శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 08, 2020 , 16:10:54

‘భాగవత సప్తాహం’ ముగిసిన సందర్భంగా..

‘భాగవత సప్తాహం’ ముగిసిన సందర్భంగా..

భక్తి ముక్తావళి! కుచేలుడు, పోతన, చాగంటి- ఈ ముగ్గురిలోనూ పరిపూర్ణ భక్తి పునాదిపై కనిపించే ‘ఏకతా సూత్రం’ ఒకటుంది. దీనిని తెలుసుకొన్న వారికి భాగవత పరమార్థం, మానవ జీవన సార్థకత రెండూ బోధపడుతాయి.

Prastavana
ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ‘భాగవత సప్తాహం’ మొన్నటి (శుక్రవారం)తో ముగిసింది. హైదరాబాద్‌లోని ‘తెలంగాణ కళాభారతి’ (ఎన్టీఆర్‌ స్టేడియం)లో వారం రోజులపాటు (14నుంచి 20వ తేది వరకు) నిరంతరంగా కొనసాగింది. సాయంత్రపు చలికి వెనుకాడకుండా వేలాదిమంది భాగవత మకరందాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా భాగవత పరమార్థాన్ని, చాగంటి వారి గొప్పతనాన్ని తెలిపే చిన్న ప్రస్తావన.


‘ఈ ఏడు రోజుల భాగవత సప్తాహం మనకేమిచ్చింది?’ అని ఆలోచిస్తే, ఎవరికైనా ఒక కీలకాంశం బోధపడుతుంది. అదే భాగవత పరమార్థమైన భక్తి! భాగవతమంటేనే భగవంతుని కథ కాబట్టి, భక్తునికి భగవంతునికి మధ్య ఉండవలసింది కూడా ‘ఇదేనని’ ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. భక్తి అంటే ఏదో పైపై ప్రేమ కాదు. ‘మనసా వాచా కర్మణా’ పరమాత్మనే ప్రగాఢంగా నమ్ముకోవడం. పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి నమ్మి కొలువడం. ‘మనసు, మాట, ఆచరణ’ మూడింటి మార్గం ఒక్కటైనప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది కూడా భగవంతుడు ఏదైతే మనకు ఉద్భోదించాడో దాని సాధన దిశగానే మన ఆధ్యాత్మిక గమనం ఉండాలి. చాలామంది మనసులో నమ్ముతూ, మాటల్లో చెబుతూ ఆచరణవద్దకు వచ్చేసరికి విఫలమవుతుంటారు. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడుతూ శాశ్వతానందాన్ని పట్టించుకోని వారే చాలామంది. ఈ ‘భాగవత సప్తాహం’ ముగింపు సభలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దీనినే ఉటంకించారు.

‘భౌతిక వాంఛలు, సుఖాలకు అతీతమైన పరిపూర్ణమైన, ఏకైక భక్తిని మాత్రమే కలిగి ఉండే సజ్జనులు నిజంగా ఉంటారా?’ అన్న అనుమానం కొందరికి కలుగవచ్చు. నిజమే, అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఈ కలికాలంలో అయితే, మరీ అత్యల్పం. కాగడా పెట్టి వెతికినా దొరుకుతారో లేదో తెలియదు. అలాంటి వారిలో మనమెందుకు ఉండకూడదు? అది మనలాంటి సామాన్యులకు అసాధ్యమా? పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చామని ఈ పైపై సుఖాలకోసం ఆరాటం? ఈ కోణంలో ఆలోచించగలిగితే ఎవరికైనా పరిపూర్ణ భక్తి చింతన తప్పక సాధ్యమవుతుంది.

అసలు భాగవతమంటేనే పరిపూర్ణ భక్తి మార్గాన్ని ప్రబోధించేది. భక్తియోగంతో పరమాత్మ సన్నిధిని చేరుకోవడానికి లభించిన ఒక అద్భుత దారి దీపమిది. ప్రజలలో భగవంతునిపట్ల ఈ ‘పరమోన్నత ప్రేమను’ రగించడం కోసం ఉద్భవించిందే ఈ మహత్‌ పురాణం. జ్ఞానయోగాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మే అదే తన ‘భగవద్గీత’లో భక్తియోగ సాధనను కూడా మనకు ప్రసాదించారు. దీనిని చేరుకొనే అత్యంత సరళతరమైన మార్గం భాగవతంలోనే ఉన్నది. పన్నెండు స్కంధాలలోని ప్రతీ కథలోనూ భక్తితో పరాసిద్ధిని పొందిన వారి జీవితాలు అంతర్లీనంగా మానవాళికి ఆదర్శప్రాయం. ఈ అనన్య సామాన్యమైన భక్తితో ఏదైనా (ఆఖరకు మోక్షాన్ని సైతం) పొందవచ్చునని భాగవతంలోని ప్రతీ సన్నివేశం అత్యంత వాస్తవికంగా నిరూపిస్తున్నది. పరీక్షిత్తు మహారాజు నుంచి మార్కండేయ మహర్షి వరకు ఎందరో దీనిని ఆచరించి చూపారు. అదే మనలాంటి సామాన్యులకందరికీ నిత్యపారాయణం.

ఈతరం వారికి అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ. కుచేలుడు, పోతన, చాగంటి- ఈ ముగ్గురిలోనూ పైన చెప్పిన పరిపూర్ణ భక్తి ఒక ‘ఏకతా సూత్రం’ వలె మనకు కనిపిస్తుంది. దానిని తెలుసుకుంటే, భాగవత పరమార్థంతోపాటు మావన జీవన సార్థకత రెండూ మనకు బోధపడుతాయి. అప్పుడు ‘సప్తాహం’లో పాల్గొన్న ఏడు రోజుల్లోనూ మనకు అర్థం కానిదేదైనా ఉంటే అదీ తెలిసివస్తుంది. కుచేలుడంటే భాగవతంలోనే శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. పోతన ఎవరో కాదు, మన తెలుగు భాగవత సృష్టికర్త. ఇక చాగంటి కోటేశ్వరరావు ప్రస్తుత గొప్ప ప్రవచనకర్త. ఇక్కడ ఈ ముగ్గురినీ కలిపింది ఇదే భాగవత గాథ, పరమాత్మపట్ల వారిలోని పునరంకితభావం. భగవంతునిపట్ల మనలోని ‘హృదయ సమర్పణ’ ఏ స్థాయిలో ఉండాలో కూడా దీనితో మనకు తెలుస్తుంది. ‘మనసా వాచా కర్మణా’ భక్తిని కలిగి ఉండడమంటే ఇదే మరి.

కుచేలుని వృత్తాంతంలో, పోతనామాత్యుడు భాగవతాన్ని శ్రీరామునికే అంకితం చేయడంలో ఎంతైతే స్వచ్ఛత ఉందో అంతటి అంశీభూత భక్తి పరంపరయే చాగంటి వారిలోనూ మనకు ఇప్పటికీ కనిపిస్తుంది. అందుకే, దేశప్రధాని అంతటి ఒక వ్యక్తి (పీవీ నరసింహారావు) ‘ఏమైనా కోరుకొమ్మని’ అడిగితే, ‘పరమాత్మ అనుగ్రహ మొక్కటి చాలు’ అని అనగలిగారాయన. కుచేలుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని నోరు తెరిచి ఏమీ అడుగలేదు. పోతన తన భాగవతాన్ని శ్రీనాథుని కోర్కె మేరకు ఏ రాజుకో అంకితమీయనూ లేదు. వారిలోని అనన్యసామాన్యమైన భగవత్‌భక్తే వారికి ఈ యోగసిద్ధిని ప్రసాదించాయి.

నిజమైన భక్తులు భగవత్‌ తత్వం (భాగవతం)లోని ఈ సారాన్ని గ్రహిస్తారు. వారు ఆ మేరకు నిర్మలంగా, నిజాయితీగా, భౌతిక సుఖాలకు అతీతంగా, ఇంకా.. ఎంత సామాన్యంగా సాధ్యమైతే అంత సగటుగానే జీవించచూస్తారు. ఈ కాలంలో అయినా, మరే కాలంలో అయినా, మనిషి కడుపుకు, చిన్ని సంసారనావను నడపడానికి, ఏవో కొన్ని కుటుంబ బాధ్యతల నుండి గట్టెక్కడానికి ‘ఎంత’ (సిరి) కావాలి? ‘లక్షాధికారైన లవణమన్నమే కాని/ మెరుగు బంగారంబు మింగబోడు’ (శ్రీ నరసింహ శతకంలోని ‘తల్లిగర్భము నుండి ధనము తేడెవ్వడు’ పద్యభాగం) ఎంత అక్షరసత్యమో కదా. భౌతిక సుఖాన్ని మించిన పారమార్థిక పరమపద సోపాన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారికి ఇక వేటితోనూ పనుండదు.
-దోర్బల బాలశేఖరశర్మ


logo