సోమవారం 06 ఏప్రిల్ 2020
Devotional - Jan 08, 2020 , 16:16:42

మహా పుణ్యకాలానికి స్వాగతం చెబుదాం..మహిమాన్విత మాసం!

మహా పుణ్యకాలానికి స్వాగతం చెబుదాం..మహిమాన్విత మాసం!

ఏటా వచ్చే ధనుర్మాసం ప్రత్యేకత, గొప్పతనం, పవిత్రత తెలిస్తే మనలో చాలామందికి ఆశ్చర్యమేస్తుంది. ‘ఇంత మహిమాన్వితమైన మాసాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామా’ అనిపిస్తుంది. మహా పుణ్యకాలంగా భావించే ఈ ముప్పయి రోజుల ప్రాధాన్యాన్ని తెలిపే ప్రస్తావన ఇది.

సూర్యుని ఆధారంగా (సౌరమానం) సంభవించే 12 రాశుల సంక్రమణ కాలానికి భారతీయ ప్రాచీన ఋషులు ఏర్పరిచిన పవిత్రత మానవాళి భక్తిమార్గానికి మార్గదర్శకమైంది. సూర్యభగవానుడు వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశుల్లోకి వచ్చినప్పుడు ఆ సంక్రమణ కాలాన్ని ‘విష్ణుపద పుణ్యకాలం’గా భావిస్తే, మిథున, కన్య, ధనుస్సు, మీన రాశుల సంక్రమణ సమయాన్ని ‘షడశీతి పుణ్యకాలమ’ని అంటారు. అలాగే, మేష, తుల రాశుల్లోకి వచ్చినప్పుడు ‘విషువత్తు’గా, కర్కాటక, మకరం రాశుల్లోకి ప్రవేశిస్తే ‘దక్షిణ- ఉత్తర ఆయనాలు’గా వ్యవహరిస్తారు. ధనుస్సు తర్వాత వచ్చేదే మకరం. ఇది అదివరకటి కర్కాటక (దక్షిణాయనం) రాశి తదనంతర ఆయనానికి తలుపులు తెరుస్తుంది. అదే ఉత్తరాయన పుణ్యకాలం. ధనూరాశిలో సూర్యుడు ఉండగా, ‘షడశీతి పుణ్యకాలం’ కొనసాగే నెలరోజులనే ‘ధనుర్మాసం’ అంటారు.

సంవత్సరంలో వచ్చే రెండు ఆయనాలు (సూర్యుని ప్రయాణాలు) దేవతాలోకంలో దేవతలకు ‘ఒక పగలు- ఒక రాత్రి’గా చెప్తారు. దక్షిణాయనం (దక్షిణం వైపు సూర్యుని యానం) రాత్రి అయితే, ధనుర్మాసంతో అది ముగిసి, ఉత్తరాయనం (ఉత్తరం వైపు సూర్యుని యానం)లోకి ప్రవేశిస్తుంది. కాబట్టే, ఈ నెల్లాళ్లు దేవతలకు బ్రాహ్మీముహూర్తంగా భావిస్తారు. ఈ కారణంగానే దీనికింతటి ప్రాధాన్యం సంతరించుకున్నది. ధనుర్మాసంలో జరిపే పుణ్యకార్యాలన్నీ ఒక ఎత్తయితే, నెలరోజుల పాటు శ్రీమహావిష్ణువు సేవతో చేసే వ్రతమొక్కటి మరొక ఎత్తు. ఇదే సమయంలో వచ్చే ‘ముక్కోటి ఏకాదశి’ విశిష్ఠత అందరికీ తెలిసిందే. శ్రీహరి పాలకడలిలో యోగనిద్ర చాలించి ఉత్తరద్వారం గుండా ఇదే రోజు దర్శనమిస్తాడని ప్రతీతి. దేవతలతోపాటు మానవులకూ ఇది మోక్షదాయకం.

‘మార్గశిర మాసం’ అంటేనే సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపకాలం. సాధారణంగా ఈ నెలలోనే ‘ధనుర్మాసం’ మొదలవుతుంది. ఈ 30 రోజులూ శ్రద్ధగా శ్రీమన్నారాయణునికి చేసే పూజలతో అనంత పుణ్యం లభిస్తుందని ప్రామాణిక భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి. ధనుర్మాసమన్ని రోజులూ ఆచరించే ఈ వ్రతం వల్ల పన్నెండేండ్ల ఆరాధనా ఫలం లభిస్తుందనీ అంటారు. ఎన్నో యజ్ఞాల ఫలితంతోపాటు పితృదేవతలూ శాంతిస్తారని, భూప్రదక్షిణ చేసినంత పుణ్యమని కూడా చెప్తారు. ‘ధనుర్మాస వ్రతాన్ని’ త్రేతాయుగంలో భరతుడు, ద్వాపరలో గోపికలు (కాత్యాయిని వ్రతం) చేసి విశేష ఫలాన్ని పొందినట్లుగానే, ఈ కలియుగంలో 1,244 సంవత్సరాల కిందట, తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ‘తిరుప్పావై’ (సిరినోము) పేరున ఆచరించిన ఈ వ్రతంతో ఏకంగా శ్రీరంగనాథుని దివ్యసన్నిధిని పొందినట్లు చరిత్ర చెబుతున్నది. ఆమె ఆలపించిన అద్భుతమైన పాశురాలనే ఇలవైకుంఠపురమైన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామికి ఈ నెల్లాళ్లూ సుప్రభాతంగా ఆలపించడం మరొక విశేషం.


logo