శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 12, 2020 , 00:39:18

వివేక మహోదయం!ఎప్పుడు? ఎలా??

వివేక మహోదయం!ఎప్పుడు? ఎలా??

‘సర్వమతాల పరమార్థం ఒక్కటే. అదే మానవధర్మం. మనలోని సహజ సిద్ధమైన దివ్యశక్తిని తట్టి లేపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం. అద్భుత ప్రపంచాన్ని నిర్మిద్దాం. రండి!’ ఒక మహాపురుషుడు 127 ఏండ్ల క్రితం (క్రీ.శ.1893) ఆకాశతలం (అమెరికా)పై నిలబడి ప్రపంచమంతా వినిపించేలా ఎలుగెత్తి పిలిచిన పిలుపు ఇది. దిగ్దగంతాలలో అదిప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. శ్రీకృష్ణుడు ‘శ్రీమద్భగవద్గీత’ను సాక్షాత్కరింప జేసినంత స్పష్టంగానే అదే తీరుగా, అంతే మహోత్తేజంతో, ‘భగవంతుడి’ నిజ తత్వాన్ని దర్శింపజేసిన ఆ విశ్వవిజేత ఎవరోకాదు, స్వామి వివేకానంద. నూనూగు మీసాలైనా రాని కౌమారవయసులోనే అతి సంక్లిష్టమైన దైవాన్వేషణకు శ్రీకారం చుట్టి, అద్భుత ఆధ్యాత్మిక యోగిపుంగవులు రామకృష్ణ పరమహంస మనసును అనితర స్థాయిలో గెలుచుకొని, సన్యాసం స్వీకరించి, భారతీయ వేద విజ్ఞానంలోని అర్థపరమార్థాలను జీర్ణించుకొని, ఆ అమృతానందాన్ని తానొక్కడే సేవించకుండా కులమతాలకు అతీతంగా మానవులందరికీ పంచిపెట్టిన అవతారమూర్తి స్వామి వివేకానంద. భగవద్గీత, ఉపనిషత్తులను చిలికి చిలికి ఆదిశంకరుల వారు అద్వైతామృతాన్ని అందిస్తే, దానిలోని జీవనమాధుర్యాన్ని సామాన్యులకు చేరవేసిన ఘనత వీరిదే.

  • -నేడు స్వామి వివేకానంద 157వ జయంతి, 35వ ‘జాతీయ యువజన దినోత్సవం’.
  • -ప్రతీ భారతీయుడి గుండెను సగర్వంగా ఉప్పొంగించే వేళావిశేషమిది.
  • -అద్వైతసారాన్ని అత్యంత సరళంగా అందించిన అతిగొప్పయోగి స్వామి వివేకానంద.

‘సోదర సోదరీమణులారా..’ (Sisters and brothers of America ...) అన్న ఒకేఒక్క ఆత్మీయ సంబోధన వేలాదిమంది ప్రపంచ మేధావులు, అమెరికన్‌ వాసుల మనసులను ఎలా వశం చేసిందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. స్వామి వివేకానంద హృదయ వైశాల్యం, ప్రతిభాసంపత్తి ఎంత విలువైనవో అర్థమవుతాయి. అన్ని మతాలవారినీ, మొత్తంగా సమస్త మానవులను తన వాళ్లుగా ప్రేమించిన ఈ ఆత్మీయ పలుకులకు పడిపోని వారుంటారా! అంతటి సభ మూకుమ్మడిగా జేజేలు పలికిన విధం అమోఘం. సభలో ఆసీనులైన వేలాదిమంది ఒక్కమారుగా లేచి నిలబడి, ఆపకుండా కొద్ది సెకన్ల పాటు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. అప్పటి వరకు ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌...’ అన్న లాంఛన మాటలతో ఉపన్యాసాలు ప్రారంభించే పద్ధతికి అలవాటు పడిన వారంతా ఈ సోదరభావానికి పులకితులయ్యారు. మన స్వామి వివేకానంద గొప్పతనానికి ఆ అతిపెద్ద అంతర్జాతీయ వేదిక ఇచ్చిన అరుదైన గౌరవమది.

ఆదిశంకరులు ఎలాగైతే నడివయసులోనే అద్బుతాలు సాధించారో స్వామి వివేకానందకూడా వారిని గుర్తుకు తెచ్చేలా పరమోన్నత సందేశాన్నే ఇచ్చారు. ఒక సామాన్యుడిగానే, విమర్శకుడిగానే, హేతువాద మనసుతోనే అనేక సందేహాలతో ‘దైవాన్వేషణ’ను మొదలుపెట్టి అనిర్వచనీయ రీతిలో అన్నింటినీ నివృత్తి చేసుకొని అసాధారణ స్థాయిలో ‘దైవదర్శనం’ చేసుకొన్నారు. ‘నేను దేవుణ్ణి చూశాను. మీకూ చూపిస్తాను రండి!’ అని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచారు. ఆయన స్ఫూర్తిని అందుకొన్న వారు అదృష్టవంతులైతే, దానికి నోచుకోని వారు ఇంకా ఎందరో. అందుకే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లవుతున్నా, ఎందరో జాతీయోద్యమ స్వాతంత్య్ర సమరయోధులు, యోగులు తపించిన ఆదర్శ పౌరసమాజం కోసం అత్యధికులైన భారతీయులు కలలు కంటూనే ఉన్నారు.

వైదిక వ్యవస్థను ఒక మతంగాకాక ఓ మానవధర్మంగానే చూడాలన్న సత్యాన్ని స్వామి వివేకానంద ఆవిష్కరించిన విధానం ఇతర మతస్థులకు సైతం ఆదర్శప్రాయమైంది. తోటి మతాలలోని మానవీయ కోణాలనూ ఆయన సంపూర్ణంగా అవగతం చేసుకొన్నారు కనుకే, భారతీయ ధర్మమే సమున్నతమైందిగా ఎలుగెత్తి చాటారు. ఆ తర్వాతే ‘ప్రపంచ సర్వమత సమ్మేళన యాత్ర’ (అమెరికా)కు గురుదేవుల ఆశీస్సులతోనే శ్రీకారం చుట్టారు. అక్కడ భారతీయ సనాతన ధర్మాన్ని, వేదాంతతత్వాన్ని ప్రపంచ మేధావులకు విడమరిచి చెప్పడమేకాక ‘సర్వమానవ సౌభ్రాతృత్వం’పై ధార్మిక జీవన మొలకను నాటారు.

భారతీయ వైదికంలోకి మతమార్పిడి కోసం ముందుకు వచ్చిన అనేకమంది హైందవేతరులకు సున్నితంగా ‘జ్ఞానోదయం’ కలిగించిన గొప్పమనసు స్వామి వివేకానంద వారిది. ఆనాడు (1893 సెప్టెంబర్‌ 11-16 మధ్య) ‘ప్రపంచ సర్వమత సమ్మేళనం’ (Parliament of the Worlds Religions) లో వారు ప్రవేశపెట్టిన ‘సనాతన భారతీయ ధర్మచింతన’ ప్రసంగాన్ని అమెరికాలోని (అప్పటి) మీడియా ఎంత గొప్పగా తలకెత్తుకున్నదో.. అంతేస్థాయిలో ప్రపంచం వారిని ఆదరించింది. అప్పుడు మొదలైన ఆయన ధార్మిక ప్రయాణం అమెరికానుంచి ఇంగ్లాండ్‌, జపాన్‌, చైనాల వరకూ సాగింది. అలా మన వేదవిజ్ఞానానికి ఎనలేని ఆదరణ, ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా లభించాయి.

‘మీరు దేవుణ్ణి చూశారా?’. ఈ ప్రశ్నను నరేంద్రుడు ఏకంగా మహాయోగి రామకృష్ణ పరమహంసనే అడిగారు. దీనికి వారి స్పందన విలక్షణం. ‘చూశాను. నిన్ను ఎలా చూస్తున్నానో, భగవంతుడినీ నేను అలాగే చూశాను’. నరేంద్రుని ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. ‘భగవంతుణ్ణి తనకూ చూపించాలని’ రామకృష్ణులను అడిగారు. వారు వెనుకడుగు వేయలేదు. ‘అలాగే చూపిస్తాను’ అంటూ తన ‘జ్ఞానధార’ను కురిపించారు. ‘స్వామి వివేకానంద జీవన్ముక్తులేనా?’ అన్న సందేహం ఎవరికైనా కలిగితే అది పూర్తిగా వారి అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ‘అసలు, దేవుడు ఎలా ఉంటాడు? ఏది ఆధ్యాత్మికత? ఎవరు నిజమైన శ్రేష్ఠమానవులు?’ ఇటువంటి ఎన్నో మౌలిక సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

జ్ఞానానికి భక్తి తోడైనప్పుడే ముక్తి సాధ్యమవుతుంది. అది జీవన్ముక్తి అయినా, మోక్షప్రాప్తి అయినా. కర్మ, రాజయోగాలు కలిస్తే అది పరిపూర్ణమవుతుంది. అప్పుడు లభించేదే పరమోన్నత ఆనందం. పూజ్య గురుదేవులు రామకృష్ణ పరమహంస ‘బ్రహ్మానంద జ్యోతి’ని వెలిగిస్తే, వారి ప్రియశిష్యుడిగా స్వామి వివేకానంద ఆ కాంతికిరణాలను విశ్వవ్యాప్తం చేశారు. అదొక మహోదయం. ఆ వెలుగులో ఎందరో మేల్కొన్నారు. ఇంకా మేల్కోని వాళ్లు లేకపోలేదు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. స్వామి వివేకానంద జయంతి (జనవరి 12)ని కేవలం మన దేశ ‘జాతీయ యువజన దినోత్సవం’గా మాత్రమే చూస్తే, అది పాక్షిక దృక్పథమే అవుతుంది. కారణం, వారి ఆధ్యాత్మిక కోణంలోనే అసలైన అద్భుతాలు దాగి వున్నాయి. అటు వివేకాన్ని (Intelligence), ఇటు ఆనందాన్ని జతగా మేళవింపజేసి, తన పేరును సార్థక పరుస్తూ, ఇంతటి శిఖరాయమాన కృషి సల్పిన యోగిపుంగవులు ఆధునిక భారతావనిలో మరొకరు లేరు. శ్రీకృష్ణుడు, ఆదిశంకరుల వలె మానవాళికి వేదజ్ఞాన సాధనకు అతిసులభతరమైన మార్గాలను చూపిన మహానుభావుడాయన. ఆ స్ఫూర్తిని అందుకోవడమే మన పని.

భగవంతుణ్ణి చూద్దామా?

భగవంతుణ్ణి చూడడం అంత తేలికా? అసలు, అది స్వామి వివేకానందకు ఎలా సాధ్యమైంది? అంతటి భరోసా, శక్తియుక్తులు ఆయకెలా సిద్ధించాయి? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. దేవుణ్ని ముందు తాను దర్శించాకే ప్రజానీకానికి దర్శింపజేయడానికి స్వామి వివేకానంద ఉద్యుక్తులైనారు. నరేంద్రనాథ్‌ దత్త / నరేన్‌ (పూర్వనామం) ‘స్వామి వివేకానంద’గా మారకముందు, మారిన తర్వాత జరిగిన కీలక ఘట్టాలు ఆ సాధనకోసం ఆయన పడిన తపన, కృషి, త్యాగనిరతి, నిబద్ధతను వెల్లడిస్తాయి. ‘మీరు దేవుణ్ణి చూశారా?’ అని ఆయన అనేకమంది ఆధ్యాత్మిక సాధకులను మొదట్లో అడిగేవారు. దానికి సంతృప్తికరమైన సమాధానం ఎవరూ ఇవ్వలేదు. ‘నువు పిల్లవాడివి. అప్పుడే నీకు తెలియదు’ అని తేలిగ్గా తీసుకొన్నారు. ‘యోగదృష్టి వున్నవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు’ అని బ్రహ్మసమాజ్‌ నాయకుడైన దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ వివరించే ప్రయత్నం చేశారు. అదీ తనకు రుచించలేదు. ఆయనలోని ఈ దైవాన్వేషణ ఇంతటితో ఆగలేదు. అప్పుడే మహాయోగి రామకృష్ణ పరమహంస శిష్యరికం ఆయనకు దేవుణ్ణి చూపించింది.

-దోర్బల బాలశేఖరశర్మ


logo