శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 19, 2020 , 01:53:07

త్రివిధ సేవలకు దాసోహి!

త్రివిధ సేవలకు దాసోహి!

‘నడిచే దేవుడు’, కర్ణాటకకు చెందిన గొప్ప యోగిపుంగవుడు శివకుమార స్వామీజీ శివైక్యం చెంది (వర్థంతి: 21వ తేది) ఏడాది పూర్తవుతున్న వేళ వారి జీవనతత్వాన్ని తెలిపే చిన్న ప్రస్తావన.

మనుషులలోనే దేవుణ్ణి చూడాలన్నది శివకుమార స్వామీజీ తాత్వికత. ఆయన ఎంత నిఖార్సయిన మనిషో అంతే నిబద్ధతతో యోగసాధనలో నిమగ్నమైన ఈ కాలపు ఆధాత్మిక తపస్వి. ‘తోటివారికి తోచినంత సహాయం చేయాలన్నది’ ఆయన నైజం. మనిషి తన కడుపు నిండిన తర్వాతైనా ఎదుటివారి ఆకలి తీర్చాలన్నది వారి సిద్ధాంతం. ఆకలి, చదువు, ఆరోగ్యం ఈ మూడు (త్రివిధ దాసోహం) ప్రతి ఒక్కరికీ అందాలన్నదే ఆయన నిరంతర తపన. అందుకే, తాను ఒకపక్క తన అరచేతిలో దేవుణ్ణి (శివలింగం) ఆరాధిస్తూనే, మరోవైపు వేలాదిమంది ప్రజలను గుండెలకు హత్తుకొన్నారు.


ధనార్జన, స్వార్థం, అనవసర ప్రచారాలు, ఆర్భాటపు కీర్తి ప్రతిష్ఠలకే ఎక్కువమంది ప్రాధాన్యమిస్తున్న ఈ కాలంలో ఇలాంటి నిజమైన మానవతా మూర్తి కర్ణాటక ప్రజలకు లభించడం అదృష్టమే. ఆచరణాత్మకం కాని, అభూతకల్పనలతో కూడిన ఉద్బోధలు కాకుండా దేనినైతే తాను సత్యమని నమ్మారో దానినే స్ఫూర్తిగా ఆచరించి చూపడంలో శివకుమార స్వామీజీ సంపూర్ణ విజయం సాధించారు. మానవసేవలోనే గొప్ప దేవతారాధన దాగి ఉన్నదన్న సందేశాన్ని తన సమస్త జీవితాంతం ఆచరణాత్మకంగా చూపిన మన భారతదేశానికి చెందిన అతికొద్దిమంది మహానుభావులలో వారొకరు. ‘నడిచే దేవుడు’గా సుప్రసిద్ధుడైన ఆయన తన కోసం, మఠసందర్శనకు వచ్చేవారిలోనే అసలైన శివుణ్ణి దర్శించారు.

శివకుమార స్వామీజీని, వారి జీవితాన్ని దగ్గరినుంచి చూసిన వారు ఆయనలో నిజంగానే దేవుణ్ణి చూశారు. సుమారు 8 దశాబ్దాలపాటు ఆ రాష్ట్రంలోని లింగాయత్‌ సంప్రదాయానికి చెందిన శ్రీ సిద్ధగంగ మఠానికి పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించి కిందటేడాది (2019) జనవరి 21న వారు శివైక్యం చెందారు. అప్పుడాయన వయసు 111 సంవత్సరాలు. 1907లో తన తల్లిదండ్రులకు 13వ సంతానంగా జన్మించిన శివణ్ణ (పూర్వనామం) 23 ఏండ్ల వయసు (1930)లోనే మఠాన్ని ఆశ్రయించి, సన్యాస జీవితం ప్రారంభించారు. 1941లో వారి గురుదేవులు ఉద్ధానశివయోగి శివైక్యం తర్వాత పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నించీ విరామమెరుగని సేవలోనే తరించారాయన.

బెంగళూరుకు కేవలం 66 కి.మీ.దూరంలోని శ్రీ సిద్ధగంగ మఠం మానవీయతకు పెట్టింది పేరు. వెళ్లే ప్రతీ ఒక్కరికీ అక్కడ లేదనకుండా కడుపునిండా భోజనం లభిస్తుంది. 1951లో శ్రీ సిద్ధగంగ ఎడ్యుకేషనల్‌ ట్రస్టును స్థాపించిన స్వామీజీ తన హయాంలోనే 130కి పైగా విద్యాలయాలను నెలకొల్పడం విశేషం. అన్నదానంతోపాటు విద్యాదానంలోని విశిష్ఠ లక్షణాన్ని, గొప్పతనాన్ని ఆ రకంగా ప్రపంచానికి తెలియచెప్పారు. ‘అన్నం-అక్షరం-ఆరోగ్యం’ ఈ ‘త్రివిధ దాసోహాన్ని’ తాను నమ్మి, త్రికరణ శుద్ధిగా ఆచరించిన నిష్ఠాగరిష్ఠుడాయన. మొదట్లో మఠం కోసం తానే స్వయంగా ఇల్లిల్లూ తిరిగి విరాళాలు అర్థించే వారని ఆయన భక్తులు చెబుతుంటారు. వారిలోని నిజాయితీ, ప్రేమ, దయ, భక్తి, యోగసాధనలే ఎందరినో ఆయన దారిలోకి వచ్చేలా చేశాయి. ఆ రకంగా ఆయన తన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే కాక దేశానికే గర్వకారణమయ్యారు.
-దోర్బల బాలశేఖరశర్మ

తాజావార్తలు


logo