శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - Jan 08, 2020 , 17:13:06

కాశీ విశ్వనాథుని సన్నిధిలో అద్భుత అతిరుద్ర యాగం!

కాశీ విశ్వనాథుని సన్నిధిలో అద్భుత అతిరుద్ర యాగం!

భారతీయులు పరమ పవిత్రంగా భావించే వారణాసి(కాశి)లో అత్యంత అరుదైన అతిరుద్ర యాగాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 600 మంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. ఈనెల 13న మొదలైన ఈ యాగం నేటి (24వ తేది)తో ముగుస్తున్నది. ఈ సందర్భంగా భక్తుల శివనామ స్మరణతో కాశీ క్షేత్రం మారుమోగుతున్నది.

  • శివనామస్మరణతో పులకించిన భక్తులు
  • నేటి పూర్ణాహుతితో ముగింపు

వేయిమంది వంట బ్రాహ్మణులతో భోజనాలు, వసతి ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాల కోసం అంబులెన్సు సహా ప్రత్యేక వైద్యబృందాలను వినియోగిస్తున్నారు. 7,500 మందికి పైగా దత్త వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. కాలభైరవ, చండీతో మొత్తం 11 హోమగుండాలను ఏర్పరిచారు. మైసూర్‌ అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యేక పూజలతో యాగం ప్రారంభించారు. నేటితో శివానీ ఘాట్‌ దగ్గర ముగుస్తున్నది. తొలిరోజు 109 మంది వేదరుత్విక్‌లు పుణ్యావాచనంతో శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. అగ్నిస్థాపనతో అతిరుద్రయాగానికి శ్రీకారం చుట్టారు. 119 మంది వేద పండితులు మూలమంత్రాన్ని పటిస్తూ దత్తహోమం నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా యాగశాల ప్రాంగణంలో 121 మంది వేదపండితులతో చతుర్వేద పారాయణం జరిగింది.

ప్రతి రోజూ పుణ్యనదీ జలాలతో కాశీ విశ్వేశ్వరునికి రుద్ర నమక చమకాలతో రుద్రాభిషేకం చేశారు. సుమారు 1400 గజాల చీరను ఇక్కడి గంగానదిలో అమ్మవారికి సారెగా గణపతి సచ్చిదానంద స్వామీజీ సమర్పించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అకాల వర్షాలు వరదలు లేకుండా, చక్కగా పాడిపంటలు కలగాలని, ప్రపంచమంతా శాంతి సుఖసంతోషాలతో విలసిల్లేలా దీవించమని గంగమ్మ తల్లిని స్వామివారు ప్రార్థించి, పూజలు చేసారు. ‘నా రుద్రో రుద్ర మర్చయేత్‌!’ రుద్రాంశను శరీరంలో నిలుపుకొని శివుణ్ణి అర్చించాలి. శరీరంలోని అవయవాలన్నీ శుద్ధి కావాలంటే పాదాలనుంచి శిరస్సువరకూ ప్రతీ అవయవాన్నీ మంత్ర సహితంగా అర్చించాలి. అప్పుడు మనం రుద్రులం అవుతాం. శివాంశ మనలో నిలిచి, సత్కార్యాలకు ప్రేరణనిస్తుంది. రుద్రాభిషేకం, రుద్రయాగాల పరమార్థం అదే.

‘ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం’. మృత్యువును తొలగించే రుద్రుడు ఐశ్వర్య కారకుడుకూడా! ఆరోగ్యాన్ని సూర్యుడు ఇస్తాడు. ధనాన్ని ఇచ్చేది ఈశ్వరుడు. లక్ష్మీదేవి దాన్ని కాపాడుతుంది. లోకంలో సర్వులూ ధనాన్ని కలిగి ఉంటూ, అపమృత్యు భయం లేకుండా జీవనం సాగించడానికి ‘అతిరుద్రయాగం’ దోహదపడుతుంది. రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల ‘శతరుద్రీయా’నికి ‘రుద్రం’ అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం ‘రుద్రాభిషేకం’. దానికి ‘రుద్రం’, ‘ఏకరుద్రం’ అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల ‘రుద్రం’ పదకొండుసార్లు చేస్తే ‘ఏకాదశ రుద్రాభిషేకం’ లేదా ‘రుద్రి’ అవుతుంది. రుద్రాన్ని 121 సార్లు చేసే అభిషేకం ‘లఘురుద్రాభిషేకం’. 11 లఘురుద్రాలు ఒక ‘మహారుద్రం’. ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.

ఈ మహారుద్రాలు పదకొండయితే ‘అతిరుద్రం’. దీనిలో 14,641 మార్లు రుద్రం చెప్పబడుతుంది. ఈ మంత్రాలను అభిషేకానికి వాడితే ‘రుద్రాభిషేకం’, హోమంలో వినియోగిస్తే ‘రుద్రయాగం’. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోకి ఐక్యం చెందుతాడు. ‘యజ్ఞం’ అంటే, దేవతలను పూజిం చి తృప్తిపరచడం. అందుకు కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతి ఇస్తారు. ఈ యజ్ఞాన్ని యాగం, క్రతువు, హవనం అనికూడా అంటారు. యజ్ఞమే బ్రహ్మ, యజ్ఞమే విష్ణువు, యజ్ఞమే రుద్రుడు, యజ్ఞమే సకల దేవతలు. ఇక యజ్ఞవేదిక దేవేంద్రుని స్వరాజ్య పీఠమని అంటారు. ఇది అగ్నిదేవుని సువర్ణసింహాసనం. చంద్రుని విలాస భవనం. వరుణదేవుని విశ్రాంతి భవనం. సమస్త దేవగణాలకు దివ్యక్షేత్రం. యజ్ఞం, యజ్ఞవేదిక కృష్ణయజుస్సంహితకు ముఖ్యమైన ప్రాణం వంటిది. యజ్ఞవేదిక సుప్రతిష్ఠమైతేనే సర్వం సుప్రతిష్ఠమవుతుంది.

వేదాల్లో అత్యంత పవిత్రమైందిగా చెప్పబడిన ఈ అతిరుద్రయాగం ద్వారా విశ్వకళ్యాణాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కోరుకుంటున్నారు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి పర్యవేక్షణలో యాగం చివరిఘట్టంగా వివిధద్రవ్యాలతో కూడిన ఆహుతిని మంత్రాలతో అగ్నికి సమర్పించ డమే పూర్ణాహుతి. ఇదే నేడు జరుగుతున్నది. చూసి తరించటానికి దేశం నలుమూలల నుంచి భక్తకోటి తరలి వచ్చారు. సాధారణంగా కాశీలో భక్తుల రద్దీ ఎప్పటికీ ఉన్నా, ఈ అతిరుద్ర యాగంతో మరింత పెరిగింది. తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలనుంచీ వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

- తంగళ్లపల్లి సంపత్‌
స్టేట్‌ బ్యూరో, నమస్తే తెలంగాణ
వారణాసి (కాశీ) నుంచి


logo