ’ అంటారు. 

సూర్య చంద్ర వంశరాజుల చరిత్రను తెల్పటమే ‘వంశ’. స్వయంభువాది మనువుల వంశ, జీవిత కాలపరిమాణాలు వర్ణించే దే మన్వంతరం. ఆ మనువుల వంశ కథలను తెలిపేది వంశానుచరితం. ఈ అయిదూ.. పురాణాలకు ఉండవలసిన లక్షణాలు.

కలియుగంలోని ప్రజలు ధర్మాచార విహీనులవుతారని, అల్పాయుష్కులని వ్యాసభగవానుడు గ్రహించాడు. అందుకే, లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. నిత్యమూ దీనిని కనీసం ఒక శ్లోకమైనా భక్తితో పఠించగలిగితే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. మహమ్మారి విజృంభణలు, ప్రాణభయాలు తొలగిపోతాయి. దేవీ భాగవతం పేరు చెబితే భూతప్రేత పీడలు, అంటువ్యాధులు దిగ్దిగంతాలకు పారిపోతాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఎరుగని వేరొక బాటలోకి అడుగుపెట్ట వలసిన చోట మనం నివసిస్తున్నాం. 

ఇప్పటి అంధకారదశ ఇంతకు పూర్వం మానవజాతి ఎన్నడూ పయనించలేదు. అదే విధం గా ఇప్పటి మనుషుల హృదయాలలో మొగ్గ తొడు గుతున్న సంఘీభావం, సహృదయం, కరిగిపోయి న పరస్పర కలహాలు, అంతరించిన ఈర్ష్యాద్వేషా లూ, సింహాసనం అధిష్ఠించబోయే తరుణం ఆసన్నమైంది. అందరం వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా, దేశంగా కాక సర్వప్రపంచం మానవాళి క్షేమాన్ని ఆకాక్షిస్తున్నాం.

తమకు, తమ కుటుంబాలకు, తమ దేశాలకు కాకుండా సకలదేశాలలోని సమస్త మానవజాతి రూపంలో ఆవిష్కృతమై వున్న భగవంతునికి మాత్రమే చెందిన వారంతా మానవజాతికోసం, ప్రభాత సమయస్ఫూర్తి కోసం లేచి బద్ధకంకణులై పని చేయడం మొదలైంది. ఇంత ప్రముఖమైన, అనంతమై న, బహుముఖమైన పనిలో స్త్రీజాతి ఘనమైన పాత్ర వహిస్తున్నది. 

‘జననీ దుర్గా, హే కాళీ, దిగంబరీ, కపాల మాలాలంకారిణీ, ఖడ్గపాణీ, అసుర సంహారిణీ.. మేం నిష్కల్మషులం, నిర్మలులం. నీ శక్తి ప్రభావంతో మానవ కల్యాణం గావించు తల్లీ..’ అని పరదేవతామూర్తి అయిన ప్రకృతి స్వరూపాన్ని ఆనందంతో, భక్తితో ఆరాధిద్దాం. స్వస్తి..  


logo