e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home చింతన యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం

జరిగిన కథ

శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. ఆ తర్వాత, ఎన్నో మలుపులు. యుద్ధ రూపంలో ఓ తీవ్ర సంక్షోభం ఎదురవుతుంది. అంతలోనే..

- Advertisement -

ముద్దులు మూటగట్టినట్టున్న పసివాడు.. చెన్నయ్య!
జీవితాంతం తోడూనీడగా నిలిచి ఉంటామని.. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యాభర్తలు.. వరలక్ష్మి, నారాయణ!
పిల్లవాడిని నీళ్లలో పడకుండా కాపాడిన అమృతమూర్తిని చూసి, ఆమె మాటల్లోని మానవత్వం, పరిణతీ చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు.
అప్పుల బాధను తట్టుకోలేక, కరువులో జీవితం బరువై.. మరోదారి ఏదీ కనబడక, ఇంక ‘మాకు వెలుగు లేదు.. చీకటి తప్ప!’ అనుకొంటున్న సమయంలో ఈ ‘తల్లి’ కనిపించడం, రుణ విమోచన అన్నది పెద్ద సమస్యకాదని చెప్పడం… ఓ పట్టాన వాళ్లకు నమ్మకం కుదరలేదు.
బయటి నుండి వినేవారికి సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. ‘ఇదేం పెద్ద విషయమా?’ అనిపిస్తుంది. కానీ, ఆ సమస్యలో కూరుకుపోయిన వారికి.. అది జీవన్మరణ విషయంగా పరిణమిస్తుంది. అందుకే, ఆ మహిళామణికి తమ సమస్య అర్థం కాలేదనీ, తీవ్రత తెలియదనీ, పరిహాసంగా కనిపిస్తున్నదనీ అనుకొన్నారు నారాయణ, వరలక్ష్మి దంపతులు.
కానీ, ఎప్పుడైతే తమలపాకులోని కుంకుమ గాలిలో కలిసిపోతూ, దాని మధ్యలో ‘నరసింహా’ అనే అక్షరాలు కనిపించాయో.. వాళ్లకు ఇంకేమీ కనిపించలేదు.
ఈ అమృతమూర్తి సాధారణ మహిళ కాదు, ఎవరో దైవాంశ సంభూతురాలని అర్థమైంది.
“అమ్మా! ఎవరమ్మా మీరు? ఈ తెల్లవారుజామున ఇక్కడ, ఈ నది ఒడ్డున ఏం చేస్తున్నారు? మా పిల్లవాడు మీకు ఎలా కనిపించాడు? చెప్పండమ్మా!”
ఆనందం ఒకవైపు, ఆశ్చర్యం ఒకవైపు కలగలసిపోగా, వినయంగా అడిగింది వరలక్ష్మి.
ఆమె అమాయకమైన, ఆత్మీయమైన ప్రశ్నకు చిన్నగా నవ్విందామె.
“నేనా? ఒక పుణ్య పురుషుడికి ఇల్లాలిని. అనేక మంది పిల్లలకు తల్లిని..” సుందరమైన దరహాసం విరిసింది ఆమె మోములో!
ఎంత తేజస్సు.. ఎంతటి ప్రశాంతత!
“నీకు ఎంతమంది పిల్లలు అక్కా?” అంటూ, వరలక్ష్మి అ
డిగింది.. ఏదో సొంత అక్కను అడిగినట్టు..
“చాలా మంది” అని చెప్పిందామె.
“అంటే?” నారాయణ అడిగాడు.
“కాన్పులో కంటే, ఆ కన్నపిల్లలకే కన్నతల్లి అవుతుంది. ఆ తల్లి.. కనిపెట్టుకొని ఉంటే, ఎంతో మందికి ‘అమ్మ’ అవుతుంది అంటారు కదా! అలా నన్ను కూడా చాలా మంది ‘అమ్మా’ అంటుంటారు. నన్ను ఏదేదో ఇమ్మని అడుగుతారు. మారాం చేస్తారు. ‘అసలు.. అడిగింది ఇస్తావా? ఇవ్వవా?’ అంటూ నామీద అధికారం ఉన్నట్టు. నా మీదనే ఆధారపడి ఉంటారు కొందరు. వారికేమేం కావాలో అవన్నీ ఇవ్వాలి కదా!” ఆమె మాటలకు అడ్డొస్తూ అన్నది
వరలక్ష్మి..
“అసలు నువ్వెవరమ్మా? నీ పేరేమిటి?
ఊరేమిటి?”
ఆ మాటలను విని నవ్వుకుందా తల్లి.
“నాపేరు ఒకటని కాదు..
చాలా పేర్లున్నాయి”
“ఏంటమ్మా.. మా కథంతా మీకు చెప్పుకొన్నాం కదా అని మమ్మల్ని లోకువగా చూస్తున్నావ్‌. ఒక మనిషికి ఇన్ని పేర్లెందుకు ఉంటాయ్‌! ఇదిగో ఈమె నా భార్య వరలక్ష్మి. నువ్వు చెప్పినట్టు పదిరకాల పేర్లు లేవు. నీకే కాదు.. ఎవరికీ అలా ఉండవు..”
“అవునా నారాయణా! నీ భార్యకు ఎన్ని పేర్లున్నాయో తెలుసా మరి?”
“తెలీదు.. నువ్వు చెప్పు తెలుసుకొంటా. నా భార్యకు ఎన్ని పేర్లున్నాయో!” కోపంగా అడిగాడు నారాయణ.
“చెప్పనా మరి.. పెళ్లికాక ముందు ఈ ‘వరలక్ష్మి’ని ఆమె అమ్మానాన్నా ‘వరం’ అని పిలిచేవాళ్లు. ఎందుకంటే, ఆడపిల్ల ఆ ఇంటి మహాలక్ష్మి అని, వర ప్రసాదం అనీ! పెళ్లయిన తర్వాత ఈ వరలక్ష్మి, నారాయణ గారి ‘భార్య’ అయ్యింది. అత్తమామలు ఇష్టపడే ‘కోడలు’ అయ్యింది. బిడ్డ పుట్టాక.. చెన్నయ్యకు ‘తల్లి’ అయ్యింది. ఈ వరలక్ష్మి ‘కుమారి’ నుంచి ‘శ్రీమతి’ అయ్యి, ఫలానావారి కోడలు, ఫలానావారి సతీమణి, ఫలానావారి మాతృమూర్తి.. ఒక్క మనిషికి ఎన్ని పేర్లు! మరి దీనికేమంటావ్‌?”.. నారాయణను సూటిగా అడిగింది.
ఆమె మాటలు విన్నాక నారాయణ మౌనం వహించాడు.
వరలక్ష్మి మనసు మాత్రం ఏదో మంత్రం వేసినట్టు అయ్యింది.
నిజమే!
అమ్మా – అయ్యా తనను ‘వరం’ అని పిలిచేవాళ్లు. దేవుడిచ్చిన వరప్రసాదం అనేవాళ్లు.. తనను.
అమ్మ ఒడిలో తను పెరిగింది కానీ, గుండెల్లో పెట్టుకొని పెంచాడు తండ్రి. పూల తోటలో విరిసిన మల్లె పూవులాగా చూసుకొన్నారు అవ్వా, అయ్యా! ఈ భూమీ, ఈ ఆకాశం.. పొలాలు, చెరువు గట్లూ ఇవన్నీ తనకే సొంతం
అనిపించేది.
రెక్కలల్ల అదుముకొని పిట్టతల్లి పసిగుడ్డును ఎట్లా కాపాడుకుంటుందో.. అంతకన్నా ఎక్కువగా పెంచారు తనను.
‘వరం’ అప్పుడు తన పేరు..
కానీ, ఇప్పుడనిపిస్తున్నది తను అమ్మ, అయ్యలకు ‘వరం’ కాదు. తనకే.. అమ్మా, అయ్యా ఇద్దరూ ‘వరం’ అని!
ఏమయినై ఆ బంగారు రోజులు. ఎక్కడ కరిగిపోయినై!
‘జర పయిలం బిడ్డా!’ అని అమ్మ హెచ్చరిస్తున్నట్టే.. ఆ పిలుపు ఇంకా తన చెవులల్ల వినబడుతున్నది.. ఇప్పుడే పిలుస్తున్నట్టు!
ఉరుకుతుంటే.. వెనుక నుండి అమ్మ
పిలిచినట్టు!
అరికాల్లో కస్సున దిగబోయిన ముల్లు.. అమ్మ పిలుపుతో వెనకకు చూడటం వల్ల పక్కకు జరిగి, ముక్కలుగా విరిగిపోయిన జ్ఞాపకాలు.. ఎన్నెన్నో..
అప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.. ఆ తల్లి.
జీవితంలో తన బిడ్డ తప్పటడుగు
వేయకుండా!
కానీ,
బతుకు బరువై, గుండె చెదిరిపోయినప్పుడు తనకు అమ్మ అండ లేకుండా పోయింది.
అమ్మ ఉండుంటే.. ఇట్లా జరగనిచ్చేది కాదేమో!
అవును.. అమ్మే ఉంటే..
ఉంటే ఏమిటి? ఉందిగా!
ఈమే.. అమ్మ. మా అమ్మ!
“అమ్మా!..” చెంపలమీద నుండి కన్నీటి బొట్లు రాలుతుండగా, వరలక్ష్మి అమ్మవంటి ఆ మనిషిని బిగ్గరగా కావలించుకొంది.
ఆశ్చర్యపోయాడు నారాయణ.
“వరలక్ష్మీ! ఏందిది? ఈమెను పట్టుకొని ఏడుస్తున్నవేంది?”
అయోమయంగా అడిగాడు.
“అవునయ్యా! ఇగో ఈమెనే మా అమ్మ.. నా బిడ్డను కాపాడింది మా అమ్మ!” ఏడుస్తూనే చెప్పింది.
“నన్ను మీ ఇంటికి పంపిన రోజు.. మా అమ్మ నాకు ఎన్ని జాగ్రత్తలు చెప్పింది. అత్తింటి దగ్గర ఎట్లుండాలె? తండ్రిలాంటి మామయ్యను, తల్లిలాంటి అత్తయ్యను ఎట్ల గౌరవించుకోవాలె? బిడ్డల్లాంటి ఆడబిడ్డలను, మరుదులను ఎంత అభిమానంగ చూసుకోవాలె.. అన్నీ చెప్పింది. ఇప్పటికీ ఒక్కో మాటా నాకు గుర్తుంది..”
అత్తామామా గుర్తుకొచ్చి, నారాయణకు కండ్లు చెమర్చాయి.
అవును.. ఎంత ప్రేమ మనుషులు. ఎప్పుడు ఇంటికి పోయినా, ‘తినిపో బిడ్డా!’ అనేవాళ్లు.
వాళ్లను తల్చుకొంటే.. తనకే ఇట్లుంటే, మరి వరలక్ష్మికి ఎట్లుండాలె?
“అమ్మా! నిన్ను నేను ‘అమ్మా’ అని పిలువొచ్చా?” ఆర్తిగా అడిగింది.
“అమ్మను ‘అమ్మా’ అని పిలువడానికి అనుమతీ, అంగీకారం కావాలా? నీవంటి వాళ్లు నాకెందరు లేరు బిడ్డలు..”
నారాయణకు ఏమీ అర్థం కాలేదు.
ఒకవైపు బతుకు దీపాన్ని ఊదేస్తున్న యమకింకరుల వంటి అప్పులవాళ్లు. మరొకవైపు జీవితంలో వెలుగు వస్తుందంటున్న ఈ అమ్మ
కాని అమ్మ.
“నీ మాటలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ‘ఎవరు నువ్వు?’ అని ఎన్నిసార్లు అడిగినా నీపేరు చెప్పవు. నీ ఊరు చెప్పవు. పోనీ నీ భర్త పేరైనా చెప్పు?” అడిగాడు నారాయణ.
“నా మగనిపేరు నా నోటితో ఎట్లా చెప్పను నారాయణా.. ఆయన సింహం లాంటోడు”
“అంటే.. చాలా గొప్పోడన్న మాట. ఏ రాజ్యానికి రాజు తల్లీ మీ ఆయన?”
“ఆయన అడవిలో మృగరాజు కంటే గొప్పోడు. రాజులందరికీ రాజాధి రాజు. చాలా మంచివాడు. మనసారా అడిగితే చాలు.. మనకేది కావాలంటే అది ఇచ్చేస్తాడు. తప్పుడు పనులు చేసేవాళ్లు కనిపించారా.. వాళ్లు ఎంతటి శక్తిమంతులైనా సరే, డొక్క చీల్చి, పేగులు బయటకు లాగుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మంచోళ్లకు మంచోడు. చెడ్డోళ్లకు చెడ్డవాడు” తన్మయత్వంతో చెప్పిందామె.
“అన్నట్టు.. నా పేరుకూడా లక్ష్మీనే”
“అమ్మా.. నువ్వు చెప్పింది వింటుంటే, ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తున్నది. ఇంతకూ ఆయన ఎక్కడ ఉంటారమ్మా?” ఆరాధనా భావంతో అడిగింది వరలక్ష్మి.
“ఆయన ఎక్కడో ఉండటమేమిటి? నా హృదయంలో ఉంటాడు”.
“అవునా.. మరి నువ్వు ఎక్కడుంటావు తల్లీ..” అర్థంకాక అడిగాడు నారాయణ.
“ఎక్కడో ఏమిటీ? నేను ఆయన హృదయంలోనే ఉంటాను”.
దంపతులిద్దరికీ ఆమె చెప్పిందేమిటో.. ఏమీ అర్థం కాలేదు.
“ఏందమ్మా ఇదీ! నువ్వేమో ఆయన గుండెల్లో ఉంటావా? మరి, ఆయనేమో నీ గుండెల్లో ఉంటాడా? అసలు మీరిద్దరూ ఎక్కడుంటారు?” నారాయణ ఆతృతగా అడిగాడు.
“మేమిద్దరం మా బిడ్డల గుండెల్లో ఉంటాం.. అర్థమైందా?” .. అర్థం కానట్టుగా తల అడ్డంగా ఊపారు.. దంపతులిద్దరూ.
“సరే, నా సంగతీ, మా శ్రీవారి సంగతీ వదిలిపెట్టండి. మీ పరిస్థితి ఎలా బాగుపడుతుందో చూద్దాం..” అంటూ ‘నరసింహా’ అనే అక్షరాలు ప్రత్యక్షమైన తమలపాకును భక్తిగా
కండ్లకద్దుకున్నది.
తరువాత ఆకాశానికేసి చూసింది.
ఎవరో ఏదో చెప్తే విన్నట్టు, తలూపింది.. చిరునవ్వుతో!
వరలక్ష్మిని దగ్గరకు తీసుకొని బొట్టు పెట్టింది.
అంతకుముందు క్షణంలో ఆమె చేతిలో కుంకుమ భరిణ లేకపోయినా.. అప్పుడే ఎలా ప్రత్యక్షమయ్యిందో వాళ్లు ఊహించలేక పోయారు.
రెండు చేతులూ మూసి, గుప్పిట్లో ఏదో వస్తువు ఉన్నట్టు కండ్లకు అద్దుకున్నది.
తర్వాత రెండు చేతులూ తెరిచింది.
ఆశ్చర్యం!
ఆమె చేతుల్లో పసుపు, కుంకుమ, గాజులు, రవికె బట్ట, వక్కలు, పండ్లు, తాళపత్రం ఉన్నాయి.
“తీసుకోమ్మా..” అన్నది.
వరలక్ష్మి చేతులు చాచబోయి, ఒకడుగు వెనక్కి వేసి తన కొంగు పట్టింది.
లక్ష్మి తన చేతిలో ఉన్నవాటిని ఆమె కొంగులో వేసి..
“నువ్వు కోరుకున్నది నెరవేరాలి..” అని ఆశీర్వదించింది.
“అమ్మా! మీరెవరో కానీ, మాకు దేవతలా కనిపిస్తున్నారు. మాకు అప్పుల బాధ తీరే మార్గం చెప్తానన్నారు” నారాయణ అడిగాడు.
“అదిగో.. ఆ పత్రం చూడండి. అందులో ఏమి రాసుందో చూడండి” అంటూనే, ఎవరో పిలుస్తున్నట్టుగా ఒక్కసారిగా ముందుకొచ్చి..
“స్వామీ.. స్వామీ.. వచ్చేస్తున్నా” అంటూ గబగబా నడుచుకొంటూ ముందుకెళ్లిపోయింది.
ఏమి జరుగుతుందో తెలుసుకొనేలోపే.. ఆమె క్రమక్రమంగా అదృశ్యమై పోయింది.
“ఎక్కడికి వెళ్లింది ఇంత త్వరగా?” ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ.
“ఎక్కడి నుంచి వచ్చిందో.. అక్కడికే వెళ్లిందేమో!” అంటూ, తాళపత్రం తీసి భర్తకు ఇచ్చింది వరలక్ష్మి.
‘శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో రుణ విమోచన ఎలా పొందాలి?’ అని ఉంది అందులో.. అందుకు ఏమి చేయాలో స్పష్టంగా ఉంది.
నారాయణ రెండు చేతులూ జోడించి, మనసులో భక్తిగా అనుకొన్నాడు..
‘ఓమ్‌.. నమో నారసింహాయ’

(మిగతా వచ్చేవారం)

-అల్లాణి శ్రీధర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement