సకల చరాచర సృష్టికి మూలమైన అనంత శక్తిని ఆనంద విభూతికి ప్రతీకగా చెప్తారు. దేని నుంచి జనించారో దానిలో లయం కావడం సాధకుల అంతిమ లక్ష్యం. అన్నిటా ఉన్నతమైన యోగ మార్గంలో ఆదిశక్తి తత్త్వాన్ని తెలుసుకొని ఆ సాక్షాత్కారం పొందినవాడు యోగి. యోగ సాధనలో సాధకులు అన్ని వికారాలకు దూరంగా నిశ్చలస్థితిలో ‘పర్వతం’లాగా ఉండిపోతారు. శివుడు సాధించిందీ ఈ స్థితినే. శివుని ఆవాసం కైలాసం అనడంలోని అంతరార్థం ఇదే. అలాంటి స్థితిని పొందేందుకు సాధకునికి అనువైన సమయం ‘మహా శివరాత్రి’.
ఆధ్యాత్మిక ప్రగతిని, సుగతినీ సమన్వయం చేస్తూ, రెంటినీ సాధించేందుకు ఈ పర్వదినం గొప్ప శక్తివంతమైన దివ్య మార్గాన్ని చూపుతుంది. ‘మహా శివరాత్రి’ రోజున మానవులలో నిక్షిప్తమైన భగవచ్ఛక్తి ఉత్తేజితమై ఊర్ధ్వముఖ ప్రయాణానికి సన్నద్ధమవుతుందని యోగులు నమ్ముతారు. ‘శివం’ అంటే అంతటా వ్యాపించిన చైతన్యం, ప్రేమ, శాశ్వతానందం లేదా ముక్తి. ఈ విభూతిని ఇచ్చేవాడు శివుడు. సృష్టి సమస్తమూ శూన్యం నుంచే వస్తుంది, శూన్యంలోకే వెళుతుంది. ఆ శూన్యమే ‘కాలాతీతుడైన శివుడు’. పదార్థం ఉన్నచోట కాలానికి చెందిన భావన ఉంటుంది. పదార్థమూ, శూన్యమూ రెండూ పరస్పర ఆలంబనాలు. పదార్థం లేకుండా కాలం గురించిన భావన ఉండదు. నిజానికి అనుభవం కోసం కాలం సృజించబడింది. అందువల్ల, ఎక్కడ అనుభవం ఉండదో అక్కడ కాలం ఉండదు. మన పుట్టుక నుంచి మరణం వరకు అంతా అనుభవమే కాబట్టి, అదే కాలాన్ని నిర్ణయించేది. అది లేకపోతే కాలం లేదు. అనుభవానికి అతీతమైన వాడు కాబట్టి, కాలాతీతుడు శివుడు.
‘యోగ’ పరిభాషలో శివుడొక ఆది యోగి. తన నిరంతర యోగసాధనలో శివుడు ఒక నిశ్చల స్థితికి చేరిన రోజు ఈ ‘మహా శివరాత్రి’. ఈ స్థితిలో విజ్ఞానం అతని నుంచి ప్రవహించింది. ఆ విజ్ఞానమే తెలివి, వివేకం లేదా యెఱుక. అది శివునిలో జనించి నిరంతర వాహినిగా ఆర్తులైన, జిజ్ఞాసువులైన వారి దాహార్తిని తీర్చేందుకు అమృత ఝరియై ప్రవహించింది. సత్యమైన శివ చైతన్యం సుందరమై చేతనగా మారి, ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి జాలువారింది. అదే ‘గంగావతరణం’. అలా కిందికి జారడం ఆధ్యాత్మిక ధర్మం. శివరాత్రి గాఢ రాత్రి. అన్నిటినీ తనలో ‘లయం’ చేసుకొనే రాత్రి. లయకారుడైన శివుడు ఆనందమయుడై, నిశ్చలుడై, ‘తెలిసిన’వాడై, ‘యెఱుక‘ గలిగినవాడై, నిరామయుడై నిలిచిన రాత్రి ఇది. అహంకారాది గుణాలకు దూరంగా నిర్మలమైన మనస్సుతో సర్వశక్తియుతుడూ, అంతటా వ్యాపించినవాడు, సకలమూ చూడగలిగినవాడు అయిన ఆ భగవంతుడిని ఉపాసించి ఆనందానుభవాన్ని పొందమని చెప్పేదే ఈ పండుగ నాటి విశిష్ట సమయం.
సాధన చేసే సాధకుల కర్మ ఫలితాలను లయం చేసి ముక్తిని ఇచ్చేవాడు శివుడు. శివునిది అర్ధనారీశ్వర తత్త్వం. దేహంలో సగం పార్వతిది కాగా మిగిలిన సగభాగం తనది. ఆదర్శవంతమై, ధర్మబద్ధమైన దాంపత్య జీవితానికి ఇదొక ప్రతీక. సాధారణంగా ప్రతి ఒక్కరిలో స్త్రీ-పురుష శక్తులు రెండూ ఉంటాయి. పురుష శక్తి సృజనాత్మతకు, స్త్రీ శక్తి అంగీకృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ రెంటినీ సమన్వయం చేసుకొని జీవితాన్ని ఆస్వాదించమని బోధించేదే ‘అర్ధనారీశ్వర తత్తం’.
-పాలకుర్తి రామమూర్తి