హరేకృష్ణ సంకీర్తనోద్యమ పితామహుడు శ్రీ చైతన్య మహాప్రభువు
‘గౌరాంగుడు’గా సుప్రసిద్ధులైన శ్రీ చైతన్య మహాప్రభువు ఆవిర్భావ తిథి ‘గౌరపూర్ణిమ’. ఈ సందర్భంగా కలియుగంలో భక్తి శకానికి నాంది పలికిన ఆ సంకీర్తనామృతాన్ని ఆస్వాదిద్దాం.
సెయ్ ద్వారే ఆచండాలే కీర్తన సంచారే
నామ-ప్రేమ-మాలా-గాంతి పరాయ్ల సంసారే ॥
బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయానికి చెందిన సాధు మహాత్ములలో ఒకరైన శ్రీచైతన్య మహాప్రభువులవారు సుమారు 500 సంవత్సరాల క్రితం యుగధర్మమైన ‘హరినామ సంకీర్తనోద్యమాన్ని’ ఆవిష్కరించారు. పలువురు భక్తులు శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తూ శ్రీకృష్ణుడేనని కూడా విశ్వసిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభువులవారు పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా మాయాపూర్‌లో జన్మించారు. సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించిన పిదప సంకీర్తనోద్యమ ప్రచార నిమిత్తం భారతావని అంతటా విస్తృతంగా సంచరించారు.
హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు, శ్రీ చైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమాన్ని గురించి ఈ విధంగా వివరించారు: ‘సంకీర్తన’ అంటే ‘సత్సంగం’. పలువురు వ్యక్తులు చేసే కీర్తనను ‘సంకీర్తన’ అంటారు. ఒక్కరే చేసేది కీర్తన. ‘బహు’ అంటే ‘ఎంతోమంది కలిసి’ అని అర్థం. అదే శ్రీ చైతన్య మహాప్రభువుల ఆశయం కూడా. ప్రజలంతా కలిసి సంకీర్తన గావించడం.
శ్రీ చైతన్య మహాప్రభువులవారు ఒక గొప్ప సన్న్యాసిగా, సంఘసంస్కర్తగా, ఆధ్యాత్మిక ఆచార్యునిగా, భక్తి-యోగ ప్రచారకునిగా, పవిత్రమైన కృష్ణనామ సంకీర్తనను వ్యాపింపజేసిన వారిగా పేర్కొనబడ్డారు. ‘జన్మ సార్థక కరి కరో పరోపకార్. సంకీర్తనంతో మీ జీవితాన్ని సార్థక పరచుకొని, తోటివారికి ఉపకారం గావించు’. ఇదే మహాప్రభువుల ఆశయం. పవిత్రమైన శ్రీహరి నామాలతోకూడిన సంకీర్తనామృతాన్ని తోటివారికి అందించండి. ఇదే శ్రీచైతన్య మహాప్రభువులవారి సంకీర్తనోద్యమ ఆశయం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
వారు తమ సంకీర్తనోద్యమాన్ని సమాజంలో అంటరానివారిగా పరిగణించబడేవారిలోనూ ప్రచారం చేశారు. కుల, మత, వర్ణ భేదాలను తిరస్కరించి ఆధ్యాత్మిక సోదరభావాన్ని ఆయన పెంపొందించారు. అందరికీ తండ్రి భగవంతుడే అయినప్పుడు భగవన్నామాన్ని జపించేందుకు అందరూ అర్హులే. నామ సంకీర్తనంతో ఎవ్వరైనా భగవంతుని సన్నిధానాన్ని చేరవచ్చు. ఆ సంకీర్తనామృతాన్ని ఆస్వాదిస్తూ, జన్మను సార్థకం చేసుకోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984