శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 08, 2020 , 17:37:48

వరాల లక్ష్మికి స్వాగతం.. సంపత్కరీ స్వరూపం!

వరాల లక్ష్మికి స్వాగతం.. సంపత్కరీ స్వరూపం!

రావమ్మా మా ఇంటికీ అని మనసారా పిలిచే ప్రతీ గృహిణి ఇంట్లోకి వరలక్ష్మీదేవి అత్యంత మంగళకరంగా అష్టలక్ష్మీ సమేతంగా విచ్చేసే శుభసమయమిదే!

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం చాలామంది ముత్తయిదువలు వరలక్ష్మీ వ్రతం తప్పక ఆచరిస్తారు. ఎవరైనా ఉన్నంతలో లోభత్వాన్ని చూపించకుండా ఘనంగానే జరుపుకొంటారు. మనసా వాచా కర్మణా అమ్మవారి సేవలో ధన్యులవుతుంటారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలోని రోడ్‌నంబర్ 49లోని ఆ ఒక్క ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతవేడుకలను మాత్రం కండ్లనిండా చూడాలని ఆశపడే వారు చాలామందే ఉంటారు. కారణం, అక్కడ అమ్మవారికి లక్షలాది పూలతో జరిగే అద్భుత అలంకరణ! నిజానికి ఇది కాదు, ఇప్పటి వార్త. ఈ పూజా కార్యక్రమ నిర్వాహకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి విజయలక్ష్మీ రాజం రెండు నెలల ముందునుంచే అమ్మవారి సాహిత్యసేవకు ఉపక్రమించడం విశేషం. ఏడాది కేడాది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఒక్కో శ్లోకానికి తాత్పర్య సహిత వ్యాఖ్యానం, అందులోని శక్తితత్వాన్ని ఆమె అత్యంత సరళంగా విడమరిచి అక్షరబద్ధం చేయడం గమనార్హం.

అదంతా ఒక చిన్న పుస్తకరూపంలో ప్రతీ సువాసినికీ వాయనంలో భాగంగా ఆమె అందజేస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవి ఆరాధన కాకుండా లలితా అమ్మవారి ప్రస్తావన ఏమిటా అని కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ, ఆ ఒక్కో శ్లోకంలోని పరాశక్తి అంశ, అందులోని మహాలక్ష్మీదేవి తత్వాన్నే ఆమె మనకు ఎరుక పరుస్తారు. ఈ సంవత్సరం లలితా త్రిపురసుందరీ దేవి సర్వోన్నత సంపత్కరీ స్వరూపంగా అవతరిస్తున్నదని, అసలు సంపత్కరీ అంటేనే వరలక్ష్మీ దేవికి ప్రతీక అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ జగన్మాత మహావైభవంలోని కొన్ని విశేషాలనే నమస్తే తెలంగాణ- చింతన పాఠకుల కోసం ఆమె మాటలుగానే ప్రత్యేకంగా అందిస్తున్నాం, చదువండి.

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజాసేవిత
అశ్వారూఢా దిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా
అనంతకోటి సూర్యమండలాలను మాలగా ధరించి, సహస్రావంతమైన పాలపుంతల సమీకరణ శక్తిగా శ్రీంకార మంత్ర స్వరూపంగా ఇష్టకామేశ్వరీ రూపంలో అవతరిస్తున్న శ్రీశ్రీశ్రీ లలితా మహాభట్టారికకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. సకల సృష్టికి ఆధారమై, జన్మజన్మల పుణ్యఫలంగా ఈ జన్మలో అష్టలక్ష్మీ ప్రదాతయైన సుఖసంపత్కరీ స్వరూపాన్ని ఆవాహన చేసే అరుదైన వేళా విశేషమిది. గజసమూహాల శక్తిగా, రణకోలాహలంపైన అధిష్టించిన సంపత్కరీ దేవి అన్యాయాలపై రాక్షస దుష్టస్వభావ ప్రవర్తన కలవారిపై ధర్మయుద్ధానికి సిద్ధపడడం ఇక్కడ ప్రధానాంశం.

శ్రీదేవి ఆయుధమైన అంకుశం నుండి ఉద్భవించిన దేవత సంపత్కరీ. ఈ అమ్మవారి వైభవం ఊహింపశక్యం కాదు. ఆమె రణకోలాహలం అనే ఏనుగుపై అధిష్టించి వస్తుంది. అన్ని రకాల ఏనుగులనూ చాలా తేలికగా మచ్చిక చేసుకొనే అపార శక్తి సామర్థ్యాలు ఆమె సొంతం. త్రిపుర సుందరీదేవి సంపత్కరీ అనే మంత్రదేవతను సర్వగజసేనకు అధికారిణిగా నియమించింది. సుఖ సంపద్వికారమైన చిత్తవృత్తికీ సంపత్కరి అని పేరు. ఈ చిత్తవృత్తిలో శబ్దాదుల సముదాయాన్ని సింధుర వ్రజమని అంటారు. ఇందులోని సుఖప్రవృత్తి, చిత్తవృత్తికి కారణాలైన సుఖవికారాలే గజములు (ఏనుగులు). లౌకికమైన సుఖానుభవాలపై ఇంద్రియ నిగ్రహాల సాధనద్వారా ఉద్ధరింపజేసేదే ఈ జగన్మాత.

ఒక మదపుటేనుగును మావటివాడు అంకుశంతో ఎలా అదుపు చేస్తాడో అలాగే, సుఖవికారాలనే ఏనుగును అధిష్ఠించిన సంపత్కరీ దేవి మనిషి ప్రవర్తనను అదుపులో ఉంచుతుంది. ఇది ఒకరోజులో అయ్యేది కాదు. భక్తి, సత్కర్మలు, ఉపాసనల ద్వారా ఎవరికి వారే సంయమనం పాటిస్తూ, శిక్షణ పొందాల్సి ఉంటుంది. సంపత్కరి అనే పేరులోని కరి అనే శబ్దానికి విద్యా విశేషమని కూడా అర్థం. త్రివర్గ, దశాక్షరీ అనే రెండు మంత్రాలలోని మనోనియమాలను గజవశ్యానికి, గజశిక్షణకు ఉపయోగిస్తారు. మనసును ముఖ్యప్రాణమున లయింపజేసి తురీయస్థితిని పొందడమే ఈ సంపత్కరీ విద్య. నిజానికి ఇదెంతో రహస్యమైంది. దీనిని కేవలం గురుముఖంగానే అభ్యసించాలి. జ్ఞానం (తెలుసుకోవలసిన తెలివి), జ్ఞాత (తెలుసుకొనే వ్యక్తి), జ్ఞేయం (తెలుసుకొని పాటించవలసింది) ఈ మూడు త్రిపుటిలోనివి. ఇవి ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అయితే, ఈ మూడు కూడా బ్రహ్మమే అన్న జ్ఞానం యోగికి ఉంటుంది.

ఇంద్రియాలతో కలిగే జ్ఞానాలన్నీ కూడా నేనే అని తెలుసుకోవడమే అసలు సంధానం. ఇది చక్కగా జరిగినపుడు తురీయ జ్ఞానం బహిర్గతమవుతుంది. జాగృత్, స్వప్న, సుషుప్తులకంటే ఈ జ్ఞానం భిన్నమైంది. ఇది మనుషులందరికీ సమానంగానే ఉంటుంది. కానీ, యోగులకు మాత్రం త్రిపుటి సంబంధం వల్ల ఏకాగ్రత ఎక్కువగా కలుగుతుంది. యోగి తన చిత్తవృత్తితో తనలోని ఆత్మచైతన్యాన్ని కూడా గుర్తించగలడు. చిత్తవృత్తితోనే యోగులు బ్రహ్మంలో ఐక్యమవుతారు. అప్పుడు బాహ్యంగా ఏం జరుగుతుందన్నదీ వారికి తెలియదు. అంటే, వారి చిత్తవృత్తి ఫలవ్యాప్తి చెందదు. కేవలం వృత్తి (కర్మ) మాత్రమే వ్యాప్తి చెందుతుంది. అది క్రమంగా చైతన్యవంతమై అన్ని స్థితులూ దాటి, సమాధిస్థితి వరకు వ్యాప్తి చెందుతుంది. చిత్తవృత్తి లేకుండా, ఆత్మజ్ఞానం కూడా లేకుండా ఉన్న స్థితిని అవిద్యమాయ అంటారు. ఈ మాయ నశించినప్పుడే జీవికి బ్రహ్మైక్యానుభూతి కలుగుతుంది. ఇదే తురీయ స్థితి. దీనిని పొందడానికి సాధన చేయవలసిన విద్యగురించి గురుచరిత్రలో దత్తాత్రేయస్వామి కార్తవీర్యునికి ఉపదేశించాడు.

మదగజరూప వాహినులు మా మనమందలి చిత్తవృత్తులే. సదయము సంపదుల్లాసిత సాగరవీచి సుఖప్రవాహమై మెదలెడు గాదె, వానినిక మెలుగ నీపై నెల్లవేళలన్ కుదురుగ నుండునట్లుగన్ గూర్మిని గూర్పెడు శక్తినీయవో. ఇలా జ్ఞానాలన్నీ తురీయంలో ఏకమవడాన్నే ఐక్య సంపత్కరం. ఈ విద్య సుఖసంపన్మయి, సుఖసంపత్కరి, ఐక్యసంపత్కరీగా వ్యవహారంలో ఉన్నది. ఇటువంటి ఐక్యసంపత్కరి జ్ఞానంతో శ్రీ లలితా త్రిపురసుందరి ఆరాధనలు అందుకొంటున్నది. అంతరంగంలోని ఏనుగులు (రాక్షస ప్రవృత్తి) సాధనద్వారా సర్వశక్తి సమీకరణలతో కూడిన సాధుస్వభావం గలవిగా మారిపోతాయి. అమ్మవారి అనుగ్రహంతో రాక్షస ప్రవృత్తికూడా నశించిపోతుంది. వారిని సద్బుద్ధిగల భక్తులుగా మార్చే అద్భుత శక్తి స్వరూపిణి సంపత్కరీదేవి. ఆమె ఇచ్ఛాశక్తి స్వరూపిణి కూడా. ఎప్పుడైతే మన కోర్కెలను అమ్మకు అప్పజెప్పి వేడుకొంటామో అప్పుడు వాటిలోంచి కేవలం ధర్మబద్ధమైన వాటిని మాత్రమే ఆమె నెరవేరుస్తుంది.


అష్టలక్ష్మీదేవి స్థిరనివాసం
సంపత్ స్వరూపిణియైన మహాలక్ష్మి ప్రకృతి సిద్ధంగా అష్టవిధాలుగా అవతరించింది. కేవలం ధనం ఉండగానే సంపత్తు ఉందని అనలేం. అష్టలక్ష్మీ స్వరూపాలు: ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి. వీరంతా (ఎనిమిది మంది) కూడినప్పుడే నిజ జీవితంలో అష్టలక్ష్మీదేవి స్థిరనివాసమైనట్టు లెక్క. ఆ గృహం ఇక ఆనంద నిలయమే అవుతుంది. శ్రీసూక్తంలో ధనమగ్ని: ధనం వాయు: ధనంసూర్యో: ధనంవసు: ధనమింద్రో: బృహస్పతిం వరుణం ధనమస్నుతే అని ఉంది. సృష్టిలోని ప్రతీ వస్తువుకూగల ప్రాధాన్యం, విలువ మనకు అర్థం కావు. డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉంటాయి. సంపత్తులు ఎన్ని ఉన్నా ప్రేమ, ఆప్యాయతలు, భక్తిశ్రద్ధలు లేని ఇంటి పరిసరాలు నిష్ఫలం. సంపత్కరీ అమ్మవారిని నమ్ముకొని, వేడుకొన్న వారికి ఆమె దీవెనలు తప్పక లభిస్తాయి.


logo