శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 19, 2020 , 01:50:01

అందరూ పూజ్యనీయులే!

అందరూ పూజ్యనీయులే!

మన హైందవ మతంలో అనేకమంది దేవవతలున్నారు. ఇందరు దేవతలలో ఎవరిని పూజించాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరినైనా పూజించవచ్చా? లేక, అందరినీ తప్పకుండా పూజించాలా? ఏ ఒకరినో పూజించినంత మాత్రాన పరమాత్మ అనుగ్రహం సిద్ధిస్తుందా?
-ఆర్‌. సూర్యతేజ, గజ్వేలు

నిజమే. మన హిందూమతంలో అనేకమంది దేవతలున్నారు. ఇందరిలో ఎవరిని పూజించాలి? అన్న సందేహం సహజంగానే చాలామందికి వస్తుంది. దీనికి ‘భగవద్గీత’లోనే శ్రీకృష్ణ పరమాత్మ చక్కని తరుణోపాయం చూపించాడు. ‘యో యో యాం యాం తనుం భక్త: శ్రద్ధయార్చి తుమిచ్ఛతి / తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్‌ ॥ (భగవద్గీత 21-7). మనకు 33 కోట్లమంది దేవతలున్నారు. వారిలో త్రిమూర్తులు అధిదేవతలు. ఇంకా త్రిమాతలు, శక్తి దేవతలు, అవతారమూర్తులూ ఉన్నారు. ఈ దేవతలందరినీ ఆయా సమయ సందర్భాలనుబట్టి చక్కగా పూజించవచ్చు. లేదా మనకు నచ్చిన, ఇష్టదైవాన్ని ఎవరో ఒకరినైనా పూజించవచ్చు. ప్రతీ దేవతా, దేవుడూ ఆరాధ్యనీయుడే. ఆ మాటకొస్తే అద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రతీ చోట, ప్రతీ ప్రాణిలోనూ పరమాత్మ అంశలు ఉన్నది.


మనం తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు, బంధువర్గం ఎందరినో ఆదరిస్తుంటాం, గౌరవిస్తుంటాం, ప్రేమిస్తుంటాం. అలాగే, అందరు దేవతల పట్ల కూడా మనదైన నిండు భక్తిని, ఆరాధనా భావాన్ని చూపించాలి. కాకపోతే, శ్రద్ధ, లక్ష్యశుద్ధి, భగవంతునిపట్ల పూర్తి నమ్మకం తప్పనిసరి. ఎంత అట్టహాసంగా, ఆర్భాటంగా పూజ చేస్తున్నామన్నదానికన్నా ఎంత చిత్తశుద్ధితో ఉన్నామన్నది ముఖ్యం. ఏ మాత్రం పరధ్యాస పనికిరాదు. పూజా సమయంలో కూర్చున్న ఆ కొద్దిసేపు మన మనసు చెదిరిపోకుండా నిగ్రహ పరచుకోవాలి. మనం ఏవో ప్రాణం లేని విగ్రహాలను పూజిస్తున్నామని ఎంతమాత్రం అనుకోకూడదు. అవి మామూలు శిలలు, చిత్రపటాలే అయినా, ఇంకా అర్చనామూర్తులే అయినా ప్రతి దానిలోనూ దేవుణ్ణి తలపోయాలి. ఈ విధంగా మనసు పెట్టి, పవిత్రమైన, నిర్మలమైన భక్తితో ప్రార్థనలు చేయాలి. అప్పుడు కంటికి కనిపించని పరమాత్మే తప్పక ఏదో రూపంలో మనకు కావలసినవి, ఇవ్వవలసినవి తప్పక అనుగ్రహిస్తాడని ధర్మశాస్ర్తాలూ చెబుతున్నాయి.
-సావధానశర్మ

తాజావార్తలు


logo