e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home కథలు యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తర్వాత, ఎన్నో మలుపులు. యుద్ధ రూపంలో ఓ తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది. అంతలోనే..

- Advertisement -

నమోస్తు వేదాంత వనైక సింహాః
నమోస్తు యోగీంద్ర గుహైక సింహాః
నమోస్తు భక్తాభయ దాన సింహాః
నమోస్తు యాదాచల నారసింహాః

నారాయణ, వరలక్ష్మి తాళపత్రాన్ని భక్తిగా కళ్లకద్దుకున్నారు.
“తాళపత్రంలో ఏమి రాసున్నదయ్యా?” ఏదో మహిమగల మంత్రమే ఉండొచ్చనుకుంటూ అడిగింది వరలక్ష్మి.
శ్లోకం చదివిన నారాయణ ఇలా వివరించాడు..
“వనంలో కొలువైన వేదవేద్యుడైన సింహుడు, గుహలో నెలవైన యోగీంద్ర సింహుడూ, భక్తులకు అభయదానం చేసే సింహుడూ అయిన యాదాచల నారసింహుడా.. నీకు అనేకానేక నమస్సులు”
అది వింటూ చప్పట్లు కొట్టాడు చెన్నయ్య. తడబడే అడుగులతో అమ్మ ఒడిని చేరే ఆ పసివాడికి ఏమి అర్థమయ్యిందో.. కిలకిలా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు.
అది చూసి నారాయణ పెదవులపైన చిరునవ్వు విరిసింది.
“ఎంత కాలమయ్యిందయ్యా.. నీ మొహంలో నవ్వు చూసి..” సంతోషపడింది వరలక్ష్మి.
“వీడికి ఏం అర్థమయ్యిందో కిలకిలా నవ్వుతున్నాడు. ఈ నరసింహ స్వామి తెలుసు. అవతార కథా తెలుసు. కానీ, యాదాచలం మహిమ ఎలా తెలుసుకొనేది?”
“తెలుసుకోవలసిన పనేముందయ్యా? యాదాచల స్వామి తనే పిలిపించుకుంటాడేమో?”
“అంతేలే.. స్వామి పిలిస్తేనే మనం వెళ్లగలం. తలిస్తేనే మరి మనకు స్వామివారి దర్శనానికి పిలుపు వస్తుందేమో..”
అయితే తాళపత్రంలో ఏమి రాసుందో, దాన్ని ఆచరించడానికి తగిన సమయం రావాలి అనుకొన్నాడు నారాయణ.
ఆ సమయం వెంటనే వస్తుందని ఊహించలేకపోయాడు.
శ్రీ లక్ష్మీనారసింహుడి లీలలు మహమహా పండితులకే అర్థంకావు. అటువంటిది నారాయణ, వరలక్ష్మి దంపతులకు అంత సులభంగా బోధపడతాయా?
అందుకే, యాదగిరీశుడైన శ్రీనారసింహుడు అద్భుతమైన నిదర్శనం చూపించాడు.


భువనగిరి కోట..
విశ్రాంతి ప్రాంగణంలో ఆలోచనామగ్నుడై ఉన్న త్రిభువనమల్లుని వద్దకు దళపతి వచ్చి, దూరంగా నిలబడ్డాడు. పరిచారిక ఏదో పానీయం ఉన్న పాత్రను పట్టుకొని వచ్చి, దళపతి పక్కన వినయంగా నిలబడింది. త్రిభువనుడు మనిషైతే ఈ లోకంలో ఉన్నాడు కానీ, మనసు ఇక్కడ లేదు. దీర్ఘాలోచలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన కనులముందు ఒక అద్భుత దృశ్యం కదలాడుతున్నది.
ఒక మహా నిర్మాణం జరుగుతున్న కొండపైన.. నారసింహుడి ఆలయ శిఖరం అతి పవిత్రంగా, సమున్నతంగా, అద్భుతంగా దర్శనమిస్తున్నది. శిలలు దొర్లుకుంటూ వచ్చి, వరుసలో పడుతున్నవి. ఎవరో మహాకాయుడు జాగ్రత్తగా వాటిని ఒకదానికొకటిగా నేరుగా పేరుస్తున్నట్టు!
శిలలు కొన్ని వెన్నలా మెత్తగా ఉన్నాయి. మరికొన్ని శిలలు రత్నాల్లా మెరిసిపోతున్నాయి.
ఎక్కణ్నుంచి వచ్చాయి ఈ శిలలు?
చూస్తుండగానే.. ఒక శిల్పి పరుగుపరుగున వచ్చాడు. శిలలను చేతుల్లోకి తీసుకొన్నాడు. ఉలిని తీసుకొని భక్తిశ్రద్ధలతో నమస్కరించాడు.
ఆ శిల్పి చేతుల్లో శిల త్వరత్వరగా కొత్త రూపును సంతరించుకొంటూ శిల్పంలా మారిపోతున్నది. ఓహ్‌.. ఏమి శిల్పకళా వైభవం!
ఒక్కొక్క శిల్పంలో ఏమి కళ?
దేవతలు దిగివచ్చి ఒకరొకరే శిలా రూపంలో ఇమిడిపోయి, కొలువు తీరారా..? అన్నంత సంతోషం కలిగింది.
త్రిభువనుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
ఆహా.. కనుల ముందే ఆలయం నిర్మితమవుతున్నదే! ఒక్కొక్క శిల్పం.. శిల్పమా.. అదికాదు. ఒక్కొక్క సజీవ మూర్తి అన్నట్టుగా కనిపిస్తున్నదే!
ఏమి మాయ ఇది?
శ్రీలక్ష్మీ నారసింహుని మాయ ఇది. ఊహలో కనిపించేది భూమిపైన సాక్షాత్కరిస్తున్నది.
“ప్రభూ! ప్రభూ!” దళపతి పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చాడు.
ఎక్కడున్నాడు తను? తనకు కనిపించింది ఏ దివ్యదేశమో కాదు కదా!
దళపతి పిలుపుతో ఆలోచనల గొలుసు తెగిపోయింది.
కనులు తెరిచి చూశాడు.
“ప్రభూ! మన్నించండి! ఎవరో మీకు ఈ పానీయం పంపించారు. వారు బాగా తెలిసినవారేనట? పవిత్రమైన పానీయమట?”
‘ఎవరై ఉంటారు?’ ఎవరో స్ఫురించలేదు.
“సరే ఇలా ఇవ్వు..” అంటూ ఆ పానీయం ఉన్న పాత్రను అందుకొన్నాడు. కనులు మూసుకొని స్వామిని స్మరించాడు.
దళపతి.. పానీయం తెచ్చిన యువతి ఒకరినొకరు చూసుకొని నవ్వుకొన్నారు.
పానీయం ఉన్న పాత్రను చూశాడు త్రిభువనుడు. తెల్లగా కనిపిస్తున్న పాలు..
“పాలను తీసుకొచ్చి పానీయమంటున్నారేమిటి?” నవ్వుతూ అడిగాడు త్రిభువనుడు.
“సాధువొకాయన వచ్చి.. ‘ఈ పవిత్ర పానీయాన్ని ప్రభువులవారిని స్వయంగా కలిసి ఇవ్వండి. మరొకరి స్పర్ష తగిలితే, దీని పవిత్రత పోతుంది..’ అని చెప్పి, మాకు ఇచ్చి వెళ్లిపోయారు ప్రభూ!” చెప్పిందా పరిచారిక.
త్రిభువనమల్లుడు ఆ పానీయాన్ని తాగబోతూ.. అందులో ఉన్న పాలకేసి చూశాడు.
‘బహుశా.. రాజవైద్యులవారే పంపించి ఉంటారు. నేరుగా ఔషధమిస్తే నేను స్వీకరించడం లేదని ఇలా పంపించారేమో!’ అనుకొంటూ.. ఆ పానీయాన్ని తాగబోతుండగా..
ఎక్కడినుంచో ఓ చురకత్తి వేగంగా వచ్చి త్రిభువనుడి చేతిలోని పాత్రకు ‘ఖణేల్‌’ మంటూ తగిలింది.
దీంతో పాత్ర కిందపడి, అందులో ఉన్న పాలు.. నేలపాలు అయ్యాయి.
అదికాదు విశేషం..
తెల్లగా ఉన్న పాలు.. క్రమంగా నీలి రంగులోకి మారుతున్నాయి.
త్రిభువనుడు వెంటనే తేరుకొన్నాడు.
చురకత్తి విసిరిన వ్యక్తి ముందుకొచ్చాడు.
“ప్రభువులు మన్నించాలి” అంటూ వినయంగా ప్రణామం చేశాడు.
ఆ వ్యక్తి ఎవరో కాదు.. తన ఆత్మీయుడు విద్యాపతి!
“విద్యాపతీ! ఏమి జరుగుతున్నదిక్కడ?”
త్రిభువనమల్లుని మాట పూర్తికాకుండానే.. ఆ పరిచారిక పక్కనే ఉన్న దళపతి, తన ఒరలోనుండి సర్రున కత్తిని బైటికి లాగాడు.
ఆ కత్తి మొన త్రిభువనమల్లుని కంఠాన్ని తాకేలోపునే..
మెరుపు వేగంతో విద్యాపతి, తన కత్తితో దాన్ని ఎగరగొట్టాడు.
ఇక ఆ యువతికీ, ద్రోహి దళపతికీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, పరుగుపరుగున వచ్చిన సాయుధ భటులు వారిద్దరినీ చుట్టుముట్టి బంధించారు. ఇది ఏమాత్రం ఊహించని ఆ ద్రోహులిద్దరూ తలలు నేలకు వేసుకొన్నారు.
“ఎవరు మీరు? ఏమిటిదంతా?” కోపంగా అడిగాడు త్రిభువనుడు.
“నేను చెప్తాను ప్రభూ! మీరు దయామయులు. శరణుకోరి ఎవరు మీ వద్దకు వచ్చినా.. ఆ వ్యక్తి శత్రువా, మిత్రుడా అని చూడకుండా వారు కోరింది ఇస్తుంటారు. మీ మిత్రుడు జగద్దేవరాజును మీరు సింహాసనంపైన కూర్చుండబెట్టారు. అతని మీదికి దండెత్తి వచ్చిన శత్రురాజులందర్నీ మీరు తరిమికొట్టారు. కానీ, జగద్దేవుని తమ్ముడు నరవర్మ మీకు తెలుసు..”
విద్యాపతి మాటలకు అడ్డొస్తూ అన్నాడు త్రిభువనుడు..
“మిత్రమా విద్యాపతి.. నరవర్మ నాకెందుకు తెలియదు. నేను నారసింహక్షేత్రమైన యాదాద్రి కొండమీద ఉన్నప్పుడు సైన్యంతో వచ్చి నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. సింహదేవుడి దయవల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ నరవర్మకూ, ఈ ద్రోహులకూ ఏమిటి సంబంధం?”
“వాడే ఇక్కడికి పంపించాడు ప్రభూ! తమ ప్రాణాలు తీయడానికి కుట్ర చేశాడు. మీ అడ్డు తొలగిపోతే.. మీ అండతో సింహాసనం అదిష్ఠించిన అన్నను కూలదోసి, తానే రాజు కావాలని అతగాడి ఆలోచన..” చెప్పాడు విద్యాపతి.
“అది విఫలమయ్యింది కదా?”
“అవును ప్రభూ! మేమంతా అప్రమత్తంగా ఉండబట్టి..”
సాయుధ భటుల అధికారి అన్నాడు వినయంగా..
పెద్దగా నవ్వాడు త్రిభువనుడు.
విద్యాపతికి ఈ సమయంలో ప్రభువులవారు ఎందుకిలా నవ్వుతున్నారో అర్థంకాలేదు.
“ఏమి అప్రమత్తత మీది? వాడు భువనగిరి కోటలో అడుగుపెట్టాడు. దాదాపు నాతో విష పానీయం తాగించేంత దగ్గరకు వచ్చాడు?” కోపంగా అన్నాడు త్రిభువనుడు.
“వాడు అధికారిక అనుమతితోనే కోటలోకి ప్రవేశించాడు”.
“ఎవరిచ్చారు ఆ అధికారిక అనుమతి?” ప్రశ్నించాడు త్రిభువనుడు.
“ఆ అనుమతి ఎవరిచ్చారో తెలిస్తే మీరు నమ్మలేరు ప్రభూ!”.
“ఎవరా ద్రోహి?” మరింత కోపంగా అడిగాడు.
“అనంతపాల సేనాని ప్రభూ!” చెప్పలేక చెప్పాడు విద్యాపతి.
పక్కన పిడుగు పడ్డట్టుగా అనిపించింది.
‘ఏమిటీ విపరీతం? అనంతపాలుడు ఈ ద్రోహులకు కోటలోకి రావడానికి అనుమతి ఇవ్వడమేమిటి?’

-అల్లాణి శ్రీధర్‌

(మిగతా వచ్చేవారం)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement