శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jan 08, 2020 , 17:18:10

బోనాలమ్మకు జేజేలు! జాతరల వేళ భారతీయాత్మకు ప్రతీకలైన గ్రామదేవతలపై ప్రత్యేక కథనం.

బోనాలమ్మకు జేజేలు!  జాతరల వేళ భారతీయాత్మకు ప్రతీకలైన గ్రామదేవతలపై ప్రత్యేక కథనం.

బిడ్డలమీద తల్లికి, తల్లిపైన పిల్లలకు ఉండేంత ప్రేమ లోకంలో మరేదీ ఉండదు. పెనిమిటితోపాటు ఇంటికంతటికీ పెద్దదిక్కు అమ్మ. ఇండ్లతోపాటు వాడలను, ఊళ్లనేకాదు, సమస్త లోకాలనే పాలించే జగదాంబ బోనాల తల్లి. అభం శుభం తెలియని ఆడబిడ్డలు, పెద్ద ముత్తయిదువుల నుంచి భక్తిని, శ్రద్ధను మాత్రమే కోరుకొనే కొంగుబంగారం ఆమె! నాలుగు అన్నం మెతుకులే ఆమెకు మహా నైవేద్యం. పల్లెలు, పట్నాలనుంచి మహానగరాల నడిబొడ్ల దాకా వేపకొమ్మలే తోరణాలుగా, పసుపు కుంకుమలే సర్వాభరణాలుగా ఆ అమ్మలగన్నయమ్మ బైలెల్లి వస్తున్నది. ఏడాది కొకసారి నల్లమబ్బుల వెంట నడిచొచ్చే ఆషాఢ తల్లి.. మాయరోగాల రాకాసి పాలిట తిరుగులేని విశ్వశక్తి. ఈ బోనాల (భోజన నైవేద్యం) జాతరల వేళ భారతీయాత్మకు ప్రతీకలైన గ్రామదేవతలపై ప్రత్యేక కథనం.

బిడ్డలమీద తల్లికి, తల్లిపైన పిల్లలకు ఉండేంత ప్రేమ లోకంలో మరేదీ ఉండదు. పెనిమిటితోపాటు ఇంటికంతటికీ పెద్దదిక్కు అమ్మ. ఇండ్లతోపాటు వాడలను, ఊళ్లనేకాదు, సమస్త లోకాలనే పాలించే జగదాంబ బోనాల తల్లి. అభం శుభం తెలియని ఆడబిడ్డలు, పెద్ద ముత్తయిదువుల నుంచి భక్తిని, శ్రద్ధను మాత్రమే కోరుకొనే కొంగుబంగారం ఆమె! నాలుగు అన్నం మెతుకులే ఆమెకు మహా నైవేద్యం. పల్లెలు, పట్నాలనుంచి మహానగరాల నడిబొడ్ల దాకా వేపకొమ్మలే తోరణాలుగా, పసుపు కుంకుమలే సర్వాభరణాలుగా ఆ అమ్మలగన్నయమ్మ బైలెల్లి వస్తున్నది. ఏడాది కొకసారి నల్లమబ్బుల వెంట నడిచొచ్చే ఆషాఢ తల్లి.. మాయరోగాల రాకాసి పాలిట తిరుగులేని విశ్వశక్తి. ఈ బోనాల (భోజన నైవేద్యం) జాతరల వేళ భారతీయాత్మకు ప్రతీకలైన గ్రామదేవతలపై ప్రత్యేక కథనం.

బోనాల (భోజన నైవేద్యం) జాతరల వేళ భారతీయాత్మకు ప్రతీకలైన గ్రామదేవతలపై ప్రత్యేక కథనం.

గ్రామాలలో వెలసి, అక్కడి ప్రజలందరినీ కన్నబిడ్డల్లా ఆదరించే వారు కాబట్టే, వారిని గ్రామదేవతలు అన్నారు. ఏ పేరుతో కొలిచినా అందరు అమ్మలను గన్న మూలపుటమ్మ ఒక్కతే. ఆ మహాతల్లి (ప్రకృతి) అనుగ్రహం వల్లే దేశమంతా ముఖ్యంగా పల్లెసీమల్లో పశుసంపద రక్షింపబడి, పంటపొలాల్లో పచ్చదనం వెల్లివిరుస్తుందని, ఫలితంగా రైతుల ఇండ్లలో ధాన్యరాశులు సమకూరుతాయన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆమె చల్లని చూపు లేకపోతే అతివృష్టి, అనావృష్టి, అంటువ్యాధుల వ్యాప్తి, ఆకస్మిక మరణాలు సంభవించవచ్చు. ప్రకృతి విధ్వంసాలతో సర్వం నాశనమయ్యే మహాదుస్థితీ నెలకొనవచ్చు అన్న భయం, ఆందోళన నిజానికి నిన్న మొన్నటిది కాదు. అనాదిగా వస్తున్నదే.

దీని నుంచి తేలిగ్గా బయటపడి, అమ్మవార్ల కరుణా కటాక్షాలను పొందడానికి కొందరు ఏకంగా దున్నపోతులు, గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచ్చే (నైవేద్యం) ఆచారమూ చాన్నాళ్లపాటు కొనసాగింది. మన దేశంలో జంతుబలి నిషేధం తర్వాత ఈ సంప్రదాయం నిలిచిపోయింది. గ్రామదేవతలకు సాత్విక నైవేద్యాన్ని (నీరు, బియ్యం, అన్నం, పాలు, పెరుగు, బెల్లం, ఖర్జూరాలు వంటివి) కొత్త కుండలను బోనాలుగా చేసుకొని, వాటిలో తీసుకెళ్లి అమ్మవార్లకు పెట్టడం గత కొన్ని శతాబ్దాల నుంచీ కొనసాగుతున్నది. మట్టి కుండలు లేదా స్టెయిన్‌లెస్ స్టీలు వంటి లోహాల గుండ్రని పాత్రలను పసుపు కుంకుమలతో అలంకరించి, వాటిలో అమ్మవార్లకు భోజనం సమర్పించడమే బోనాలు ఉత్సవంగా రూపాంతరం చెందింది. బోనాల కుండలపైన జ్యోతులనూ ఉంచి తలపై పెట్టుకొని చెప్పులు లేకుండా గ్రామదేవతల గుడివరకూ కేవలం మహిళలే మోసుకెళతారు. ఇలా బోనాలను తీసుకెళ్లే ఆడవారిని దేవతా ప్రతీకలుగా భావిస్తారు.

గ్రామదేవతలపై గల భయభక్తులకు తోడు మొక్కులు ఫలిస్తుండడంతో కాలక్రమంగా ప్రజలు తమ సంతానానికి వారి పేర్లు పెట్టుకోవడం మొదలైంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, బీరమ్మ అనేవి స్త్రీల పేర్లయితే ఎల్లయ్య, మైసయ్య, పోచయ్య, బీరయ్య అనేవి పురుషుల పేర్లు. ఇలా కూడా తమ దేవతలకు గ్రామీణులు మరింత దగ్గరయ్యారు. ప్రజలు తాము నివసించే చోటనే ఉన్నంతలో చిన్న గుడి కట్టుకొని దేవతారాధన చేయడానికి అలవాటు పడ్డారు. మొదట్లో ఊరవతల, ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, గుడి గోపురాలు లేకుండా, రూపం లేని కొయ్యబొమ్మ, బండల ఆకారాలలోనే అమ్మవార్లు భక్తులతో పూజలు అందుకొనే వారు. తర్వాత్తర్వాత పలు ఆకారాలను సంతరించుకొన్నాయి. బియ్యం, పసుపు, కుంకుమలు, వేపాకులే వీరికి పూజా సామగ్రి. ఇంతకు మించి పెద్ద పెద్ద ఆరాధనలు, అర్చనలు, వాటికయ్యే వ్యయాలు వంటివేవీ వుండవు.

జానపద సాహిత్యంలో గ్రామదేవతల కథలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మైసమ్మ మహిష దేవత. పశుసంపదను కాపాడే అమ్మవారుగా ఈమె పేరు పడింది. పశువుల పాకలోనే ఒక గూడుకు తెల్ల సున్నం వేసి కుంకుమతో అలంకరించి, దానిని మైసమ్మ గూడు (నిలయం)గా పిలుచుకొంటారు. చెరువు కట్టమీద ఒక బండరూపంలో నిలిపిన అమ్మవారును నీటి దేవత లేదా కట్ట మైసమ్మగా కొలుస్తారు. అప్పట్లో రాజులు, సంస్థానాల కాలంలో కోట పక్కన కొలువుండే అమ్మవారును కోట మైసమ్మగా, గడిలో పూజలు అందుకొనే తల్లిని గడి మైసమ్మగా పిలువడం పరిపాటి అయ్యింది. పశువులకు రోగాలు వచ్చినపుడు మైసమ్మ ఉత్సవాలు జరుపుకోవడమూ ఆనవాయితీగా వస్తున్నది.


ఎల్లరను బ్రోచే అమ్మ కనుక సదరు దేవత ఎల్లమ్మ అయ్యింది. ఆమెకు మాహూరమ్మ, అక్కలదేవి, రేణుకాదేవి, ఏకవీర వంటి పేర్లున్నాయి. బైండ్ల వారు జమిడికలను వాయిస్తూ ఎల్లమ్మ కథలు చెబుతారు. ప్రసిద్ధ నాటకగ్రంథం క్రీడాభిరామం (రచయిత: శ్రీనాథుడు/ వినుకొండ వల్లభరాయుడు)లో కాకతమ్మకు పైదోడు ఏకవీర అనే వర్ణన ఉన్నట్టు, ఆ దేవతనే రేణుక అని తెలుస్తున్నది. తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు కొడుకు పరశురాముడు తల్లి రేణుక శిరసును నరికిన కథ ఒకటి ఇందులో చదువుతాం. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మాహుర్ అనే ఊర్లో ఈ అమ్మవారు (రేణుక) నెలకొనడం వల్ల ఆమెకు మాహూరమ్మ అనే పేరు వచ్చినట్లు తెలుస్తున్నది. రేణుక గౌడులను, వారి జీవనాధారమైన తాటి వనాన్ని రక్షిస్తుంది. కనుకనే, వారు ఆ అమ్మవారును తమ కులదేవతగా భావించి, పండుగ చేసుకొంటారు.

ఊరి ప్రజలు పోచమ్మ దేవతను మశూచి వ్యాధిని నిర్మూలించే దేవతా శక్తిగా కొలుస్తారు. ఈ అంటువ్యాధికి శాస్త్రీయ కారణమేదైనా, పిల్లలకు, యుక్తవయసు వారికి ఇది ప్రబలినపుడు ఆ దేవతకు ఇంటినుండి కల్లు పోయిస్తమని వారు మొక్కుకుంటారు. మశూచి సోకితే పోచమ్మే కాపాడాలి అని వేడుకొంటారు. దీనికి ఆధునిక ఔషధాలు వాడక వేపాకులను పై పూతగా వాడితే పోచమ్మ తల్లి దయతో కొన్నాళ్లకు తగ్గిపోతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. ఇదే క్రమంలో పిల్లలను కాపాడే దేవతగా బాలమ్మను కొలుస్తారు. చాలామంది ఇండ్లలో జరిగే పెండ్లికి ముందు రోజు, కాబోయే వధూవరులతో పోచమ్మకు బోనాలతో వెళ్లి అర్చించడమో లేదా మొక్కులు ఇప్పించడమో అనేకమందికి వంశాచారంగా వస్తున్నది. దీన్ని పోచమ్మకు చేసుకొనుడుగా వ్యవహరిస్తారు. ఇక, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిపే బోనాల పండుగ ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుప్రసిద్ధమైంది. ఇలాంటి గ్రామదేవతల పండుగలకు హైదరాబాద్ తదితర ప్రాంతాలలోని ప్రముఖ అమ్మవార్ల దేవాలయాలు, పెద్దమ్మ గుడి ప్రధాన స్థావరాలుగా ఉంటున్నాయి.

పోచమ్మను వేయికండ్ల దేవత అంటారు. బద్ది పోచమ్మ, నల్ల పోచమ్మ, అంబడి పోచమ్మ పేర్లతో ముగ్గురు అమ్మవార్లు వున్నారు. వీరిలో నల్ల పోచమ్మను దుష్టుల పాలిట భయంకర శక్తిగా చెప్తారు. గ్రామదేవతలు ఎక్కడ, ఏ రూపంలో కొలువైనా వారంతా సాక్షాత్ జగదాంబ, ఆదిపరాశక్తికి ప్రతిరూపాలుగానే భావించాలని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం, ప్రత్యేకించి తెలంగాణలో పోచమ్మకు చేసుకొనే వేళ ప్రతీ కుటుంబంలో సభ్యులందరూ ఎక్కడున్నా ఒక్కచోటుకు వచ్చి జరుపుకోవడం విశేషం. ఇలా అందరినీ ఒక్కచోటుకు చేరుస్తున్న పండుగగాను బోనాలు వేడుకలను చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ నెల్లాళ్లూ ఊళ్లు, వాడలూ ఒక్కటైనట్లుగా, అమ్మవారి గుడిదాక మహిళామణులు తలపై పవిత్ర పాత్రలతో ఊరేగింపుగా వెళ్ళే దృశ్యం అపురూపం.

సంరక్షకుడు పోతురాజు!
ఒకనాటి మాతృస్వామిక సమాజంలో గ్రామదేవతలు పూజలు అందుకొనే విధానం చాలా సహజంగా ఉండేది. పోచమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ అనే ఈ ఏడుగురు (అక్కచెల్లెళ్లు) ప్రధాన గ్రామదేవతలు కాగా, వీరికి ప్రతీకలుగా మరెందరో అమ్మవార్లూ ఉన్నారు. పోతురాజును వీరందరి ప్రతినిధిగా, ప్రజల సంరక్షకుడుగా తలుస్తారు. గ్రామంలోని బొడ్రాయిని ఈయన రూపంగానే కొలుస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఊరిని కాపాడతాడనీ నమ్ముతారు. కాకతీయుల కాలంలో ప్రతి గడిలోను కనిపించే సప్తమాతృకలు గ్రామదేవతలకు ప్రతిరూపాలేనని చరిత్రకారులు చెప్తారు.

వారి కాలంలోనే వీరికి ప్రత్యేక పూజలు, రూపాలు వచ్చినట్లు తెలుస్తున్నది. అంతకు ముందు కాలంలో గ్రామదేవతలకు ప్రత్యేకమైన గుళ్లు లేవు. చెట్లకింద, చెరువులు, పొలాల గట్లమీద వారికి చిన్న గుళ్లు ఏర్పరిచే వారు. రెండుపక్కల రెండు రాళ్లు పెట్టి, పైన మరొక రాయి కప్పులాగా ఉంచి, దాన్నే గుడిలా భావించారు. పలు పేర్లతో పిలిచే గ్రామదేవతలకు మొదట్లో ప్రత్యేక ఆకారాలు, విగ్రహాలూ ఉండేవి కావు. ఇప్పుడు పట్టణాలు, నగరాలలోనూ ఈ దేవతలు అద్భుత రూపురేఖలతో వెలియడమేకాక ఇతర హైందవ దేవాలయాలతో పోటీ పడుతూ అక్కడి అమ్మవార్లు పూజలు, పురస్కారాలు అందుకొంటుండడం విశేషం.


-డా॥ బి.వి.ఎన్.స్వామి, సెల్: 92478 17732


logo