e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News అహంకారమే పతనానికి నాంది!

అహంకారమే పతనానికి నాంది!

ఆధ్యాత్మిక సాధనలో ఉండకూడనిది అహంకారం. ఎంతటి సాధకుడైనా అహంకారం అనే మిషతో గర్వపడితే తగిన ఫలితాన్ని పొందలేడు. ‘నేను’ అందరికన్నా గొప్ప, నాతో సమానమైనవారు ఎవరూ లేరు అనుకున్న నాడు అన్నిరోజుల సాధనా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక జపం ఎంతచేసినా హృదయ శుద్ధి లేకపోతే ఫలితం శూన్యం. చెప్పుకోవడానికి తప్ప ఆత్మశుద్ధి లేని ఆరాధనలు దైవాన్ని చేరవు. అహంకారంతో సాధకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను చేయగలను అనుకోవడంలో తప్పులేదు. నేను మాత్రమే చేయగలను, మరెవ్వరూ చేయలేరు అనుకుంటే మాత్రం ప్రమాదమే! భగవంతుడి దయ వల్ల నేను ఈ పనిని చేయగలిగాను అనుకోవడం ఉత్తమం. అలాకాకుండా ‘నేను’ అనే భావనలో కూరుకుపోయాడా.. అహంకారం ఆ వ్యక్తిని పతనం వైపు నడిపిస్తుంది.

కుడిచేతితో చేసిన దానం ఎడమచేతికి తెలియకూడదంటారు పెద్దలు. గొప్ప కోసం దానాలు చేస్తుంటారు చాలామంది. శిలాఫలకంపై పేరు కోసం, పదుగురిలో మెప్పు కోసం విరాళాలు ప్రకటిస్తుంటారు. ఈ దానాలన్నీ తనలోని ‘నేను’ను సంతృప్తిపరచడానికి చేసేవే! అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని అంటారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది యయాతి కథ. యయాతి తపోనిష్ఠ, దానధర్మాలు ఆయనకు ఇంద్ర పదవిని కట్టబెట్టాయి. ఆయనను ఇంద్రసభకు తీసుకువెళ్లడానికి సప్తర్షులు వచ్చారు. పల్లకీలో కూర్చున్నాడు యయాతి. సప్తర్షులు పల్లకిని మోస్తూ కదిలారు. అప్పటివరకు ధార్మికంగా ఉన్న యయాతిలో అహంకారం మొదలైంది. నా అంతవాడు మరెవరూ లేరనుకున్నాడు. సప్తర్షుల కన్నా తానే గొప్పవాడినన్న భ్రమ కలిగింది. విచక్షణ కోల్పోయాడు. అప్పటివరకు తను చేసిన దానాల గురించి, యజ్ఞాల గురించి సప్తర్షులకు గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. దాంతో స్వర్గానికి చేరుకోవడానికి ముందే యయాతి పల్లకి నుంచి కింద పడిపోయాడు. అతనికి ఇంద్ర పదవి అందని ద్రాక్షే అయింది. చేసిన పాపం చెప్పుకొని పశ్చాత్తాపం చెందితే పాపం పరిహారమవుతుంది. అదే పుణ్యం చెప్పుకొంటే పుణ్యం కాస్తా కరిగిపోతుంది.

- Advertisement -

అహంకారం కారణంగానే హిరణ్యకశిపుడు, రావణుడు వంటివాళ్లు అధోగతిపాలయ్యారు. రావణుడు మహా శివభక్తుడు. అహంకారాన్ని జయించగలిగితే భక్తాగ్రేసరుడు అయ్యేవాడు. కఠోర తపస్సుతో బ్రహ్మ నుంచి వరాలు పొందిన హిరణ్యకశిపుడూ అంతే! అహంకారంతో ‘నన్నే సేవించాలి, నన్నే పూజించాలి..’ అని అనకపోయి ఉంటే లోకానికి ఆదర్శమై ఉండేవాడు. అందుకే, వ్యక్తి ఎంతటి శక్తిమంతుడైనా, ఎన్ని దానధర్మాలు చేసినా, ఎంతటి సాధకుడైనా అహంకారమనే మాయలో పడకుండా జాగ్రత్తపడాలి. అహంకార భావనలు మనసును విషతుల్యం చేస్తాయి. అందుకే ‘నేను’ అనే చట్రంలోంచి బయటపడితేనే ఆధ్యాత్మిక సాధన రాణిస్తుంది. దైవానికి కావాల్సింది నిర్మలమైన భక్తి. అంతేకానీ, గొప్పలు కాదు, పటాటోపాలు అంతకన్నా కాదు. ప్రశాంత చిత్తంతో రామనామం మూడుసార్లు పలికినా ముక్తిని ప్రసాదించగలడు. నిండు మనసుతో తిన్నడు సమర్పించిన మాంసాన్ని శివుడు స్వీకరించిన కథ తెలిసిందే కదా!

పసితనంలో ఎవ్వరిలోనూ ప్రత్యేకంగా అహంకారం అనేది ఉండదు. వయసు పెరిగే కొద్దీ మనిషిలో అహంకారం అంకురించి, అభివృద్ధి చెందుతుంది. శరీరంపై ఆత్మ మమకారం పెంచుకోవడమే అహంకారానికి కారణం. అదే దేహ భ్రాంతిని దూరం చేసుకొని అంతా నా వాళ్లే, అంతటా ఉన్నది భగవంతుడి చైతన్యమే అనుకున్నప్పుడే ఎవరికైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది. మోక్షానికి ద్వారాలు తెరుచుకుంటాయి. రామకృష్ణ పరమహంస అన్నట్లు జీవుణ్ని, దేవుణ్ని వేరుచేసేది అహంకారమే. ఒక్కసారి అహాన్ని దూరం చేసుకుంటే జీవుడే దేవుడవుతాడు. అందుకే పరమహంస చెప్పిన మార్గాన్ని అనుసరించడమే మానవాళికి ఎప్పటికీ శ్రేయోదాయకం. శిరోధార్యం.

కనుమ ఎల్లారెడ్డి
93915 23027

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement