e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home చింతన సాలగ్రామ నృసింహుడు తిరునామాల మత్స్యేంద్రుడు

సాలగ్రామ నృసింహుడు తిరునామాల మత్స్యేంద్రుడు

ఉగ్ర నరసింహుడు సాలగ్రామ రూపంలో కొలువైన నెలవు. నారాయణుడి నమ్మిన బంట్లలా… సహజ తిరునామాలు ధరించిన చేపలు దర్శనమిచ్చే గిరి.. మత్స్యగిరి. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న యాదాద్రికి సమీపంలోనే ఉన్న మహిమాన్విత తీర్థమిది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండపై వెలసిన మత్స్యగిరి నరసింహుడి లీలా విలాసం చదివేయండి.

చుట్టూ కొండలు, జలధారలు.. పచ్చని పంటపొలాలు.. ఇలా ప్రకృతి సౌందర్యంతో దర్శనమిస్తుంది మత్స్యగిరి. అడుగడుగునా ఆధ్యాత్మికత కలబోసుకున్న ఈ కొండపై లక్ష్మీ నృసింహుడు స్వయంభువుగా వెలిశాడు. కృతయుగంలో కొందరు రుషులు తపస్సు చేసుకునేందుకు ఈ ప్రదేశానికి వచ్చారట. అయితే, వారి సాధనకు దుష్టశక్తులు విఘాతం కలిగించాయట. మునులు నరసింహుడిని శరణు వేడగా.. భీకర గర్జనలు చేస్తూ స్వామి ప్రత్యక్షమయ్యాడట. ఆ గర్జనలకు మత్స్యగిరి మూడు ముఖాలుగా, మూడు గుండాలుగా చీలిపోయిందట. మరోవైపు స్వామి రాకతో దుష్టశక్తులు పలాయనం చిత్తగించాయి. మునులంతా స్తుతించడంతో.. ఉగ్ర నరసింహుడు శాంతించి అక్కడే సాలగ్రామ రూపంలో వెలిశాడని స్థల పురాణం. మునులు తపస్సు చేసిన మత్స్యగిరిని వేములకొండగానూ పిలుస్తారు.

- Advertisement -

మాయా మత్స్యాలు పేరుకు తగ్గట్టే మత్స్య
గిరిపై వింత చేపలు దర్శనమిస్తాయి. ఇక్కడి కుండం ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతూ ఉంటుంది. నారసింహుడి పాదాల నుంచి ప్రవహించిన జలంతో ఈ పుష్కరిణి ఏర్పడిందని చెబుతారు. ఈ కుండంలోనే వింత చేపలు ఉంటాయి. వీటి తలమీద ఎవరో తీర్చిదిద్దినట్టు తిరునామాలు కనిపిస్తాయి. చేపలకు మీసాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ అరుదైన మత్స్యాలను స్వామివారి ప్రతినిధులుగా భావిస్తారు. నైవేద్యంగా పెరుగు సమర్పిస్తారు. కుండంలోని నీటిని తీర్థంగా తీసుకుంటే గ్రహదోషాలు పోతాయని నమ్మిక. ఈ నీటిని పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారు.

ఆలయానికి కొత్త శోభ
చినజీయర్‌ స్వామి ఆలోచనలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కొండపైకి దారి వేశారు. దాతల సహకారంతో ముఖ మంటపం, గోదాదేవి ఆలయం, సత్యనారాయణ వ్రత మంటపం, యాగశాల, ప్రసాద విక్రయశాల నిర్మించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి 56 అడుగుల ఎత్తయిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఘాట్‌ రోడ్డులో శివాలయం, సీతారామచంద్రస్వామి ఆలయం ఉన్నాయి. భక్తుల కోసం ఆలయ కమిటీ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నది. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. వారాంతాల్లో సందడి ఎక్కువ.

అభయ వృక్షం
శని, ఆదివారాల్లో మత్స్యగిరి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ. శ్రావణ, భాద్రపద, కార్తిక మాసాల్లో నిత్యం వందలమంది భక్తులు వస్తుంటారు. రోజూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మొదలు బహుళ విదియ వరకు ఐదు రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ఆవరణలోని రావిచెట్టును అభయ వృక్షమని పిలుస్తారు. సంతానం లేని దంపతులు కుండంలో స్నానం చేసి అభయ వృక్షానికి కొబ్బరికాయతో ముడుపు కడితే పిల్లలు కలుగుతారని విశ్వాసం.

-గంజి ప్రదీప్‌కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement