శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 08, 2020 , 17:06:31

మనిషి దేవుడెలా అవుతాడు?

మనిషి దేవుడెలా అవుతాడు?

మనిషి దేవుడవుతాడా? ‘దైవం మానవ రూపంలో..’ అన్న అద్వైత సారం ప్రకారం ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు. అందరినీ, ఆ మాటకొస్తే సమస్త సృష్టిలోని జీవరాశులన్నింటినీ దైవస్వరూపాలుగా భావించి, సేవించవచ్చు. కానీ, ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినట్లు, ఉత్కృష్ఠమైన మానవజన్మను పొందిన వారు అచంచలమైన భక్తి జ్ఞాన కర్మాది యోగాలతోనే జీవన్ముక్తులవుతారు. సాక్షాత్‌ పరమాత్మ అవతారాలుగా జన్మించే మహానుభావులూ కొందరుంటారన్న జ్ఞానవాక్కూ ఉంది. మరి, ఎవరు వాళ్లు? ప్రత్యేకించి భగవాన్‌ రమణ మహర్షి దేవుడెలా అయ్యారు?

Vela
శ్రీరాముడు తాను దేవుణ్ణని ఎక్కడా ప్రకటించుకోలేదు. భగవాన్‌ రమణ మహర్షి కూడా తనను ప్రజలు దైవంగా భావించడాన్ని ఎంతమాత్రం ఇష్టపడలేదు. ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే ‘తానే సర్వాంతర్యామినని’ వెల్లడించినట్లు ఐతిహాసిక సాహిత్యం చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే ‘ఒక సాధారణ మనిషి దేవుడవుతాడా?’ అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ‘దేవుని అవతారాల’ విషయమలా ఉంచి, కనీసం ‘జీవన్ముక్తి’ సాధన ఎందరికి సాధ్యమవుతున్నది? రమణుల జీవనసారాన్ని గ్రహించగలిగితే ఈ విషయంతోపాటు ప్రతి ఒక్కరికీ పనికివచ్చే అనేక జీవితసత్యాలు బోధపడతాయి. వెంకటరామన్‌ (ఇది పూర్వనామం, ఇంకా దానికంటే ముందు వేంకటేశ్వర అన్న పేరున్నట్టు వినికిడి) రమణ మహర్షిగా మారడంలోని గొప్పతనం, రమణులను భగవాన్‌గా భావించడంలోని మహనీయత.. ఈ రెండింటి మధ్య వున్న రహస్యం తెలిస్తే మనలో ఏ కొందరైనా వారి అడుగుజాడలలో నడవడానికి ప్రయత్నిస్తారు.
Vela1
రమణ మహర్షి జీవితం పూర్తిగా తెరిచిన పుస్తకం. భారతీయ ధార్మికబద్ధమైన జీవన విధానాన్నే వారు అవలంభించారు. పదిహేనేండ్ల వయసునుంచి అయిదు దశాబ్దాలకు పైగా కాలాన్ని (తాను తనువు చాలించే దాకా) అత్యంత నిరాడంబరంగా, లౌకిక సౌకర్యాలు, భౌతిక సుఖాలకు అన్నింటికీ అతీతంగానే గడిపారు. మానవత్వానికి, ఆత్మాన్వేషణా తత్వానికే వారు పూర్తిగా, ప్రగాఢంగా అంకితమైనారు. చిన్నతనంలోనే మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించగలిగారు. తినే తిండి నుంచి కట్టుకొనే బట్టలదాకా అతి సామాన్యతనే పాటించారు. పదహారేండ్ల వయసులోనే మృత్యువు చేరువకు వెళ్లారు. కేవలం కొద్ది వారాలపాటు దైవసన్నిధిలో గడిపి, తనను తానే మరిచిపోయేంత దీర్ఘ సమాధి స్థితికి చేరుకొన్నారు. అప్పుడే యోగ జ్ఞాన సాధనకు కావలసిన పునాది పడింది. ఒక ఆధునిక ఋషికి ఉండవలసిన లక్షణాలన్నింటినీ రమణ మహర్షి పుణికి పుచ్చుకొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎంతగా వేదాంతనిష్ఠను పాటించారో అంతేస్థాయిలో నిర్మల, నిశ్చలమైన ఆత్మాన్వేషణా మార్గంలోనే వారు జీవిత పర్యంతం కొనసాగారు. ఆయన స్థితప్రజ్ఞత ఆశ్రమంలోని భక్తులందరికీ తెలిసిందే. అనేకమంది కండ్లారా చూసినవారే. ఐతే, ‘దేవుడి’లా తానెప్పుడూ అద్భుతాలు చేయలేదు. అసలు తనను దేవుడిలా చూడవద్దని ఆయన అనేకమందికి ఆయా సందర్భాలలో కరాఖండిగా చెప్పేసినట్లు ఆయా రచనలు చదివితే అర్థమవుతుంది.


ఒక సామాన్య మానవుడిగానే తనంత తాను ప్రకటితమవుతూ ఎందరికో మార్గదర్శకులైన రమణ మహర్షి వంటివారు యావత్‌ భారతావనిలో అత్యంత అరుదు. తోటి భక్తులకు మాత్రం చాలా చిత్రంగా ఆయన గొప్పయోగిలానే కనిపించే వారు. దేవుడంటే నమ్మకం లేని అనేకమంది సైతం రమణులను, వారి తత్వాన్ని, తాను పాటించిన జీవితపు విలువలను ఇష్టపడి ఆరాధించడం మొదలుపెట్టారు. చాదస్తపు భావా లు, మూర్ఖ భక్తిని ఆయన స్పష్టంగా వ్యతిరేకించారు. మౌనాన్నే ఎక్కువగా ఆశ్రయించే వారు. చాలా ఆశ్చర్యకరంగా అనేకమంది దృష్టిలో ఆయన ‘దేవుడ’య్యారు. వారి శిష్యులు సూరి నాగమ్మ, సుందరం (సాధు త్రివేణిగిరి) వంటి ఎందరికో రమణులు సాక్షాత్‌ భగవత్‌ అవతారంగానే దర్శనమిచ్చారు. లేకపోతే, మనలాంటి సామాన్య మానవుడే తానైతే, అంతటి కఠోరనిష్ఠతో కూడిన జీవితం వారికెలా సాధ్యమవుతుంది!

అది దైవ నిర్ణయం!

రమణ మహర్షి సాధారణ మానవుడే అయినా ఆయనలోని దైవాంశ అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురి దృష్టిలో అసాధారణరీతిలో వ్యక్తమవుతూనే వచ్చింది. అలాంటి వారిలో ఒకరే సుందరం అయ్యార్‌. తదనంతరం ‘సాధు త్రివేణిగిరి స్వామి’గా ప్రసిద్ధులైన ఆయన, రమణ మహర్షి ఆశ్రమవాసిగా స్థిరపడడానికి ముందు తిరుచ్చెందూర్‌లోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆయన అక్కడి స్వామిని ప్రార్థిస్తున్న వేళ నమ్మశక్యం కాని విధంగా సాక్షాత్తు షణ్ముకుడే స్వయంగా తనతో మాట్లాడినట్టు సుందరం అయ్యర్‌కు వినిపించింది. “ఇక్కడ నేను పలికే దేవుణ్ణి కాను. నువు తిరువణ్ణామలై వెళ్లు. అక్కడ పలుకుతుంటాను, కదులుతుంటాను కూడా” ఇదీ ఆ దైవవాక్కు. తర్వాత ఆయన రమణాశ్రమానికి వెళ్లడం, వారిని చూడడం, తన్మయత్వంతో అక్కడే వుండిపోవడం వంటివన్నీ జరిగిపోయాయి. దీనిని త్రివేణిగిరి స్వామివారే స్వయంగా వెల్లడించారు. అలాగే, సూరి నాగమ్మ కూడా తాను ఆశ్రమానికి రాకముందు తనకు కలలో కానవచ్చిన ‘మహాదివ్య పురుషుడు’ రమణులేనని నిర్ధారించుకొని, అక్కడే స్థిరపడిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాలు భగవాన్‌ రమణ మహర్షిలోని గొప్పతనాన్ని చెప్పకనే చెబుతాయి.

తాజావార్తలు


logo