శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 08, 2020 , 15:51:34

సంకల్పబలమే సుముహూర్తం!

సంకల్పబలమే సుముహూర్తం!

కాలాన్ని బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకోవాలి. మనచేతికి వాచీ ఉంటుంది కానీ,మన చేతిలో కాలం ఉండదు. ‘ముహూర్తానికి బలముంటుందా?’ అన్న సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఎందుకంటే, లోకంలో దాదాపు అందరూ ముహూర్తాలను నమ్ముతారు కనుక. అందుకే, ముహూర్తానికి వున్న బలమేమిటో శాస్త్రీయంగా తెలుసుకొందాం. ‘టైమ్‌ ఈజ్‌ గోల్డ్‌' అని ఆంగ్లంలో ఒక సూక్తి ఉంది. ‘సమయం బంగారం వంటిదని’ దీనర్థం. అలాగే, సంస్కృతంలోనూ ‘అమృత ఘడియలు’ అనే మాట ఒకటుంది. దీని అర్థం నిజానికి ప్రతీ ఘడియా అమృత సమానమేనని! భగవంతుడిని కాలపురుషుడని అంటాం కదా. దాని అర్థం ‘కాలమనే పురుషుడని’ కాదు. ఎవరి చేతిలో కాలం ఉంటుందో అతడే ‘కాలపురుషుడు’. అదే విధంగా ‘ఆదిత్య పురుషుడ’నే మాటకు ‘సూర్యదేవుడనే’ అర్థం కాక ‘అంతటా వ్యాపించి, ఆదిత్యుని (సూర్యుడు)లోనూ ఉన్న పరమేశ్వరుడని’ అర్థం. చాలావరకు సంస్కృత శబ్దాలకు మనం అనుకొనే అర్థాలు సరిపోవు. ‘కాలపురుషుడ’నే మాట ‘భగవంతుని చేతిలో కాలముంటుందనే విషయాన్ని’ వెల్లడిస్తుంది.

  • మన అదృష్ట, దురదృష్టాలకు కాలంతో పని లేదు!
  • కర్మలు చేస్తూ జీవించడమే మన పని
  • -మంచో, చెడో ఫలితాల్ని ప్రసాదించేది భగవంతుడే!

Main
ఆ క్షణంలో అది జరుగుతుందంటే దానికి ఎంతో మహిమ ఉన్నట్లే కదా! అని చెప్పుకొంటాం. కాని, కాలం గురించి తెలిస్తే మనం అనుకొన్నది నిజం కాదని అర్థమవుతుంది. ‘వైశేషిక దర్శనం’ ప్రకారం పదార్థాలు ఆరు. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాలు. ఇందులో ద్రవ్యాలు తొమ్మిది. ‘పృథి వ్యాపస్తే జోవాయురాకాశం/ కాలో దిగాత్మా మన ఇతిద్రవ్యాణి’ (వైశేషికం: 1.1.5). పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. ఈ ద్రవ్యాలలో మొదటి మూడు అనిత్యమైనవి. వాయువు మొదలుకొని మనస్సు వరకు నిత్యమైనవి. వీనిలో ఆత్మ రెండు విధాలు. జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ, పరమాత్మలతోపాటు పృథివ్యాదులకు మూలకారణమైన ప్రకృతి మొత్తం ఈ మూడు కూడా పరమార్థ నిత్యాలు. అంటే, ఉత్పత్తి వినాశాలు లేనివని తెలుసుకోవాలి. వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, మనస్సు- ఈ అయిదు చాలాకాలం ఉండడం వల్ల ‘నిత్యమైనవి’గా పేర్కొన బడుతున్నాయి. వీటిని ‘వ్యవహార నిత్యాలని’ కూడా పిలుస్తారు. వీటిలో వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనే నాలుగు ద్రవ్యాలు ప్రళయం వరకూ ఉంటాయి. మనస్సు మాత్రం మోక్ష పర్యంతం ఉంటుంది.


కాలం అనేది అనిత్య పదార్థాలన్నింటికీ సాధారణమైన కారణం. ఆత్మ, పరమాత్మలు ‘నిత్య పదార్థాలు’ కనుక, వాటికి కాలం వర్తించదు. కాలానికి లొంగి ఉన్నవే అనిత్య పదార్థాలు. లొంగనివి నిత్య పదార్థాలు. కాలమహిమను గుర్తించటానికి సూర్యోదయాస్తమయాలు, పగలు రేయి, శైశవాది దశలు, అనిత్య వస్తువుల ఆవిర్బావ వినాశాలు తోడ్పడుతాయి. అనుకోకుండా సుఖం కలిగితే అదృష్టమని, దు:ఖం కలిగితే దురదృష్టమని చెప్పడం కూడా కాలాన్నిబట్టే జరుగుతుంది. కాని, కాలం అనేది సుఖదు:ఖాలకు కారణం కాదన్న సంగతి చాలామందికి తెలియదు. నిమిత్త కారణాలలో అదొకటి మాత్రమే. ‘అతనికి కాలం కలిసి వచ్చింది. కాలం అనుకూలించలేదు’ అని చెప్పడం వల్ల కాలమే అన్నింటికీ కారణమనే భావన కలుగుతుంది. కానీ, మన జీవితంలో కాలం కూడా ఒక పనిముట్టు లాంటిదేనని గ్రహించాలి.

మనం ఏ పని ఆరంభించినా ఒక సమయాన్ని ఎన్నుకొంటాం. ఆ పని సఫలం కాకపోతే ‘కాలం అనుకూలించలేదని’ కాలాన్ని నిందించటానికి కూడా వెనుకాడం. కాని, ‘మన పని సఫలం కావటానికి కాని, దుష్ఫలితాన్ని ఇవ్వటానికి కాని కాలం కారణం కాదని, కేవలం అదొక నిమిత్త కారణం మాత్రమేనని’ తెలుసుకోవాలి. అందుకే, కాలాన్ని బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని అధిగమించడం మానవునికి సాధ్యం కాదు. మన చేతికి వాచీ ఉంటుంది కానీ, మన చేతిలో కాలం ఉండదు. మరి, ‘మనం కాలం చెప్పినట్లు వినవలసిందేనా?’, ‘అది మనం చెప్పినట్లు వినటానికి మనం చేయవలసిన పనేమైనా ఉన్నదా?’ కాలాన్ని మితంగా వాడుకోవాలని, ఏ వేళకు ఏ పని చేయాలో అది చేయాలని, కాలాన్ని విస్మరించి లేదా ధిక్కరించి ఉండరాదని, ఫలితం దొరికేదాకా నిగ్రహం కలిగి ఉండాలని పెద్దలు చెప్పిన మాటలు మరవరాదు.

దేనికైనా సమయం ఉండాలంటాం. ఈ సమయానికే ‘కాలమని’ పేరు. ఏ సమయంలో ఏం జరగాలో అది జరుగుతుందని చెప్పడం సులభమే కాని, అలా జరగటం వెనుక ఒక బలమైన శక్తి పని చేస్తుంది. అదే భగవంతుడు! మనం లోకంలో సుఖదు:ఖాలను అనుభవించవలసిన కర్మలు మూడు విధాలు. 1. ప్రారబ్ద కర్మలు 2. సంచిత కర్మలు 3. క్రియామాణ కర్మలు. నేడు అనుభవిస్తున్నవి ప్రారబ్దకర్మలు. ఇంకా అనుభవించవలసినవి సంచిత కర్మలు. ఎప్పటికప్పుడు అనుభవిస్తున్నవి క్రియామాణ కర్మలు. ఏ కర్మఫలాన్ని ఏ ముహూర్తంలో మనం అనుభవించవలసి వస్తుందో మనకు తెలియదు. అలాగే, ఏ కర్మను ఎప్పుడు ఆరంభించి, ఎప్పుడు ముగిస్తామో కూడా తెలియదు. కేవలం సమయమే ఫలాన్ని నిర్ణయిస్తే చేసే కర్మకు విలువే లేదు. ఈ కర్మ చేయదగిందా? లేక, చేయరానిదా? అని ఆలోచించి బుద్ధిపూర్వకంగా చేసినప్పుడే అది ఫలవంతమవుతుంది. కనుక, కాలానికి ఫలం గురించి తెలియదు.

కర్మ ఫలవంతం కావడానికి కర్తతోపాటు కాలం కూడా ఉపయోగపడుతుంది. కేవలం కాలమే కర్మఫలాన్ని నిర్ణయిస్తే కర్త లేకుండానే కర్మ జరగవలసి ఉంటుంది. కాని, కర్త అనే వాడు లేకుండా కర్మ జరగదు. సృష్టికర్త లేకుండా సృష్టి జరగనట్లే, చేసేవాడు లేకుండా పని అనేది జరగదు. కర్మ చేయడానికి సంకల్పంతోపాటు నైపుణ్యం ప్రాధాన్యం వహిస్తుంది. కేవలం కాలమే కర్మఫలాన్ని నిర్ణయిస్తే మనం ఇంట్లో కూర్చున్నా బయట పని జరగాలి. కాని, అది ఎన్నటికీ సాధ్యం కాదు కదా! కాబట్టి, చేసే వాడినిబట్టి కర్మ ఉంటుంది. కర్మనుబట్టి ఫలం సిద్ధిస్తుంది. అంతే!

కర్మకు కర్త మానవుడైతే కర్మ ఫలప్రదాత భగవంతుడే! అందుకే, ఏ పని చేసినా మొదట భగవంతుణ్ణి తలచుకోవాలని ‘తైత్తిరియోపనిషత్తు’ చెబుతున్నది. ‘ఓమితి బ్రాహ్మణ: ప్రవక్ష్యన్నాహ బ్రహ్మాపాప్నవానీతి’- వేదవిదుడైన ఆచార్యుడు ఓం కారాన్ని జపించి పనిని ఆరంభించాలని ఉపనిషత్‌ ప్రబోధిస్తున్నది. ‘కర్మ యోగం కంటే జ్ఞానయోగమే శ్రేష్ఠమైనప్పుడు నన్నెందుకు యుద్ధం చేయమంటున్నావు?’ అని కృష్ణుణ్ణి సూటిగా అడుగుతాడు అర్జునుడు. జ్ఞానులే కర్మయోగాన్ని ఆరంభించడానికి తగిన వారని, లోకంలో కర్మ చేయకుండా ఎవరు కూడా ఒక్క క్షణమైనా ఉండరని కృష్ణుడు సమాధానం ఇచ్చాడు. ‘న హికశ్చిత్‌ క్షణమపి/ జాతు తిష్ఠతి అకర్మకృత్‌' (కర్మయోగం: 3-5). దీన్నిబట్టి ప్రతి ప్రాణి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడని తెలుస్తున్నది. అయితే, అలాంటప్పుడు ఈ క్షణం మంచిది, ఈ క్షణం చెడ్డది అని, ఇది సుముహూర్తం, ఇది దుర్ముహూర్తం అని నిర్ణయించి కార్యాచరణకు పూనుకోవడం కష్టం.

సత్కర్మలు చేస్తూ కర్మ ఫలాలను భగవంతునికి అర్పించేవాడు ముహూర్తాల కోసం ఎదురుచూడడు. కర్మఫలాలను ఈశ్వరార్పణ చేయాలని సంకల్పించడమే సుముహుర్తం. ధైర్యంగా కార్యరంగంలోకి దూకడమే సుముహుర్తం. నిజానికి మనిషిగా తల్లిగర్భంలోంచి నేలమీద పడడమే సుముహుర్తం. అంతేకాని, సుముహుర్తమంటూ, వర్జ్యమంటూ కాలాన్ని వ్యయిస్తూ బుద్ధిమంతుడు అకర్ముడై, జీవితాన్ని వ్యర్థం చేసుకోడు. ఇదే కాలానికి సంబంధించిన శాస్త్రీయ వివేచన. ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్‌ శతస్సమ:’ అన్న వేదవాక్యాన్నిబట్టి కర్మలు చేస్తూ నూరేళ్లు జీవించడమే శ్రేష్ఠమానవుని పని.

‘ముహూర్తం’ అంటే ఒక్క ‘క్షణం’ కాదు!

సెకనులో వెయ్యవ వంతుకు ‘తృటి’ అని పేరు. 100 తృటులైతే ఒక ‘వేద’. 3 వేదలైతే ఒక ‘లవం’. 3 లవాలైతే ఒక ‘నిమేశం’ (రెప్పపాటు కాలం). 3 నిమేశాలైతే ఒక్క ‘క్షణం’. 5 క్షణాలైతే ఒక ‘కష్టం’. 15 కష్టాలైతే ఒక ‘లఘువు’ (ఒక మాత్రా కాలం). 15 లఘువులైతే ఒక ‘దండం’. 2 దండాలైతే ఒక ‘ముహూర్తం’. దీన్నిబట్టి, ఎన్నో క్షణాలైతేగాని అది ఒక ముహూర్తం కాదు. ‘ముహూర్తం’ అంటే ఒక్క సెకనో, నిమిషమో కాదు. పది, పదిహేను నిమిషాల మధ్య ఉండే కాలమే ముహూర్తం. కాని, చాలామంది ముహూర్తాన్ని క్షణకాలంగా భావిస్తారు.

కాలమే లేకపోతే..?

ఒక వ్యక్తిని యువకునిగాను, వృద్ధునిగాను లెక్కించటానికి కాలమే కారణం. ఒక చెట్టు చిగురించడానికి, పుష్పించి ఫలించడానికి కాలమే కారణం. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. చెట్టు దాని స్వభావాన్నిబట్టి, బీజగతమైన ఏర్పాటునుబట్టి అది చిగిర్చడం, పుష్పించడం గాని జరుగుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని కొలిస్తే అది కొన్ని దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా తేలుతుంది. దీనినంతా కాలంగానే వ్యవహరించాలి. భగవంతుడు కాలాన్ని సృష్టించకపోతే జనన మరణాలను, ఆయుష్షును మనం గుర్తించే వాళ్లం కాదు. సృష్టి ప్రళయాలకూ గుర్తింపే ఉండదు. సుఖాన్నిగాని, దు:ఖాన్నిగాని ప్రాణికోటికి అనుభవించే అవకాశమే ఉండదు కూడా.
Masana Chennappa
ఆచార్య మసన చెన్నప్ప
సెల్‌: 98856 54381


logo