శనివారం 06 జూన్ 2020
Devotional - Apr 02, 2020 , 23:50:34

ఆదర్శ మహిళ సీత

ఆదర్శ మహిళ సీత

మహాభారత, రామాయణాలలోని కథానాయికల పాత్రల (ద్రౌపది, సీత)ను తారతమ్య పరంగా చూసినప్పుడు దేని ప్రత్యేకత దానిదిగా, రెండింటిలోనూ విశేష లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండూ మహేతిహాసాలే. వీటికీ కథా సంవిధానంలో, పాత్రచిత్రణలో ఎంతో భేదం కనిపిస్తుంది. త్రేతాయుగంలోని ధర్మాలకు, ద్వాపరయుగంలోని ధర్మాలకు గల భేదమే ఇందుకు ప్రధాన కారణం. మహాభారతంలోని పాత్రలన్నీ సాధారణ మానవులుగానే స్ఫురిస్తాయి. మనుషుల్లో వుండే బలహీనతలన్నీ వారిలోనూ కనిపిస్తాయి. కానీ, రామాయ ణం అలా కాదు. ఇందులో గొప్ప ఆదర్శవాదం గోచరిస్తుంది. ఆదర్శ దంపతులకు ఉండవలసిన సకల సలక్షణాలు అన్నీ సీతారాములలో కనిపిస్తా యి. అందుకే, భారతీయులకు వారిద్దరూ మార్గదర్శకులైనారు.


పురుషులలో రాముని వలెనే,  స్త్రీల లో సీతయే ఆదర్శమహిళ. సీతా సౌశీ ల్యం, పాతివ్రత్యం, కష్ట సహిష్ణత, భర్తపై అచంచల విశ్వాసం.. వంటివన్నీ ఆమెకు నారీలోకంలో సమున్నతమైన స్థానాన్ని కల్పించాయి. ‘సీత-ద్రౌపది’.. వీరిద్దరూ రామాయణ- మహాభారతాల్లో కథానాయికలు. ఇద్దరూ ‘అయోనిజలు’గా పేరు పొందిన వారే. ఇద్దరూ భర్తలతో అడవులకేగి అనేక కష్టాలను అనుభవించిన వారే. కానీ, సహనశీలంలో సీతకు సీతయే సాటి. ద్రౌపది బహుభర్తృత్వ ధర్మం వేరు. ‘భర్త తోడిదే లోకమని నమ్మిన మహా పతివ్రత’ సీత. వన వాసానికి వెళ్లే భర్తతో తానుకూడా వస్తానని బతిమాలి మరీ ఆయనను ఒప్పించింది. ‘చచ్చినా బతికినా సతికి పతియే గతి. భర్తకెలాంటి కష్టమూ కలిగించకుండా అతనికి నీడవలె అడవులలోనే ఉండాలి. మగనితో ఉన్నప్పుడు అరణ్యమే అంత:పురం. భర్త లేని స్వర్గమైనా నరకమే. అర్థాంగిగా భర్త సుఖదు:ఖాలలో భాగస్వామి కావాలి. వీరుడైన పురుషుడు తన భార్యను పరుల పంచన వుంచరాద’న్నది ఆమె మార్గం. రావణుడు తన ఐశ్వర్యాన్ని ఘనంగా చెప్పి, ఎంత ప్రలోభ పెట్టినా ఆమె పాతివ్రత్యం అణుమాత్రమైనా సడలలేదు.


సీతాదేవి సహనానికి మారు పేరు. తన భర్త పట్టాభిషేకానికి కైకేయి అంతరాయం కలిగించినా, ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. మామను నిందించలేదు. భోగభాగ్యాలకు దూరమైనా బాధపడలేదు. బంధువులకు దూరమయ్యానని అలుక పూనలేదు. భర్తను అనుసరించడమొక్క టే తన కర్తవ్యంగా భావించింది. పర నిం ద ఆమె ఎరుగదు. అరణ్యంలో తనను ఆదరించిన అనసూయతో తన జన్మ, వివాహ వృత్తాంతాలను చెప్పిందే కానీ, తమ వనవాసానికి కారణభూతులైన వారిని గురించి ఒక్కమాటైనా చెప్పలేదు. భరతుని రాకను చూసి లక్ష్మణుడు కోపించాడు. కానీ, సీతమ్మ ముఖంలో చిన్న అసూయకూడా కనిపించలేదు. అరణ్యవాసాన్ని ఆమె కష్టంగానూ భావించలేదు. 


ముగ్గురు అత్తలపట్ల సీత ఎంతో గౌరవ మర్యాదలనే చూపింది. వారి ఆదరాన్ని చూరగొన్నది. రామలక్ష్మణుల స్థితికంటే తన రాకకోసం ఎదురుచూసే కౌసల్యాదేవిని తలచిన తన హృదయం తల్లడిల్లుతున్నదంటూ దు:ఖించింది. ఎట్టి పరిస్థితులలోను భర్త శ్రీరాముని కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగరాదన్నది సీతమ్మ అభిమతం. తన శాపంతో రావణుని రూపుమాపగల శక్తి కలిగి ఉండికూడా ‘ఈ విధంగా చేస్తే రాముని శౌర్య పరాక్రమాదులు లోకానికి వెల్లడి కావనే’ ఉద్దేశ్యంతోనే ఆమె రావణుని శపించలేదు. తనను ‘వీపుపై ఎక్కించుకొని లంకనుంచి తీసుకొని వెళ్తానని’ హన్మంతుడు అన్నప్పుడు.., సీత నిరాకరించింది. ‘హనుమా! నేను నీ వెంట రాను. ఎందుకంటే, రావణుని చంపి నన్ను కొనిపోయిన కీర్తి రామునికే దక్కాలి. నువ్వు నన్ను తీసుకొ ని వెళితే రామునికి ఆ కీర్తి ఎలా వస్తుంది? ఆయన శత్రు సంహారం చేయాలన్నదే కదా నా లక్ష్యం’ అని అన్నదామె.

రాముడు శీలపరీక్ష కోసం తనను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు.. లోకనిందకు వెరచి పరిత్యాగం చేసినప్పుడు కూడా సీత హృదయంలో రామునిపైన వున్న అవ్యాజమై న ప్రేమ ఏ మాత్రం సడల లేదు. సీత జీవితమంతా కష్టాలతోనే గడిచింది. భారతీయ స్త్రీ సౌశీల్యానికి ఆమె ఒక సమున్నత ప్రతీక. ఎన్ని కష్టాలు వచ్చినా పాతివ్రత్యం ఇంచుకైనా వీడని ఆదర్శ స్త్రీ మూర్తి ఆమె.


logo