e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home చింతన సర్వాద్భుతం.. స్తంభోద్భవుని దివ్య చరితం

సర్వాద్భుతం.. స్తంభోద్భవుని దివ్య చరితం

నమో నారసింహా!

ఏతద్య ఆదిపురుషస్య మృగేన్ద్ర లీలాం

దైత్యేన్ద్రయూథ పవధం ప్రయతః పఠేత

దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం

శ్రుత్వాను భావమకుతో భయమేతి లోకమ్‌ ॥

– శ్రీమద్భాగవతం (7.10.47)

సర్వాద్భుతం.. స్తంభోద్భవుని దివ్య చరితం

‘భక్తాగ్రేసరులలో ప్రహ్లాదుడు ఉత్తముడు. ప్రహ్లాద వైభవాన్ని, దైత్యేంద్రుడైన హిరణ్య కశిపుని వధలీలను, ఆదిపురుషుని దివ్యచరితను అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరు పఠిస్తారో, ఎవరు వింటారో వారు ఎక్కడా, ఏ ఆపదా లేని ఆధ్యాత్మిక జగత్తును తప్పక చేరగలరు’. ఆదిపురుషుడంటే దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు. ఆయనే ‘మృగేంద్ర లీల’ను చాటాడు. మృగరాజు సింహం కనుక, ఈ నరసింహ లీలకే ‘మృగేంద్ర లీల’ అనికూడా పేరు. భక్తుల హృదయాలను రంజిల్లింపజేసే సర్వాద్భుతమైంది ‘శ్రీ నృసింహ లీల’. 

భగవంతుడు అత్యంత తెలివిపరుడు. హిరణ్య కశిపుడు తన తెలివితేటలతో మృత్యువును జయించాలని తలచినా, భగవంతుడు అంతకు మించిన తెలివితో తగిన రూపాన్ని ధరించాడు. హిరణ్య కశిపుని పాలిట మృత్యువై నిలిచాడు. భగవంతుణ్ణి ఎందులోనూ, ఎవ్వరూ జయింపజాలరు. తానే సర్వోన్నతుడు. భగవంతుడు సైతం క్రోధాన్ని కలిగుండటం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే, సర్వోన్నతమైన శక్తికీ ఒక రూపం వుంటుంది. అది సమస్త భావాలకూ నిలయం. ఏ నేరమూ ఎరుగని తన భక్తుడైన ప్రహ్లాదుడి పట్ల కిరాతకంగా వ్యవహరించినందుకే భగవంతుడు కోపోద్రిక్తుడయ్యాడు. మానవులంతా ఆ పురుషోత్తముని అంశలే. కనుకే, కొందరిలోనూ ఆ భావాలు కనిపిస్తుంటాయి. ఆ క్రోధం దుష్పరిణామాలకు హేతువు కాకూడదు. కానీ, భగవంతుని క్రోధం ఆరాధనీయం. 

నరసింహుని దివ్య ఆవిర్భావాన్ని గురించి ‘శ్రీమద్భాగవతం’ అద్భుతంగా వర్ణించింది. తన సేవకుడైన ప్రహ్లాదుడు పలికిన మాట వాస్తవమని నిరూపించేందుకు, భగవంతుడు సర్వాంతర్యామి అని, రాజప్రాసాదంలోని స్తంభంలోనూ తానున్నానని నిరూపించేందుకే ఆ దేవదేవుడైన శ్రీహరి ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని సర్వాద్భుత రూపాన్ని ధరించి వచ్చాడు. ఇటు నరరూపమూకాని, అటు సింహరూపమూకాని మహాద్భుత నరసింహరూపంతో అవతరించాడు. ఈ నరసింహుడే దుష్టులైన శత్రువులచే పొంచి వున్న ఆపదలనుండి తన భక్తులను సదా రక్షిస్తాడు. మానవులలోని దుష్టగుణాలను దూరం చేస్తాడు. పరమ పవిత్రమైన ఈ నృసింహ మంత్ర పఠనమే అందరికీ శ్రీరామరక్ష అవుతుంది.

ఓం నమో భగవతే నరసింహాయ 

నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర

కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా 

అభయమభయ మాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్‌ ॥

‘సమస్త శక్తికీ మూలమైన నృసింహ భగవానునికి ప్రణామాలు. ఓ స్వామీ! వజ్రాయుధం వంటి గోళ్లు-దంతాలతో మాలోని ప్రాపంచిక కర్మఫలాలను కాంక్షించు దుర్లక్షణాలను నశింపజేయి. మా హృదయంలో నెలకొన్న అజ్ఞానాన్ని పారద్రోలి, మమ్ములను అనుగ్రహించు. నీ కృపచే మేం ఈ భౌతిక జీవన పోరాటంలో నిర్భయత్వాన్ని పొందగలం’. 

శ్రీ లక్ష్మీ నృసింహస్వామికీ జై!

శ్రీ యాదాద్రి నృసింహ భగవానునికీ జై!!

-శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజి , 93969 56984

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్వాద్భుతం.. స్తంభోద్భవుని దివ్య చరితం

ట్రెండింగ్‌

Advertisement