e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home చింతన జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు

జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు

జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు

‘ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మన్తవ్యో నిదిధ్యాసితవ్యః’(శృతివాక్యం). ‘ఆత్మయే చూడదగింది, వినదగింది, తరచి తరచి తెలుసుకోదగింది, ధ్యానింపదగింది’. ఆత్మజ్ఞానం పొందడమే మానవజన్మకు పరమార్థం. ‘వైరాగ్య బోధో పరమాస్స హాయాస్తే పరస్పరం’ (వేదాంత పంచదశి). ‘ఆత్మతత్త జ్ఞానానికి వైరాగ్యం, బోధ, ఉపరతులు పరస్పరం సహకరిస్తాయి’. ప్రాపంచిక విషయాలు, సుఖాలు శాశ్వతం కావని తెలుసుకొని, వాటిని పరిత్యజించడం, మరల మరల భోగాలపట్ల కోరిక కలుగకుండా ఉండటమే ‘వైరాగ్యం’. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ‘సత్యలోకాధిపత్యం లభిస్తుందన్నా కూడా దానిపట్ల ఆసక్తి లేకపోవడమే’ నిజమైన వైరాగ్యం. శరీరం మొదలైన వాటిపట్ల ‘నేను’ అనే భావమే ‘అహంకారం’. భార్య లేదా భర్త, పిల్లలు, భౌతిక సంపదలు మొదలైన వాటిపట్లగల ఆసక్తియే ‘మమకారం’. ఈ ‘అహంకార, మమకారాలే’ దుఃఖానికి కారణం. ఎక్కడ నివసిస్తే అదే ఇల్లు, దేనివల్ల జీవనం గడుస్తుందో అదే భోజనం. మోక్షాన్ని కలిగించేదే జ్ఞానం. ‘కూటస్తుడైన పరమాత్మయే నిత్యమూ, సత్యమూ’ అని, ‘అహంకారాదులు మిథ్య’ అని తెలుసుకోవడమే ‘బోధ’ (జ్ఞానం). ‘వివేకం లేని దశలో శరీరం వంటివాటిపట్ల ‘నేను’ అనే భావన ఎంత దృఢంగా ఉంటుందో అంతేస్థాయిలో ‘ఆత్మస్వరూపాన్ని నేనే’ అనే స్థిరనిశ్చయాన్ని కలిగి ఉండటమే ‘ఆత్మజ్ఞానం’.

సత్యం (ఋజువర్తన), అహింస, అస్తేయం (దొంగతనం లేకుండుట), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరులనుండి ఏదీ ఆశించక, స్వీకరించక పోవడం) అనే అయిదింటిని ‘యమములు’ అంటారు. తపస్సు, సంతోషం, శౌచం (శారీరక, మానసిక శుభ్రత- బాహ్యాంతర ఇంద్రియాల నిరోధం), స్వాధ్యాయం (శాస్త్రజ్ఞానం పొందడం), ఈశ్వర ప్రణిదానం (ఈశ్వరునిపట్ల శరణాగతిని కలిగి ఉండటం) అనేవి అయిదు ‘నియమాలు’. ఈ ‘యమ-నియమాల’ను ఆచరిస్తూ, మనస్సును విషయాలనుండి ఉపసంహరింపజేసి, చిత్తంలో పరమాత్మను నిలిపి, ‘గాఢనిద్రలో ఏ వ్యవహారాలూ లేకుండా ఎలాగైతే ఉంటామో అలా’ ప్రాపంచిక విషయాలన్నిటినీ తొలగించుకొని, లోకవ్యవహారాలలో జోక్యం లేకుండా ఉండటమే ‘ఉపరతి’. వైరాగ్యం, ఉపరతి లేకున్నా బోధవల్ల మోక్షం కలుగవచ్చు. కానీ, ప్రారబ్ధదుఃఖం నశించదు. అలాగే, వైరాగ్యం, ఉపరతి ఉన్నా బోధ లేకపోతే మోక్షం కలుగదు.

- Advertisement -

మరల మరల జన్మించవలసి ఉంటుంది. అందువల్ల, ప్రారబ్ధదుఃఖం నశించి మోక్షం కలుగడానికి ఈ మూడు (వైరాగ్యం, బోధ, ఉపరతులు) పరస్పరం సహాయపడుతాయని తెలుసుకోవాలి. మనస్సే మోక్షానికి, బంధానికి కారణం. కనుక, మోక్షం కోరుకొనేవారు మొదట బుద్ధిని ఉపయోగించి, మనస్సును జయించడానికి ప్రయత్నించాలి. అయితే, మనస్సు వాయువువలె చంచలమైందేకాక బలమైంది కూడా. అందువల్ల మనస్సును నియంత్రించ డానికి ఎల్లవేళలా ప్రయత్నించాలి. ఇందుకు ‘అభ్యాస వైరాగ్యాలే మార్గాలు’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేశాడు. మోక్షాపేక్ష కలవాడు శుద్ధమనోమయుడు కావాలి. అందుకు, మనస్సును పరమాత్మపట్ల లగ్నం చేయాలి. వివేకబుద్ధితో పంచభూతాలు, మనస్సు మొదలైనవాటి సూక్ష్మతత్తాలను జాగరూకతతో తెలుసుకొని, వాటినుండి వైరాగ్యం పొందాలి. ఆసక్తిని పరిత్యజించి క్రోధాన్ని జయించాలి.

యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా॥
-భగవద్గీత (6.17)

‘ఆహారం, విహారాలలో, కర్మాచరణలో, జాగ్రత్‌ సప్నావస్థలలో తగిన రీతిలో ప్రవర్తించేవానికి దుఃఖాన్ని తొలగించుకొనే యోగం సిద్ధిస్తుంది’. మితాహారం తో జితేంద్రియుడై, వాక్దండం (వాక్కు నియంత్రణ)తోపాటు కర్మ, మనోదండా లను ధరించాలి. అంటే, మనోవాక్కర్మలను నియంత్రించుకోగలగాలి. ఏమరుపాటు లేనివాడు, పవిత్రుడు (నిర్మల మనస్కుడు), ఏకాంతప్రేమి అయిన మహాత్ములే ఈ యోగాన్ని పొందగలరు. ‘బంగారాన్ని అగ్నిలో పునీతం’ చేయడం వల్ల కాలుష్యం(దోషం) తొలగిపోయి అది స్వచ్ఛంగా మారినట్లు, ప్రయత్నశీలుడైన ముముక్షువు ఈ యోగాగ్నిలో తపించబడి శుద్ధుడైనప్పుడే బ్రహ్మతో ఏకత్వాన్ని పొందగలడు.

-దోర్బల కుమారస్వామి ,94400 49608

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు
జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు
జ్ఞాన వైరాగ్యాలే సోపానాలు

ట్రెండింగ్‌

Advertisement