శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 08, 2020 , 17:41:57

పరబ్రహ్మ శివతత్వం!

పరబ్రహ్మ శివతత్వం!

‘ఆది-అంతం’ లేని అద్భుత దైవం పరమేశ్వరుడు. ఆ మహాశివలింగ రూపుడు సర్వాంతర్యామి ఎలా అయ్యాడు? ఆయన ఆరాధనకు అత్యంత ప్రియమైన కార్తీకమాసంలోని కార్తీక పౌర్ణమి వస్తున్నది. ఈ సందర్భంగా పరబ్రహ్మ స్వరూపుడైన శివుని తత్వాన్ని తెలిపే ఈ విశేష వ్యాసం చదువండి.

ఆద్యంతాలు లేనివాడు, సమస్త జగత్తే తానైనవాడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని వేదాలు ఘోషించాయి. భూమి, ఆకాశం, అంతరిక్షం కంటే గొప్పవాడు, సమస్త లోకాలలోనూ వ్యాపించిన వాడాయన. అంతటి మహాశివుణ్ణి మన హృదయ కమలంలోనే ఉపాసించాలని ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి. ఉండికూడా లేనట్టు, లేకుండానే ఉన్నట్టు అనిపింపజేయడం ఆయనకెలా సాధ్యమైంది? పరమేశ్వరుని పరబ్రహ్మ తత్వంలోనే ఆ రహస్యం ఉంది.

పరమేశ్వరుడు సృష్టికర్త, సర్వాంతర్యామి. అతని సంకల్పబలంతోనే సృష్టి జరుగుతుంది. అణువణువునా వ్యాపించి వున్న పరమేశ్వరుడు ఒక్కడే. అతడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కూడా. ‘ఏకోవశీ సర్వభూతాంతరాత్మా/ ఏకం రూపం బహుధౌ య:కరోతి/ తమాత్మస్థం యే నుపశ్యంతి ధీరా/ తేషాం సుఖం శాశ్వతం నేతరేషాన్‌ (కఠ. 5-12). పరమేశ్వరుడు ఒక్కడే చరాచర జగత్తును సృష్టించి, దాన్ని తన అధీనంలో ఉంచుకొని, సర్వవ్యాపకుడై ప్రకాశిస్తున్నాడు. సృష్టి రచనా నైపుణ్యంతో పాటు ప్రళయం చేయగలిగిన శక్తికూడా ఆయనదే. సమస్త వస్తు ప్రపంచంలోనే గాక, జీవులలోను అంతరాత్మగా వున్న పరమేశ్వరుణ్ణి గురించి తెలుసుకున్న వారికే శాశ్వతమైన సుఖం (మోక్షం) లభిస్తుందని కఠోపనిషత్తు ప్రబోధిస్తున్నది.

పరమేశ్వరుని సర్వవ్యాపకత్వం వేదాలలో అడుగడుగునా కనిపిస్తుంది. ‘సహస్ర శీర్షా పురుష: సహస్రాక్ష సహస్ర పాత్‌/ సభూమిం సర్వత: స్పృత్యా త్యతిష్ఠత్‌ దశాంగులమ్‌' (యజు. 21-1). ఎవరు లెక్కకు మించిన మనుష్యాది సమస్త ప్రాణుల శిరస్సులను, నేత్రాలను, పాదాలను తన యందు కలిగి ఉన్నాడో, ఎవరు పంచసూక్ష్మభూతాలతో, పంచస్థూలభూతాలతో కూడిన జగత్తును అన్ని వైపుల నుంచి స్పృశిస్తున్నాడో, ఇంకా చెప్పాలంటే ఎవరు బ్రహ్మాండాన్ని అధిగమించి ఉన్నాడో ఆ సర్వవ్యాపకుడైన పురుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే.

‘తే దే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే/ తదంతరస్య సర్వస్య తదుసర్వస్యాస్య బాహ్యత:’ (యజు.40-5). అయితే, ఆ పరమేశ్వరుడు తెలియని వారికి కదులుతున్నట్లు అనిపిస్తాడు. కానీ, అతడెప్పుడూ కదలడు. అట్లే, తెలియని వారికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు. కానీ, అతడు మనకెప్పుడూ సన్నిహితంగానే ఉంటాడు. ఆ పరమేశ్వరుడు సృష్టిలోని అన్ని పదార్థాల లోపలా వ్యాపించి ఉన్నాడు. అంతేకాదు, వాటికి వెలుపల కూడా ఉన్నాడు. పరమేశ్వరుని విషయంలో ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్న వేసుకొంటే, దీనికి సమాధానం ఒక్కటే ‘అతడు అంతర్యామి కావడం’ వల్ల!

మానవులు కర్మలు చేస్తారు కనుక వాటికి కర్తలు. ఫలాలు అనుభవిస్తారు కనుక భోక్తలుకూడా వారే. మరి ఫలాలను అనుభవింపజేసే వారెవరు? పరమేశ్వరుడే. అతడు ఒకచోటనే ఉండిపోతే, ఆ చోట ఉన్నవారికి మాత్రమే ఫలాలను ఇవ్వగలడు. కానీ, అన్నిచోట్ల ఉన్నవాళ్లకూ ఫలాలనివ్వాలి. ఇది నియమం. అందుకే, పరమేశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఉపనిషత్తులలో పెద్దదైన ‘బృహదారణ్యకం’లోను పరమేశ్వరుడిని సర్వాంతర్యామిగా చెప్పారు. ‘య ఆకాశే తిష్ఠన్‌, ఆకాశా దన్తర:, యమాకాశోన వేద, యస్యా కాశ: శరీరం, య ఆకాశా దన్తర: యమయతి, ఏషత ఆత్మా అంతర్యామి అమృత:’ (బృహదారణ్యకం: 3-7-21). ఆకాశంలో ఉండి, ఆకాశం కంటే భిన్నుడై, ఆకాశానికి తానెవరో తెలియని వాడై, ఆకాశాన్నే శరీరంగా ధరించి, ఆకాశం లోపలా- బయటా అంతటా, సమస్త జగత్తు అంతటా తానే శాసకుడై వెలుగొందే పరమేశ్వరుడే అంతర్యామి, అమృతం!

ఛాందోగ్యోపనిషత్తులోను పరమేశ్వరుడిని సర్వాంతర్యామిగానే పేర్కొన్నారు. ‘జ్యా యాన్‌ పృథివ్యా, జ్యాయాన్‌ అంతరిక్షాత్‌/ జ్యాయాన్‌ దివో, జ్యాయానేభ్యో లోకేభ్య:’ (3-14-3). పరమేశ్వరుడు భూమికంటే గొప్పవాడు. అంతరిక్షం కంటే గొప్పవాడు. ఆకాశం కంటే గొప్పవాడు. సమస్త లోకాలకంటే గొప్పవాడు. అయినప్పటికీ అతణ్ణి మన హృదయ కమలంలోనే ఉపాసించాలని ఉపనిషత్తు చెప్తుంది. అంతటా ఉన్నవాడు అంగుష్ఠ మాత్రమైన హృదయ కమలంలో ఉండకుండా ఎట్లుంటాడు? కేవలం పరమాత్మను జడప్రపంచంలోనే చూడడం సరికాదు. చేతనాత్మక జగత్తులోను చూడదగినవాడు.

‘ఏవం య: సర్వ భూతేషు పశ్యతి ఆత్మానమాత్మనా/ సర్వసమతా మేత్య బ్రహ్మాఖ్యేతి పరం పదమ్‌' (మను. 12-125). సర్వప్రాణులలోను వ్యాపకమై ఉన్న పరమేశ్వరుణ్ణి ఎవరు దర్శిస్తారో, వారు సమత్వాన్ని పొంది, బ్రహ్మానందానికి చేరువ అవుతారని అంటాడు మనువు. సర్వాంతర్యామి ఐన పరమేశ్వరుణ్ణి మనమంతా ఉపాసిద్దాం, తరిద్దాం.
Lord-Shiva1

సర్వం ఈశ్వరమయం!

జనకుడు గొప్ప యజ్ఞం చేస్తూ, దేశంలోని విద్వాంసులందరినీ ఆహ్వానించాడు. వారిలో యాజ్ఞవల్క్యుడు కూడా ఉన్నాడు. అతణ్ణి బ్రహ్మవేత్తగా గుర్తించటానికి గార్గి అనే విదుషీమణి ఆయనను రెండు ప్రశ్నలు అడిగింది. మొదటిది: ‘సూర్యచంద్రాది లోకాలకు పైన, భూమికి కింద, మధ్యగల అంతరిక్షంలో ఉన్నది దేనియందు ఓతప్రోతమైంది?’ దీనికి యాజ్ఞవల్క్యుని సమాధానం: ఆకాశమునందు ఓతప్రోతమైంది. (ఓతప్రోతమంటే పడుగుపేకలలాగా అంత టా వ్యాపించి ఉన్నదని అర్థం). రెండవ ప్రశ్న: ‘ఆ ఆకాశం ఎవ్వని యందు ఓతప్రోతమైంది?’. యాజ్ఞవల్క్యుని సమాధానం: ‘పరమేశ్వరుని యందు ఓతప్రోతమైంది’. ఈ సన్నివేశం ‘పరమేశ్వరుడు సర్వాంతర్యామి’ అని తెలియజేస్తున్నది.
Lord-Shiva2
- ఆచార్య మసన చెన్నప్ప సెల్‌: 98856 54381


logo