శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 08, 2020 , 17:37:19

కల్కిదేవుని స్ఫూర్తితో.. యుగానికో ధర్మం

కల్కిదేవుని స్ఫూర్తితో..  యుగానికో ధర్మం

కాలం ఎంత అజరామరమో ధర్మమూ అంతే. యుగానికో ధర్మం అన్నది చెల్లుబాటు కాదు. ఏ యుగానికైనా ఒక్కటే ధర్మం. ఒక్కటే పరమార్థం. కాలచక్రం వంటిదే ధర్మాచరణా కూడా.

కృత(సత్య), త్రేతా, ద్వాపర మూడు యుగాల తర్వాత ఇటీవలె మొదలైన కలియుగం ముగింపుతో కాలం ఆగిపోదు. మళ్లీ మరో కాలచక్ర ఆవృత్తం మొదలవుతుంది. ధర్మం కూడా దీనితోపాటు ప్రయణిస్తుంటుంది. సుసంపన్నమైన భారతీయ (హైందవ) ఆధ్యాత్మిక జ్ఞానసంపదలో ధర్మానిది అత్యంత కీలక పాత్ర. పై మూడు యుగాలలోని అవతారమూర్తుల వలెనే ప్రస్తుత యుగానికీ అత్యంత ఆరాధ్యదైవం కల్కి! ఎందుకంటే, మరో కొత్త, సముత్కృష్ట కాలానికి శ్రీకారం చుట్టేది ఆయనే కాబట్టి. ఎందువల్లో మిగిలిన అవతారాలకు వచ్చినంత ప్రాధాన్యం కల్క్యావతారానికి ఇంకా రాలేదు. ముఖ్యంగా వేదాలలో దీని గురించిన ప్రస్తావన లేదని కొందరు ఆధ్యాత్మిక వేత్తలు అంటారు.

అంతమాత్రాన కల్కి అవతార గాథను వట్టి కట్టుకథగా కొట్టిపారేయగలమా? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఇది చివరిది అని, ద్వాపర యుగం ముగింపులోకి వచ్చిన వేళ, శ్రీకృష్ణుని నిర్యాణానంతరం కలి (కాలపు) దృష్టి మొదలైందనడానికి కావలసిన ఆధారాలు మహాభారతంలో ఉన్నట్టు చెప్తారు. అలాగే, గరుడ పురాణం ప్రకారం కూడా ఇది 10వ అవతారం. శ్రీమద్భాగవతంలో పేర్కొన్న మొత్తం 25 అవతారాలలో దీనిని 22వదిగా పేర్కొన్నారు. ఇంతేకాదు, విష్ణు, అగ్ని, పద్మ పురాణాలలోనూ కల్కి భగవానుని పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయి. కలియుగాంతంలో ఆఖరకు సాధువులలోనూ దైవచింతన నశిస్తుందని, పాపం, అధర్మం పెచ్చుమీరి పోతాయని, అప్పుడు కల్కి అవతరించక తప్పదని వేద పండితులు అంటారు.

కలియుగం మొదలై ఇప్పటికి 5,120 సంవత్సరాలవుతున్నట్టు పంచాంగకర్తలు నిర్ధారించారు. వారి అంచనా ప్రకారం అసలు, ప్రస్తుత సృష్టి వయసు 195,58,85,120 (సుమారు 196 కోట్లు) సంవత్సరాలు. ఈ లెక్కన హిమాలయ సానువుల నట్టనడుమ, అద్భుత శంభాల నగర ఆవిర్భావానికి ఇంకా చాలాకాలమే ఉంది. అయినంత మాత్రాన, ఆ కల్కి భగవానుని ఇప్పట్నుంచే మనం ఎందుకు ఆరాధించకూడదు? ఒకే ఒక్క పాదంతో నడిచే ధర్మదేవత నడకను అడుగడుగునా ఎప్పటి కప్పుడు సంరక్షించుకోవలసిన బాధ్యత సద్గుణసంపన్నులైన మానవులందరిపైనా లేదా? ఆయన స్ఫూర్తితో సర్వపాప కృత్యాలను, సకల అధర్మకార్యాలను ఎవరికి చేతనైనంతలో వారు ఎదుర్కోవడంలో తప్పేమీ లేదు.

-సావధానశర్మ


logo