శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 08, 2020 , 15:59:41

‘భాగవత సప్తాహం’ సందర్భంగా..భగవంతుని లీలా రహస్యం

‘భాగవత సప్తాహం’ సందర్భంగా..భగవంతుని లీలా రహస్యం

శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం, శ్రీకృష్ణ భగవానుని ప్రబోధాత్మక సందేశం ‘భగవద్గీత’ అవతరించిన నెల మార్గశిరంలో జంటనగర ప్రజలకు భగవంతుని లీలా రహస్యాలను, భాగవతంలోని మౌలిక తత్వాన్ని తెలుసుకొనే అపురూప అవకాశం తాజాగా లభించింది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు వినిపించే ‘భాగవత సప్తాహం’ లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఇందిరాపార్క్‌ సమీపంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌ స్టేడియం)లో నిన్నటి (శనివారం: 14వ తేది) నుంచి ఉత్సాహభరితంగా, ఘనంగా ప్రారంభమైంది. నేడు రెండవ రోజు కాగా, 20వ తేది (శుక్రవారం)తో కార్యక్రమం ముగియనున్న వేళ ప్రస్తుత సామాజిక నేపథ్యంలో

  • భక్తి యోగ మార్గాన్ని బోధించే భాగవత సారం
  • ఈతరం వారికి తెలియని ఎన్నో కొత్త సంగతులు
  • లోతైన అనేక ధార్మిక సందేహాలకు నివృత్తి

Chintana2
మానవాళికి మహోన్నత భగవంతుణ్ణి ప్రసాదించిన అపురూప గ్రంథం శ్రీమద్భాగవతం. సకల వేదాంత సారాన్ని, సమస్త భారతీయ ధార్మికతను నిక్షిప్త పరచుకొన్న ఈ మహత్‌గ్రంథం పరమాత్మను సాక్షాత్కరింపజేసిన తీరు అద్బుతం. ఇందులో సంస్కృత, తెలుగు మహాకవులు (వ్యాసుడు, బమ్మెర పోతన) ఆ సర్వాంతర్యామిని భక్తులకు అనుసంధానం చేసిన విధానం అమోఘం. ఈ భగవంతుని కథ ఈతరం వారిలో ఎందరికి తెలుసు? దేవుడే లేడని వాదించేవారు, ముఖ్యంగా నిరాకారుడైన పరమాత్మకు ఒక సాకార(భౌతిక) రూపమే లేదనుకొనేవారు విధిగా తెలుసుకోదగ్గ విశేషాలే ఇక్కడ. ధనుర్మాసం కూడా ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తి అవతార చరితను నగరప్రజలకు వినిపింపజేయాలన్న సత్సంకల్పం, ఆలోచనలోనే ఒక గుణాత్మక సామాజిక, ధార్మిక ప్రయోజనం, లక్ష్యం దాగి ఉన్నాయి. ఈ ప్రవచనాలలోని ఆధ్యాత్మిక విలువలను విని, తదనుగుణంగా అందరూ తమ జీవన విధానాలను మార్చుకోగలిగితే మన మహామహులు కలలు కన్న ఉదాత్త సమాజం తప్పక ఆవిష్కృతమవుంది. నిర్వాహకులకూ అంతకంటే కావలసిందేముంటుంది!
Chintana1
ఇంతటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు అవసరమా? ప్రత్యేకించి ప్రస్తుత మన దేశకాలమాన పరిస్థితులు భగవంతుని వృత్తాంతాన్ని తెలుసుకొనే సందర్భంతోనే ఉన్నాయా? ముఖ్యంగా ఈతరం వారు, సామాన్యులు భారతీయ ధార్మిక గ్రంథాల సారాన్ని ఎందుకు తెలుసుకోవాలి? తద్వారా వారికేం లభిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఎంత అమాయకత్వంతో కూడినవో అంత అజ్ఞానమైనవని కూడా వేద విజ్ఞానులు అంటారు. ఇటీవలి ‘దిశ’ ఉదంతానికి దారి తీసిన నైతిక లోపాలు ఈతరహా వైజ్ఞానిక దృష్టి ప్రజలలో లోపించడం వల్లనే అని వారంటారు. భాగవత గాథను లోకానికి వినిపించిన శుకమహర్షి జీవితం ఒక్కటి చాలు, మానవాళి కంతటికీ జ్ఞానోదయం కలిగించడానికి! కానీ, ఎంతమందికి శుకుని గురించి తెలుసు? అంతెందుకు, ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందిట తాయెత్తులు సిరిమువ్వ గజ్జెలు, చిన్నికృష్ణా నిన్ను చేరి కొలుతు’. ఇప్పటి పిల్లలకేకాదు, యువతరానికికూడా ఈ పద్యం ఎందరికి తెలుసు? అసలు, ఇలాంటి నీతిపద్యాలు, విలువలను గురించి బోధిస్తున్న పరిస్థితులు మన సమాజంలోంచి కనుమరుగైపోయి ఎన్నాళ్లయింది? హరికథలు, పురాణ కాలక్షేపాలు విస్తృతంగా జరిగే కాలం ఏమైపోయింది?

దేవుడు ఉన్నాడని ఒకసారి, లేడేమో అని మరొకసారి కొందరికి అనిపించడానికి కారణమేమై ఉంటుంది? తిరుగులేని భక్తి మార్గ సృష్టికి శ్రీమద్భాగవతం ఎలా ఉద్భవించింది? భారతీయ వైదిక ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన దేవుళ్లలో ఒకరైన శ్రీకృష్ణుడే జగదోద్ధారకుడైన ‘పరమాత్మ’ అనడానికి భాగవతంలో ఆయన ప్రబోధించిన మహోన్నత జ్ఞానసంపదే నిట్టనిలువు నిదర్శనం. శ్రీకృష్ణునిది ఎంత సంపూర్ణ శ్రీమహావిష్ణువు అవతారమో చెప్పడానికి అనేకానేక సందర్భాలు, సన్నివేశాలు అడుగడుగునా తారసపడుతై. ఒక్క కృష్ణునికి అంతమంది (రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, లక్ష్మణ, కాళింది, భద్ర, మిత్రవిందతోసహా 16,000 మంది రాజకన్యలు) భార్యలా? అంతటి విస్తృత సాంగత్యం ఆయనకెలా సాధ్యమైంది? మహాపతివ్రత ద్రౌపది అయిదుగురు అన్నదమ్ములకు భార్య ఎందుకు, ఎలా అయ్యింది? బ్రహ్మదేవుడు వెయ్యేండ్లు తపస్సు చేసికూడా పరమాత్మ శక్తిని తెలుసుకోలేక పోయాడా? ధర్మరాజుకూ ధర్మసందేహాలు కలుగుతాయా? ఇవేకాదు, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు భాగవతంలో నిస్సంకోచ సమాధానాలు లభిస్తాయి.

ద్వాపరయుగం ముగిసే వేళ, కలిపురుషుడు అవతరించడమే తరువాయి ధర్మదేవతను కాలితో తన్నాడంటే అది దేనికి సంకేతమో వేదవ్యాసునికి తెలిసి వచ్చిన క్షణాలవి. లోకానికి మహాభారతం ద్వారా ఏం చెప్పాలో అదంతా చెప్పేశాడు. అయినా, మానవాళికి జన్మసార్థకతను, మోక్షమార్గాన్ని చూపించే అత్యంత సరళతరమైన భక్తి మార్గం ఏది? అదెలా ఉంటుంది? జ్ఞానయోగం సిద్ధించినంత మాత్రాన భక్తియోగం మాటేమిటి? ఎటూ కర్మయోగం తప్పదు. మరి, ‘భక్తి లేని జ్ఞానం వృథా’ అనికూడా సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మే ప్రకటించాడు. వేదవ్యాసుని ఈ మనోవేదనను పోగొట్టడానికే దేవర్షి అయిన నారదుడే స్వయంగా భగవంతుని కథకూడా తానే అందించాలని ఉద్భోదించాడు. ఈ పర్యవసానంగానే వ్యాసుడు శ్రీమద్భాగవతాన్ని ఆవిష్కరించినట్లు మూలగ్రంథాలు చెబుతున్నాయి. మొత్తం 18,000 సంస్కృత శ్లోకాలతో కూడిన ఈ మహాభాగవతాన్ని మన పోతనామాత్యుడు మృదుమధురమైన తెలుగులో అత్యంత ముగ్ధమనోహరంగా ఆవిష్కరించాడు.

మొత్తం 12 స్కంధాలలో భగవంతుని కథ ఆసాంతం మహోన్నతంగా, మహాద్భుతంగా సాగుతుంది. అసలు ఈ సృష్టి అంతా ఎక్కడిది? ఎవరు భగవంతుడు? దేవుడి అవసరం మనకేమిటి? ఎందుకు ఆయనకిన్ని అవతారాలు? మనుషులు ధర్మం తప్పితే ఏమవుతుంది? మానవజన్మకు సార్థకత ఎప్పుడు? దాని అవసరం దేనికి?- ఇప్పటి యువతరం ఒక సినిమా కథ పట్ల చూపించే శ్రద్ధను ఇలాంటి దైవికాంశాల పట్ల చూపించకపోవడానికి కారణాలేమిటో తెలిస్తే ఆ లోటును పూడ్చుకోగలం. అంత హృద్యంగా, వాస్తవికంగా, జీవన దృశ్యాలు కళ్లముందు కట్టేలా చిత్రీకరింపజేయడంలో భాగవత మూలకథకులైన వ్యాసుడు, పోతన పూర్తిగా విజయవంతమయ్యారు. ఇదే పంథాలో ఇప్పటికీ అనేకమంది ప్రముఖులు ఆ విశేషాలను అంతే ఉద్విగ్నభరితంగా, ఉత్తేజకరంగా ప్రజలకు అందిస్తున్నారు. ప్రస్తుతం అలా ఎన్నదగిన వారిలో ఒకరే చాగంటి!

మనసుకు హత్తుకొనేలా, పూర్తి యథార్థభరితంగా, జనరంజకంగా, ప్రస్తుత సమాజానికి, వ్యక్తుల జీవితాలకు వర్తింపజేసే అంశాలను మేళవింపజేస్తూ ఆధ్యాత్మిక విలువలను వినిపించడంలో చాగంటి కోటేశ్వరరావు వారిది ఎంత అందె వేసిన చేయో పని కట్టుకొని చెప్పక్కర్లేదు. వారి ప్రసంగాలను విన్న వారెందరో ప్రత్యక్షసాక్షులు. అలాంటి వారికి ఇప్పటి ‘భాగవత సప్తాహ’ ప్రవచనాలు మరింత లోతైన వివేక, విచక్షణా సంపదను అందిస్తూనే, ఎన్నడూ వినని వారికి కొండంత కొత్త జ్ఞానాన్ని ప్రసాదిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏడు రోజులు ఎందుకంటే?

ఒక్క మహాభాగవతాన్ని మాత్రమే ‘సప్తాహం’గా ప్రవచిస్తుంటారు. దీనికి కారణం, మూలకథలోనే ఉన్నది. ప్రాణాంతక స్థితిలో పడిన పరీక్షిత్‌ మహారాజు (మహాభారతంలో అర్జునుని మనవడు, అభిమన్యుని కొడుకు, ధర్మరాజు తదనంతరం రాజ్యపాలన చేసిన రాజు)కు శుకుడు ఏడు రోజుల్లోనే మొత్తం భాగవతాన్ని వివరించాడు. ఇద్దరూ తిండి తిప్పలూ మాని ఈ బృహత్‌ కార్యాన్ని పూర్తి చేశారు. ఇదే ఆనవాయితీగా కావచ్చు, ‘సప్తాహం’ పేరుతో ఏడు రోజుల్లో భాగవతంలోని పన్నెండు స్కంధాల సారాన్ని వినిపించడం ప్రవచనవేత్తల విధానంగా మారింది.

శుకునిలోని భక్తియోగ నిష్ఠ గురించి తెలిస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది. ఒకసారి శుకుని వెంట పరుగెత్తే తండ్రి వ్యాసుడిని చూసిన అప్సరసలు (అప్పటికే వివస్త్రలుగా ఉన్నవారు) వెంటనే బట్టలు ధరిస్తారు. వ్యాసుడు ‘అదేమిటి? శుకుని ముందు అలా వున్న మీరు నేను రాగానే వస్ర్తాలు ధరించారు?’ అని అడిగితే, వారు చెప్పిన సమాధానం భాగవతంలోనిదే. ‘నీ కుమారునికి స్త్రీ పుంభేదం లేదు. నీవలా కాదుగా?’. అందుకే, శుక్రుడు వారు నగ్నంగా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. కారణం, అతనిలోని దృష్టి అంతా పరమాత్మపైనే. చెక్కుచెదరని హరిభక్తికి ఇదీ నిదర్శనం. ఇవాళ్టి మానవుల్లోనేకాదు, అసలు పౌరాణికుల్లోనూ ఇంతటి స్థితప్రజ్ఞుడు మరొకడు కనిపించరు.

- దోర్బల బాలశేఖరశర్మ


logo