e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home చింతన సర్ప బంధ విముక్తి

సర్ప బంధ విముక్తి

సర్ప బంధ విముక్తి

కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృత రసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తి మివ యః
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్‌ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా!

-ఆదిశంకరాచార్యులు (సౌందర్యలహరి:20)

- Advertisement -

‘కిరంతీం.. వర్షిస్తున్నాయి. ఏం వర్షిస్తున్నాయి? చంద్రకాంత శిలవంటి స్వఛ్ఛమైన, దివ్యమంగళ స్వరూపిణి అయిన అమ్మ సర్వాంగాలనుండి వచ్చే కాంతిమయ కిరణాల సమూహం. ఆ కాంతిమయ కిరణ సమూహాలే అమృతధారలు. అమ్మా! అలాంటి నిన్ను హృదయంలో ప్రతిష్ఠించుకొని, నీ సర్వాంగాల నుండి అమృతధారలు జలధారలవలె కురుస్తున్నాయి. ఈ భావనతో ఏ సాధకుడైతే ధ్యానిస్తాడో, అతనికి ఎలాగైతే గరుత్మంతుడు విషసర్పాల దర్పాన్ని హరిస్తాడో అలాగే తనలోని ఐహిక భావనా దర్పం హరింపబడుతుంది. అంతేకాదు, అమృతధారల వంటి ఆ సాధకుని ఆత్మీయచూపులతో జ్వరపీడితులకు స్వస్థత కలుగుతుందనీ అంటారు శంకరులు. నిజానికి అమ్మవారి దర్శనమే అమృతమయం.

‘హిమకరుడు’ అంటే ‘చంద్రుడు’. ‘హిమకర శిలామూర్తి’ అంటే ‘చంద్రకాంత శిలావిగ్రహం వలె స్వచ్చమైన తెలుపు రంగు కలది’. చంద్రకాంత శిలలు వెన్నెలవలె తెలుపురంగులో ప్రకాశిస్తూ కాంతిని వెదజల్లుతూ ఉంటాయంటా రు. ఇక ‘చంద్రుడి వెన్నెలలు అమృత సమానం’ అంటారు. దానితో అమ్మ చంద్రకాంత శిలాప్రతిమవలె అమృత సమానమైన, ఆహ్లాదకరమైన కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఈ శ్లోకంలో ‘శకుంతాధిప’ అన్నారు శంకరులు. అంటే, పక్షులకు రాజు గరుత్మంతుడు (వైనతేయుడు). ఈ గరుత్మంతునికి సర్పాలే ఆభరణాలు. అమ్మవారిని ఆరు నెలల కాలం ధ్యానిస్తే గరుత్మంతునితో సమానమైన శక్తి సామర్థ్యాలు వస్తాయంటారు. ‘షణ్మాస ధ్యానయోగేన జాయతే గరుడోపమ’ అంటుంది ‘చతుశ్శతి’. అమ్మవారిని చంద్రకాంత శిలామూర్తిగా భావించి ధ్యానించిన సాధకుడు విషజ్వరాలనైనా తగ్గించగలుగుతాడు. ‘పాములు భూకుహరం (పాతాళం)లో నివసించినట్లు కామాది వికారాలచేత బంధితుడైనవాడు అధోగతి పాలవుతాడు’ అని సూచించడానికే ఈ పాముల ప్రసక్తి. ఈ పాములు ‘నిజం పాములు’ కావు. జ్వరాదులూ కావు. సంసారం అనేది ఒక సర్పబంధనం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు జ్వరాది పీడనాలు. అమృత ధారవంటి అమ్మ దయవల్ల భవభయాలనుంచి ఉపశమనం కలుగుతుంది.

లలితాదేవి ‘బంధమోచని’. అంటే, బంధాలను త్రెంచే తల్లి. బంధనాలు ఐహిక భావనా దర్పాలు. వాటిని ఆమె త్రుంచి వేస్తుంది. అంతేకాదు, ఆమె ‘సుధాసారాభివర్షిణి’ (లలితా సహస్రనామం). సర్వలోకాలపైనా తన అనుగ్రహమనే అమృతాన్ని వర్షించే తల్లి లలితాదేవి. ‘తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదాన చంద్రికా’ (లలితా సహస్రనామం). సాధకునిలోని మూడు విధాలైన తాపాలను హరించే సామర్థ్యం కలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. ఈ మూడు తాపాలే అధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం. వీటిని హరించి ఆనందాన్ని ఇవ్వగలిగిన అమ్మ పవిత్రమైన, ప్రశాంతమైన చంద్రకాంతి శిలలపై కూర్చున్నట్లుగా సాధకుడు భావించాలి. అమ్మ చరితలను వినడం, మహితాత్మ కమైన ఆమె రూపాన్ని మనసులో దర్శించి ధ్యానించడం వల్ల కర్మసంచయం భస్మమవుతుంది. దానితో ప్రశాంతమైన మనసు చాంచల్యతను వీడి అమ్మవారిలో లగ్నమవుతుంది.

ఆమె దయవల్ల చెవులు శుభాన్ని అందించే వాక్కులను మాత్రమే వినగలుగుతాయి. కనులు శుభప్రదమైన వాటినే చూడగలుగుతాయి. అందుకే, అమ్మను చంద్రకాంత శిలలపై కూర్చున్న తల్లిగా భావించి ధ్యానించాలనడం. ఈ భావన ఎంత బలీయమైతే అమ్మకు అంత దగ్గరగా మనం వెళ్లగలుగుతాం. ఏ సాధనలోనైనా సాధకునికి కొన్ని శక్తులు వస్తాయి. వాటిని ఉపయోగించే విధానంలో సంయమనాన్ని చూపగలిగితే మరింత ముందుకు వెళ్ళేందుకు అవి సహకరిస్తాయి. అలా కాక స్వార్థ భౌతిక ప్రయోజనాలను సాధించేందుకు ఉపయోగిస్తే పాములవలె అధోజగతికి దిగజారడం తథ్యం.

-పాలకుర్తి రామమూర్తి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్ప బంధ విముక్తి
సర్ప బంధ విముక్తి
సర్ప బంధ విముక్తి

ట్రెండింగ్‌

Advertisement