సోమవారం 13 జూలై 2020
Devotional - Jan 19, 2020 , 01:53:56

సృష్టి ఎవరి కోసం?

సృష్టి ఎవరి కోసం?

ఈ జగత్తు ఎక్కడిది? ఎవరు సృష్టించారు? ఎందుకోసం? శాశ్వతమైన భగవంతుడే అశాశ్వతమైన సృష్టిని సృష్టించాడని భారతీయ వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. మరి, జీవులు ఎక్కడివి? మానవులుగా మన పాత్ర ఎలాంటిది? ఇందులోని మర్మం తెలుసుకొందాం!‘ఈ ’ ప్రశ్న తరచుగా జిజ్ఞాసువులలో కలుగుతుంది. పరమేశ్వరుడు ‘సృష్టి స్థితి లయ’లకు కారణం. కనుక, ‘అతని కోసమే సృష్టి రచన జరిగిందని’ వాదించే వారు కొందరున్నారు. కానీ, స్వాధ్యాయశీలురైన పండితులు ‘ఈ సృష్టిని జీవుల కోసమే పరమేశ్వరుడు సృష్టించాడని’ పూర్తిగా నమ్ముతారు.

ఈ సృష్టిలో మూడు పదార్థాలు స్పష్టంగా గోచరిస్తాయి. మొదటిది: పరమేశ్వర తత్తం. రెండవది: జీవ తత్తం. మూడవది: ప్రకృతి తత్తం. సృష్టికంటే ముందు సూక్ష్మరూపంలో ఉన్న జీవులు సూక్ష్మమైన ప్రకృతిని ఆశ్రయించే ఉంటారు. ఈ స్థితినే ‘ప్రళయం’ అని పిలుస్తాం. ప్రళయంలోను పరమేశ్వరుడు స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక విధంగా జీవులు, ప్రకృతి పరమేశ్వరునిలో అవిభక్తమై ఉంటాయి. ప్రళయకాలాన్నే మన పెద్దలు శూన్యంగా భావిస్తారు. కానీ, పరమేశ్వరునితోపాటు జీవులు, ప్రకృతి ఉనికిగల పదార్థాలు. వాటి ఉనికికి ఎప్పుడూ భంగం ఉండదు.


పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. చైతన్య స్వరూపుడు. చైతన్యం అంటే ‘జ్ఞానం’. ‘జ్ఞానం’ కలవాడు ఎప్పుడూ మిన్నకుండడు. అంటే, ఊరికే ఉండడని అర్థం. ఎల్లవేళలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. పరమేశ్వరుడు కూడా అంతే. అతనికి సృష్టి రచన చేయడానికి కరచరణాదుల అవసరం లేదు. తాను సర్వవ్యాపకుడు కనుక అశరీరుడు, అచలుడు కూడా. తాను కదలక, సృష్టిలో ప్రతి పదార్థాన్నీ కదిలేలాగా చేస్తాడు. ఇదే ఆయన తత్తం. ఇంతకూ ‘పరమేశ్వరుడు సృష్టిని ఎవరి కోసం రచించినట్లు?’ అంటే, కొందరు అనుకొంటున్నట్లు ‘తన కోసం ఎంత మాత్రం కాదు’. మరి, ఎవరి కోసం? జీవులకోసం అన్నదే దీనికి సరైన సమాధానం.

ప్రకృతి జడం. అది పరిణామశీలం కలిగింది. అందువల్లనే పాంచభౌతికమైన జడప్రపంచం ఏర్పడుతుంది. ప్రపంచం ఉద్భవించడానికి ముఖ్యకారణం ప్రకృతి. ఈ ప్రకృతిని ‘ఉపాదాన కారణం’ అంటారు. ఏ కారణం లేకుంటే కార్యం పుట్టదో, దానికే ‘ఉపాదాన కారణమని’ పేరు. ప్రకృతికి, ప్రపంచానికి ‘కార్యకారణ సంబంధముంది’. మరి, ‘స్వయంగా ప్రకృతి పరిణామం చెందగలదా?’ అంటే ‘అది జడం (జ్ఞానం లేనిది) కనుక, దానికా శక్తి లేదు’. అందుకే, సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు తన జ్ఞానంతోనే జడప్రకృతిని ప్రపంచంగా పరిణమింపజేస్తాడు. జీవులు జ్ఞానం కలిగినవి మాత్రమే కాదు, కర్మలు చేయడంలో ఉత్సాహం కలిగినట్టివి కూడా.

జీవులు కర్మలు (పనులు) చేసినప్పుడు వాటి ఫలాలు అనుభవించక తప్పదు. మరి, అవి చేసే ధర్మాధర్మాలకు అనుగుణంగా సుఖదు:ఖాలను ఎవరివ్వాలి? ప్రకృతా జడం. దానికి జీవుల ప్రవృత్తులెట్లా తెలుస్తాయి? అది అసాధ్యం. ఒక్క సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మాత్రమే జీవులు చేసే పుణ్యపాప కర్మలను గురించి తెలుసుకోగలిగినవాడు. అందువల్లే జీవులు అనుభవించే సుఖదు:ఖాలకు అనుగుణంగా సృష్టి రచన చేయవలసి ఉంటుంది. పరమేశ్వరుడు సృష్టి రచన చేయడంలో సర్వస్వతంత్రుడు, ఆనంద స్వరూపుడు. అతడు జీవులకు సుఖదు:ఖాలు కలిగించేవాడు మాత్రమే. కానీ, తాను వాటిని అనుభవించలేడు. కర్మలు చేయడంలో జీవులు స్వతంత్రులు, కర్మఫలాలను అనుభవించడంలో మాత్రం అస్వతంత్రులు.

పరమేశ్వరుడు ‘తాను అనుభవించేది లేదు కనుక, సృష్టి రచన తన కోసం చేసుకోడు’. కర్మలు చేస్తూ, సుఖదు: ఖాలను అనుభవించే అర్హత కలిగినవి జీవులే కనుక వాటికోసమే సృష్టి రచన చేస్తున్నాడు. పరమేశ్వరుడు కేవలం సృష్టి చేసి ఊరుకోడు. ప్రపంచాన్ని అన్ని విధాలుగా రచించి ప్రాణికోటిని జీవింపజేస్తాడు. దీన్నే ‘స్థితి’ అంటాం. సృష్టించి, పోషించి అంతటితోనూ ఊరుకోడు. ప్రళయం కూడా చేసి, జీవులకు విశ్రాంతిని ఇస్తాడు. జీవులకు సృష్టి జాగ్రదవస్థ లాంటిది. స్థితి స్వప్నం లాంటిది. ప్రళయం నిద్ర లాంటిది. అయితే, అన్ని కాలాలలోను జీవులుంటాయి. పరమేశ్వరుని వలె జీవులుకూడా శాశ్వతమైనవే. అయితే, ‘శాశ్వతుడైన పరమేశ్వరుడు శాశ్వతులైన జీవుల కోసం సృష్టించిన ప్రపంచం అశాశ్వతమైంది’ అన్న విషయం మాత్రం మరవరాదు.

పరమేశ్వరుడు పూర్వసృష్టులలో వలెనే ఈ సృష్టిలోను సూర్యచంద్రాదులనే కాదు, సమస్త పదార్థాలనూ సృష్టించినట్లు వేదం ప్రబోధిస్తున్నది. ‘సూర్యాచంద్రమసౌధాతా యథాపూర్వమ/ కల్పయత్‌ దివంచ పృథివీంచ అంత/ రిక్షమ థోస్వ:’ (ఋగ్వేదం 10-190-3). ఎప్పుడైతే ఈ ప్రపంచం ప్రాణికోటి సుఖదు:ఖాలకు అనుగుణంగా సృష్టింపబడిందో అప్పుడే ప్రాణులు ఆచరించే కర్మలు కూడా నిత్యమైనవనే అభిప్రాయం ధ్రువపడుతుంది. జీవుల కర్మలకు అనుగుణమైన రీతిలో సృష్టి రచన చేసే పరమేశ్వరుడు ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి మహిమోపేతుడో మనం ఎంతమ్రాతం ఊహంచలేం.
జీవులకు సృష్టి జాగ్రదవస్థ లాంటిది. స్థితి స్వప్నం లాంటిది. ప్రళయం నిద్ర లాంటిది. అన్ని కాలాలలోను జీవులుంటాయి. పరమేశ్వరుని వలె జీవులుకూడా శాశ్వతమైనవే. శాశ్వతుడైన పరమేశ్వరుడు శాశ్వతులైన జీవులకోసం సృష్టించిన ప్రపంచం మాత్రం అశాశ్వతం.

సర్వాధీశుడే న్యాయాధీశుడు!


lord-shiva1
వేదాంత దర్శనం పరమేశ్వరుడు ‘తన ప్రయోజనం కోసం కాక, జీవుల ప్రయోజనం కోసమే’ ఈ సృష్టి రచన చేసినట్లు స్పష్టపరుస్తున్నది. ‘న ప్రయోజన వత్వాత్‌' (2-1-32). అంటే, లోకంలో రాజులు, ధనవంతులు తమకు ప్రయోజనం లేకున్నప్పటికీ మానవాళి వినోదార్థం నృత్యగాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అలాగే, ఆనంద స్వరూపుడైన పరమేశ్వరుడు జీవుల ప్రయోజనం కోసమే జగత్తును నిర్మించినట్లు వ్యాసభగవానుడు వేదాంత దర్శనంలో చెప్పిన మాటలు (లోకవత్తు లీలా కైవల్యం) తప్పనిసరిగా గమనించాలి. విషమం, విచిత్రం అయిన ఈ జగత్తును పరమేశ్వరుడు తన ఇష్ట ప్రకారం కాక ప్రాణుల కర్మఫలాలకు తగినట్లుగానే నిర్మించి, ఇచ్చాడు. అందువల్లే అతడు సర్వాధీశుడే కాదు, న్యాయాధీశుడని కూడా మనం అర్థం చేసుకోవాలి.
Masana-Chennappa
-ఆచార్య మసన చెన్నప్ప
సెల్‌: 98856 54381


logo