సోమవారం 25 మే 2020
Devotional - Mar 21, 2020 , 22:47:51

ఆధ్యాత్మిక వివక్ష అనవసరం

ఆధ్యాత్మిక వివక్ష అనవసరం

తమ చైతన్యాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళటంలో స్త్రీ పురుష తారతమ్యం లేనిది భారతీయ ఆధ్యాత్మికత. అంతర్గత స్వభావం విషయంలో స్త్రీ.. పురుషునికి ఏ మాత్రం తీసిపోదు. మనం స్త్రీ, పురుషుడు అని వ్యవహరించేది పైపైన ఉన్న రూపాన్ని మాత్రమే, లోపలి విషయం ఒకటే! పైన కనిపించేది లోపల దాగిన ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని నిర్ణయించలేదు.

ప్రాచీనకాలంలో మహిళలు కూడా జంధ్యం (యజ్ఞోపవీతం) ధరించేవారు. ఎందుకంటే, అది లేకుండా ధార్మిక గ్రంథాలను చదువడం వీలు కాదు. పురుషుల లాగానే వారుకూడా వైవాహిక జీవితంలో పది లేదా ఇరవై సంవత్సరాలు గడిపి తమకు ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కలిగినప్పుడు కుటుంబాన్ని త్యజించవచ్చు. భారతదేశంపై ఆటవికుల దాడి జరిగినప్పుడు, మహిళలకు క్రమంగా స్వేచ్ఛ హరించుకొని పోయింది. నియమాలు మారటం ప్రారంభమయింది. మహిళల భద్రతకోసం అటువంటి నియమాలు కొద్దికాలం అవసరమై ఉంటాయి. కానీ, దురదృష్టవశాత్తు అది అనధికార ‘చట్ట’మైంది. ఆమెను జంధ్యం ధరించరాదనటంతో అన్యాయం జరగటం ప్రారంభమైంది. తన భర్తకు సేవ చేయటమనే ఒకే ఒక్క మార్గంలోనే ఆమెకు ముక్తి లభిస్తుందని చెప్పారు. అప్పటినుండి, పురుషులు మాత్రమే పరిత్యాగులు కావాలనే విషయం స్థిరపడింది.

దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఇది కొన్నిసార్లు కొనసాగుతున్నది. తమ తండ్రికో, భర్తకో సేవ చెయ్యటానికే వారు పుట్టారని స్త్రీలకు చెప్పారు. ‘ప్రజలు అద్వైతం గురించి మాట్లాడేవారు అంతా ఒక్కటే, కానీ స్త్రీలు మాత్రం తక్కువ’ అని అంటుండే వారు. తన ఉనికి ఆమెపై ఆధారపడి ఉన్నదని తెలిసినా అతను ఆమెను అంగీకరించలేకపోతే, ఎదురుగా కనిపిస్తున్న ద్వంద్వాలను అంగీకరించటం సాధ్యం కాదు. ఎక్కువ తక్కువలు పక్షపాతపూరిత బుద్ధినుండే పుడతాయి. అది రెండు గుణాలకు సంబంధించింది. పురుషునినుండి జన్మించిన ఒక స్త్రీ అతనికంటే తక్కువ అయినప్పుడు అతడు ఆమెకంటే ఉన్నతుడు ఎలా అవుతాడు? అసలు అటువంటి అవకాశమే లేదు. ఈ సమస్య విశ్వజనీనం. ఎవరో ఒక వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నాడని కాదు, ఇలా ఆలోచించడం పురుష స్వభావమైంది. అతని సంస్కృతే మతంలో భాగమైంది.

ఒకప్పుడు ఒక సంఘ సంస్కర్త స్వామి వివేకానంద వద్దకు వెళ్ళాడు. ‘మీ అంత గొప్పవారుకూడా స్త్రీలను సమర్థించడం హర్షనీయం. నేనేం చెయ్యను? నేను వారిని సంస్కరించాలనుకుంటున్నాను. దీనికి నేను మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పుడు వివేకానందుడు ఇలా అన్నాడు. ‘వదిలిపెట్టండి. వారికి మీరు ఏమీ చెయ్యనక్కరలేదు. వారినలా వదిలేయండి. వారేమి చెయ్యాలో అది చేస్తారు. ఇప్పుడు అవసరమైంది ఇదే. పురుషుడు స్త్రీని సంస్కరించనవసరం లేదు. అతడు కనుక అవకాశం ఇస్తే అవసరమైంది ఆమే చేస్తుంది.


logo