శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 27, 2020 , 16:41:03

మంచి మార్గంలో నడిపించేది ఆధ్యాత్మిక యాత్ర

మంచి మార్గంలో నడిపించేది ఆధ్యాత్మిక యాత్ర

యువత సన్మార్గంలో నడిచేందుకు ఆధ్యాత్మికత ఓ మార్గమని వారు నమ్మారు. తమ యాత్ర ద్వారా కొంతమందిలోనైనా మార్పు తీసుకురావాలనుకున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల్ని సందర్శిస్తూ.. యువతను ఆధ్యాత్మికం వైపు మళ్లించే ఓ ప్రయత్నం చేశారు.

తమిళనాడులోని వేలంగుడికి చెందిన పండిదురై, కార్తికేయన్‌ సోదరులు. వీరు యువతను ఆధ్యాత్మికతవైపు మళ్లించాలనుకున్నారు. అందుకు దేశంలోని కొన్ని ఆలయాల్ని సందర్శించాలనుకున్నారు. తమ యాత్ర ద్వారా కొంత మందినైనా ఆధ్యాత్మికం వైపు మళ్లించాలనుకున్నారు. నవంబర్‌ 19న ‘ఆధ్యాత్మిక యాత్ర’ను ప్రారంభించారు. వేలంగుడి నుంచి కారులో బయల్దేరారు. దేశంలోని ప్రముఖ ఆలయాల బొమ్మల్ని కారు చుట్టూ రేడియంతో అతికించారు. భారత్‌, నేపాల్‌లో 49 రోజులు ప్రయాణించారు. 501 ప్రముఖ దేవాలయాల్ని సందర్శించారు. ఆలయాల సందర్శన అనంతరం సమీపంలోని వీధుల్లోకెళ్లి యువతను ఒక దగ్గర సమావేశ పరిచేవారు. వారికి ఆధ్యాత్మికతతో చేకూరే లాభాల్ని వివరించేవారు. వీరు ఇటీవల హైదరాబాద్‌లోనూ పర్యటించారు. పలు ఆలయాల్ని సందర్శించారు. ఆలయాల సమీపంలోని యువతకు ఆధ్యాత్మికతపై అవగాహన కల్పించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. యాత్ర గురించి తెలుసుకున్న ఆమె వారిని అభినందించారు. 49 రోజుల పర్యటనలో పండిదురై సోదరులు 20,800 కిలోమీటర్లు ప్రయాణించారు. ‘సమాజంలో కొంతమంది యువత పెడదారి పడుతున్నారు. అలాంటి వారిని మంచి మార్గంలో నడిపించేది భక్తి ఒక్కటే. భక్తి భావం వల్ల చెడు ఆలోచనలు తలెత్తవు. నేటి తరంలో ఆధ్యాత్మిక భావన తగ్గుతున్నది. యువతలో ఆధ్యాత్మికతపై అవగాహన కల్పించేందుకే మేం ఈ యాత్ర చేపట్టాం’ అని పండిదురై చెబుతున్నాడు. నేడు యువత స్మార్ట్‌ఫోన్‌ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దైవచింతన అనేది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని’ కార్తికేయన్‌ అంటున్నాడు. 


logo